జగన్ ని భయపెడుతున్న RRR

Spread the love

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఒక పీడకల. అగ్ర నాయకత్వానికి ఊహించని దెబ్బ, ఇతర నాయకులకు కోలుకోని దెబ్బ. ఏం జరిగిందో తెలుసుకునే లోపు… జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, వైయస్సార్సీపి పరిపాలన ప్రారంభమైంది.

2019 మే 30వ తేదీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత… జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో…. ఎన్నో పాలనాపరమైన తప్పులు జగన్ చేశాడు. నూతన ఇసుక విధానం పేరుతో జగన్ చేసిన ప్రయోగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ. ఇలా ఎన్నో పాలనాపరమైన అంశాలలో జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్న ప్పటికీ, పోరాటం చేయలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది. పాలనాపరమైన తప్పులతో పాటు, తెలుగుదేశం నాయకుల పై, కార్యకర్తలపై వరుసగా అక్రమ కేసులు పెట్టి అధికార పార్టీ సృష్టించిన బయోత్పాతం వల్ల…… షాక్ లో నాయకత్వం, నిస్సహాయ స్థితిలో కార్యకర్తలు ఉండిపోయారు.
జగన్ పాలనా వైఫల్యాలు ఒక్కొక్కటిగా జనానికి అర్థం అవుతున్నాయి. ప్రత్యేక హోదా వదిలేసాడని, పోలవరం ఆపేసాడని, విభజన హామీల జోలికి వెళ్ళడని, తన కేసులలో మోడీ మద్దతు కోసం, రాజీ పడ్డాడని… క్రమంగా అందరికీ అర్థం అవ్వటం ప్రారంభమైంది. అయినా ప్రతిపక్షాలు…. నిస్తేజంగా చూస్తూ ఉండిపోయాయి.

అలాంటి దశలో 2019 డిసెంబర్ 17న మూడు రాజధానుల గురించి, రాష్ట్ర శాసనసభలో జగన్ ప్రకటన చేశాడు. ఆ మరుసటి రోజే అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రతిపక్షాలన్నీ నిస్సహాయంగా చూస్తున్న రోజుల్లో, అరాచక పాలనను వ్యతిరేకించి, జగన్ విధానాలను ప్రశ్నించి, రోడ్డు ఎక్కిన మొట్టమొదటి ప్రజాసమూహం…. అమరావతి రైతులు. జగన్ వ్యతిరేకించే పార్టీలన్నిటికీ ఎడారిలో వైయాసిస్సులా దొరికిన ఊహించని అవకాశం అమరావతి ఉద్యమం. అప్పటివరకు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై, నిలబడి పోరాటం చేసే ప్రయత్నం, ఏ ప్రతిపక్ష పార్టీ చేయలేదు. తెలుగుదేశం కార్యకర్తలకు స్థానిక నాయకుల మద్దతు లేకపోవడం, గతంలో అధికారం అనుభవించిన స్థానిక నాయకులు, జగన్ పై పోరాడటానికి ముందుకు రాకపోవడం వాస్తవం.

ఈ నేపథ్యంలో…. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక పెద్ద కుదుపు… రైతులు ప్రారంభించిన అమరావతి పరిరక్షణ ఉద్యమం. అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించింది… రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులే… కానీ ఆ ఉద్యమానికి ఊపిరి పోసి, నిలబెట్టింది మాత్రం..TV 5, ABN చానళ్లు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు. మారుతున్న పరిస్థితులను ముందుగా గుర్తించిన వ్యక్తి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. జగన్ మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకంగా, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ సమితికి సంపూర్ణ మద్దతు ఇచ్చి, స్వయంగా ఉద్యమంలో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగస్తులను చేసి, తెలుగుదేశం పార్టీలో ఒక కదలిక తీసుకువచ్చారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు, ఇతర ప్రతిపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా, అమరావతికి మద్దతు ప్రకటించడంతో, రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
అమరావతి ఉద్యమంతో క్రియాశీలకంగా మారిన తెలుగుదేశం పార్టీ, ఇతర అంశాలపై కూడా ప్రభుత్వంతో పోరాటం చేయడం కొనసాగిస్తుంది.

ఈ నేపథ్యంలోనే… స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా అధికార వైఎస్ఆర్సిపి రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా, తెలుగు దేశం పార్టీ మెజారిటీ జిల్లా స్థాయి నాయకులు కరోనా పేరుతో, వ్యాపారాల పేరుతో, కార్యకర్తలను గాలికి వదిలేసారు. మరో వైపు…. అక్రమ కేసుల నుండి ముఖ్య నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవడంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బిజీ అయిపోయారు.
ఇదంతా బయటకు కనిపించే రాజకీయ చిత్రం.

మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? క్యాబినెట్ సమావేశాలకు తప్ప, బయటికి రాడు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. పార్టీలో, ప్రభుత్వంలో సకల వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతుంటాడు, ఆయనే ప్రతి రోజూ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. మరి జగన్ ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానాలు రెండు.

