Suryaa.co.in

Features

రహదారులు కాలి బూడిదవుతున్నాయి

(డా. యం. సురేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక)

ఒక వైపు పర్యావరణం కాలుష్యభరితమవుతుంటే, మరోవైపు కలుషితాలను కడిగివేసే అడవులు, వృక్ష సంపద అంతకంతకూ హరించుకుపోతున్నాయి. మరోవైపు రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఐలాండ్, రహదారులు ఇరువైపుల ఎక్కడపడితే అక్కడ నిప్పంటుకుని పచ్చని చెట్లు కాలి బూడిదవుతున్నాయి. ఇదే అదనుగా ఆకతాయిలు ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో అడ్డు అదుపు లేకుండా చాల చెట్లు, తోటలు కాలిపోతున్నాయి.
ఫారెస్ట్ బీట్ ఆఫిసర్లు, రెవెన్యూ సిబ్బంది జిల్లా యంత్రాంగం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప , నష్ఠాన్ని నివారించలేక పోతున్నారు. పర్యావరణంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రాణవాయువు అందించేందుకు వృక్ష జాతికి మించిన ఉత్తమ మార్గం మరొకటిలేదు. భూమిపై కనీసం నాలుగవ వంతు అడవులు వుండాలని పర్యావరణవేత్తలు చెబుతున్నా పెడచెవిన పెట్టి నిత్యం పచ్చిక బయళ్లు, కొండకు నిప్పు పెట్టి మనుషులు తమ రాక్షస ప్రవృత్తిని చాటుతున్నారు.

రెండు రోజుల క్రిందట ఆకతాయిలు పెట్టిన కార్చిచ్చు కు ఆత్మకూరు లో సుమారు పది ఎకరాలు బుగ్గిపాలైనది, గుత్తి, పామిడి మండలంలో కొంతమేరకు బుగ్గిపాలయ్యింది. చాల మూగ జీవాలు వేల కొద్దీ చెట్లు కాలి బూడిదయ్యాయి. ప్రతి నిత్యం అనంతపురం నుండి గుత్తి రహదారి మధ్యన జాతీయ రహదారి లో మంటలు చెలరేగుతున్నా, పచ్చని చెట్లు కాలి బూడిదవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

కొండలు, గుట్టలు బొగ్గుల కోసం బుగ్గిపాలవుతున్న ఆపే అధికారులు లేరు. ప్రజలకు పర్యావరణ ప్రాముఖ్యత వివరించాల్సిన అధికారులు, పౌర సంఘాలు, ఎన్జీఓ లు ఆ వైపుగా కృషి చేయటంలేదు. మార్చి నెల మొదటి వారంలోనే 35-36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం దీనికి తోడు చెత్తకు నిప్పు పెట్టే క్రమంలో రోడ్లు పచ్చని చెట్లు అగ్నికి ఆహుతవుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు.

గత మూడు రోజులుగా తొండపాడు, జక్కలచెరువు, బందార్లపల్లి, మల్లేనిపల్లె కొండలకు నిప్పు పెట్టారు. పర్యావరణ కాలుష్యన్ని నివారించాలి. మనం చేసే పనుల వలన అన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. దాన్ని నివారంచటం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతోంది. ఇంధనం వాడకాన్ని తగ్గించాలి.

కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలి. ఫారెస్ట్ బీట్ నిర్వహించాలి, నేషనల్ హై వే అథారిటీ, రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో జిల్లా, మండల మరియు పంచాయితీ స్థాయిలో పర్యావరణ ప్రాముఖ్యత గురించి ప్రజలను భాగస్వాములను చేసి నష్టాన్ని నివారించాలి. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, సైన్స్ ప్రచార వేదికలు స్వచ్చంధ సంస్థలు ప్రజలను చైతన్యపరచాలి.

 

LEAVE A RESPONSE