– తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్లు తలోదారి
– ‘గ్రేటర్’లో సెటిలర్లు బీఆర్‌ఎస్ వైపే
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు
– చంద్రబాబు అరెస్టు పరిణామాల్లో కమ్మ వర్గంలో భిన్నాభిప్రాయాలు
– కాంగ్రెస్ వైపు ఒక వర్గం చూపు
– ఆ మేరకు కొన్ని కమ్మ సంఘాల పిలుపు
– బీఆర్‌ఎస్‌తోనే రక్షణ అంటున్న మరో వర్గం
– ఇప్పటికే బీఆర్‌ఎస్‌తో కమ్మ వ్యాపార వర్గ సంబంధాలు
– జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ వైపే కమ్మవర్గం
– కాంగ్రెస్ వైపు ఆంధ్రా రెడ్లు, కాపుల చూపు
– బీజేపీ వైపు బ్రాహ్మణ, వైశ్య వర్గాలు
– ఉత్తరాది ఓటర్లు బీఆర్‌ఎస్ వైపే
– లోక్‌సభకు మాత్రం ఉత్తరాది ఓటర్లు బీజేపీ వైపు
– ఈ చీలిక ఎవరికి మేలు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే ఆంధ్రా-ఉత్తరాది సెటిలర్ల మనోభావాలు విచిత్రంగా మారుతున్నాయి. ఈ విషయంలో వారిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాది-ఆంధ్రా సెటిలర్ల సంఘాలు-నాయకుల మాటలు బట్టి… వారి ఓట్లు ఏ ఒక్క పార్టీకీ గంపగుత్తగా పడే అవకాశం కనిపించకపోవడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు పరిణామాలు.. 60 శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తుండగా, గ్రేటర్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌కు గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం, 60 శాతం అనుకూలంగా కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలు, తెలంగాణ ఎన్నికలపై కొంతమేర కనిపించే అవకాశాలున్నాయి. అయితే అందులోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు బీజేపీ-వైసీపీ-బీఆర్‌ఎస్ కారణమన్న అభిప్రాయం, సెటిలర్లలో వంద శాతం లేకపోలేదు. కమ్మ వర్గంలో అయితే ఆ మూడు పార్టీలపై గొంతు వరకూ కోపం కనిపిస్తోంది. ఈ ప్రభావం తెలంగాణ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ ప్రకారంగా తెలంగాణ జిల్లాల్లోని కమ్మ సెటిలర్లు 60 శాతం, కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రేటర్‌లో కమ్మ వర్గం మాత్రం.. వ్యక్తిగత-వ్యాపార కోణంలో , అధిక శాతం బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మిగిలిన సెటిలర్లలో చీలికలు కనిపిస్తున్నాయి. ఇది ఆసక్తికర పరిణామం. ఈ ప్రభావం ఎన్నికలపై ఎంతవరకూ చూపిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.
రెడ్డి-కాపు సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. వీరి సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు. ఈసారి కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదల, ఆంధ్రా రెడ్లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రన గర్ నియోజకవర్గాల్లో ఆంధ్రా రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక సనత్‌నగర్, సికింద్రాబాద్, అంబర్‌పేట, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఆంధ్రా కాపులు అధికంగానే ఉన్నారు.
అయితే బ్రాహ్మణ-వైశ్య సెటిలర్లు మాత్రం, బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మల్కాజిగిరి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, శేరిలింగపల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఈ వర్గాల సంఖ్య సంతృప్తికర స్థాయిలోనే ఉంది. వీరికి ఉత్తరాది ఓటర్లు కూడా కలవడంతో, బీజేపీ ఓటు శాతం పెరిగే అవకాశం లేకపోలేదు.
నగరంలో ఉత్తరాది ఓటర్ల సంఖ్య కూడా, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగానే ఉంది. సనత్‌నగర్, గోషామహల్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో ఉత్తరాది ఓటర్ల సంఖ్య ఎక్కువ. చార్మినార్, మలక్‌పేట నియోజకవర్గాల్లో కూడా.. సంతృప్తికర సంఖ్యలోనే ఉత్తరాది ఓటర్లు ఉన్నారు. గోషామహల్ వంటి నియోజకవర్గాల్లో విజయాన్ని శాసించేది ఉత్తరాది ఓటర్లే కావడం ప్రస్తావనార్హం.