ఒకటి
ఏ పథకాలు అయితే, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని జగన్ అనుకుంటున్నాడో, ఆ పథకాలకు అవసరమైన వనరులను, కేంద్ర నిధుల రూపంలో లేదా అప్పుల రూపంలో… వచ్చే ఎన్నికల వరకు సమకూర్చుకునే వ్యూహ రచన.

రెండవది
తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎలా దెబ్బ తీయాలి…. అనే వ్యూహరచన. పథకాలు అమలుకు అవసరం అయిన వనరులను సమకూర్చటంలో, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జగన్ కి సహకరిస్తుంది. అందుకే ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు అప్పులు ఇస్తుంది.

ఇక రెండో అంశం, రాజకీయంగా అత్యంత కీలకమైన అంశం …. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడం. ఈ అంశం మీద జగన్ చాలా లోతైన, సామాజిక సమీకరణలు చేస్తున్నట్టు… జిల్లా పరిషత్ చైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఎమ్మెల్సీ పదవులకు అనుసరించిన విధానం చూస్తే అర్థమవుతుంది. చాలా లోతైన సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. విజయవాడ లాంటి కీలక నగరంలో కూడా మేయర్ పదవిని ఎవరూ ఊహించని విధంగా ఒక బీసీ మహిళకు ఇచ్చాడు. జగన్ భాషలో చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పదవుల్లో పెద్దపీట వేశాడు, మంత్రివర్గంతో సహా.
పదవులు ఇచ్చాడు కానీ పవర్ ఇవ్వలేదు అన్న విషయం…. ఈ వర్గాలకు అర్థమయ్యే లోపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వాలని జగన్ వ్యూహం.

ఈ మొత్తం రాజకీయ ప్రక్రియలో…. జగన్ కు ఒక విషయం అర్థమై ఉండొచ్చు. కరోనా కారణంగా, కేసుల కారణంగా, కొంత మంది నాయకుల స్వార్థం కారణంగా…. చంద్రబాబు నాయుడు, మరో ముగ్గురు, నలుగురు నాయకులు తప్ప, తెలుగుదేశం నాయకులు క్రియాశీలకంగా లేకుండానే…. గ్రామస్థాయిలో కార్యకర్తలకు, నాయకుల అండ లేకుండానే… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, తెలుగుదేశం పార్టీ…. ఇంత పటిష్టంగా ఎలా ఉంది? అని ఆలోచించిన జగన్ కు…… ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ముందు వరుసలో RRR కనిపించి ఉంటారు. జగన్ దృష్టిలో RRR అంటే……
రామోజీరావు(ఈనాడు)
రాధా కృష్ణ(ఆంధ్రజ్యోతి)
రాజగోపాల్ నాయుడు(TV 5).
జగన్ ప్రజావ్యతిరేక విధానాలపై, ఆంధ్రప్రదేశ్ సమాజంలో వివిధ వర్గాలు చేస్తున్న పోరాటంలో వీరి పాత్ర చూసిన తర్వాత….జగన్ కి స్పష్టత వచ్చి ఉంటుంది.

నిజంగా,
గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారికి…. కొండంత అండగా నిలుస్తుంది ఈ మీడియా సంస్థలే. రాజకీయ పార్టీగా తెలుగుదేశం చేస్తున్న పోరాటం ఒక ఎత్తయితే…. వీరి పోరాటం మరో ఎత్తు. జగన్ పాలనలోని ప్రతి అంశాన్ని…. అందులోని లాభనష్టాలను… ప్రజా వ్యతిరేక అంశాలను…. ఈ మీడియా సంస్థలు అరటిపండు వలిచి పెట్టినట్టు, ప్రపంచానికి చూపిస్తున్నాయి. ప్రతిపక్షాల పోరాటానికి, ప్రజాసంఘాల పోరాటాలకు, దళితులు, మైనారిటీ, నిరుద్యోగ యువత, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు….. ఇలా ఏ వర్గం ఉద్యమించినా…. వాళ్ల గొంతుక గా ఈ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. తక్కువ సమయంలోనే పవర్ పాలిటిక్స్ లో పండిపోయిన జగన్ కి ఈ మీడియా ప్రభావం అర్థమైంది. అందుకే….. కనిపించే చంద్రబాబును వదిలేసి….. కనిపించని RRR పై దృష్టి పెట్టాడు. అంటే ప్రతిపక్ష పార్టీకి, ప్రజా సంఘాలకు, ఉద్యమ కారులకు గొంతులైన… ఈ మీడియా సంస్థలపై రాజకీయ దాడి మొదలుపెట్టాడు. ఈ కోణంలో జగన్ వ్యూహాన్ని అర్థం చేసుకుంటే… వచ్చే ఎన్నికల్లో జగన్ ఎత్తుగడలను కూడా అర్థం చేసుకోవచ్చు.

-డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు

Leave a Reply