అయితే వ్యాపారవర్గాలయిన ఉత్తరాది ఓటర్లు, ఎన్నికల సమయంలో కొన్నేళ్ల నుంచి లౌక్యం ప్రదర్శిస్తున్నారు. స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీలకు, లోక్‌సభకు జాతీయ పార్టీలకు ఓట్లు వేస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. గతంలో టీడీపీ-కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అసెంబ్లీ-కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ-కాంగ్రెస్‌కి ఓట్లు వేసిన ఉత్తరాది ఓటర్లు, లోక్‌సభకు మాత్రం బీజేపీకి జైకొట్టారు.
ఇప్పుడు కూడా అసెంబ్లీ-కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తున్న ఉత్తరాది ఓటర్లు, లోక్‌సభకు బీజేపీకి వేస్తున్నారు. ఆ విషయాన్ని ఉత్తరాది కుల సంఘాలు, రాజకీయ పార్టీలకు తమ వైఖరి ముందుగానే స్పష్టం చేస్తున్నాయి. ఆ ప్రకారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాది ఓటర్లు, మళ్లీ బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని కమ్మవర్గాల్లో కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌లో ఎవరికి ఓటు వేయాలన్న దానిపై, చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం.. ఆయా పార్టీలతో ఉన్న వ్యక్తిగత సంబంధాలు, వ్యాపారాల రక్షణ కోణమే. న గరంలోని బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పద్మారావు, కాలేరు వెంకటేష్ తప్ప మిగిలిన వారంతా టీడీపీ నుంచి వెళ్లినవారే.
అందులో కమ్మ వర్గానికి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీ కూడా టీడీపీ నుంచి వెళ్లినవారే. దానితో సహజంగా వీరికి స్థానిక కమ్మ నేతలు, స్థానిక ప్రముఖలు, సంఘాలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ తరహా కమ్మ వర్గం మాత్రం, బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతోంది. సనత్‌నగర్‌లో కమ్మ, క్షత్రియ, కాపులతో పాటు.. ఉత్తరాది ఓటర్లతో మంత్రి తలసాని, దశాబ్దాల నుంచి వ్యక్తిగత స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారు.
గోదావరి జిల్లాలకు చెందిన రాజు-కాపులు.. గుంటూరు-కృష్ణా, ప్రకాశం- గోదావరి జిల్లాలకు చెందిన కమ్మ వర్గ నేతలు తరచూ తలసాని పక్కనే కనిపిస్తుంటారు. ఇక తలసాని స్థానికుడు కావడంతో, ఉత్తరాది వారితో వ్యక్తిగత సంబంధాలున్నాయి.
చంద్రబాబు అరెస్టుకు.. జగన్‌కు సహకరిస్తున్న కేసీఆర్ ఒక కారణమని తెలిసిన్పటికీ, స్థానిక అవసరాలు-ఆదరణ-ర క్షణ కోణం దృష్ట్యా, వీరంతా బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. తొలినుంచీ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న కమ్మ టీడీపీ సంప్రదాయవాదులు, కాంగ్రెస్‌కు ఓటేసేది లేదంటున్నారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. గతంలో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినప్పటికీ, సంప్రదాయ టీడీపీ వాదులు కాంగ్రెస్‌కు ఓటు వేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ-రంగారెడ్డి-నిజామాబాద్ జిల్లాల్లోని కమ్మ వర్గం మాత్రం, బీఆర్‌ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతుండం విశేషం. ముఖ్యంగా ఖమ్మం-నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కమ్మ వర్గం పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌కే జై కొడుతోంది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని సెటిలర్ల ఓట్ల కోసం, బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచి పెద్ద ఆసక్తి చూపించలేదు. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదు. వారితో ఆయా పార్టీల నేతలకు పెద్దగా సత్సంబంధాలు కూడా లేవు. తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ రెండు పార్టీలు సెటిలర్లను పెద్దగా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ భిన్నంగా వ్యవహరించి, సెటిలర్లకు కార్పొరేటర్-ఎమ్మెల్యే సీట్లు కేటాయించింది. దానితో సహజంగానే సెటిలర్లు, బీఆర్‌ఎస్ స్థానిక ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అదే ఇప్పుడు గ్రేటర్‌లో ఆ పార్టీకి అనుకూల అంశంగా కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌కు సంబంధించి సెటిలర్లలో, కొంత సానుకూలత-మరికొంత ప్రతికూలత కనిపిస్తున్నప్పటికీ… బీజేపీ పట్ల మాత్రం వంద శాతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవేళ చంద్రబాబునాయుడు జైలు నుంచి విడుదలయి, బీజేపీకి ప్రచారం చేసినప్పటికీ, ఆ పార్టీ వైపు సెటిలర్లు సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు.