– ఈ అవినీతికి చంద్రబాబే కారణమని తేల్చిన సీఐడీ
– ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు ముద్దాయి
– సీఎంగా ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు యత్నం
– ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే కుట్ర
– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్, వైయస్ఆర్ టియుసి అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి
తాడేపల్లి: ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ ద్వారా గతంలో రూ.121 కోట్ల అవినీతికి పాల్పడిన కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నేడు అధికారాన్ని ఉపయోగించుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు కుట్ర చేస్తున్నారని ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్, వైయస్ఆర్ టియుసి అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అన్ని ఆధారాలతో చంద్రబాబుపై కేసులు నమోదు చేసిందని, దీని నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ నే రద్దు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఐపీఎస్ అధికారులను తమ స్టేట్ మెంట్లను మార్చి చెప్పాలని ప్రభుత్వం బెదిరిస్తోందని అన్నారు.
2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ ఫైబర్‌నెట్ కార్పోరేషన్ ను ప్రారంభించింది. ఈ సంస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రూ.121 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతి బయటపడింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో సీఐడీ ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలను ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ అవినీతి వ్యవహారంలో చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఈ కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇందుకోసం ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ నే మూసేసేందుకు కుట్ర జరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో నిండా కూరుకుపోయిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో, దాన్నుంచి బయట పడేందుకు యథేచ్ఛగా అధికార దుర్వినియోనికి పాల్పడుతున్నాడు. అందుకోసం ఎంతకైనా తెగించేందుకు చంద్రబాబు వెనుకాడడం లేదు. గతంలో ఈ కేసులో తమ స్టేట్‌మెంట్ లను ఇచ్చిన ఐఏఎస్ అధికారులను బెదిరించడం, భయపెట్టడం ద్వారా, వారు తమ స్టేట్‌మెంట్ లను మార్చి చెప్పేలా వత్తిడి చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ పైబర్ నెట్ లో జరిగిన అవినీతి క్రమం ఇది…
2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో భారీ అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల మేరకు ఆనాటి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా టెండర్లు పిలిచింది. దీనిలో మొత్తం రూ.321 కోట్ల మేర అవకతవకలు జరగగా, తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో రూ.121 కోట్లకు సంబంధించిన అవినీతికి పక్కాగా ఆధారాలు దొరికాయి.
ఈ అక్రమాలకు కారణమైన టెర్రాసాఫ్ట్ సంస్థ గతంలో టెండర్ ప్రక్రియ లోపభూయిష్టం, పని చేయకపోయినా చేసినట్లు చూపడం, బిల్లులు తీసుకోవడం, నాసిరకం పరికరాల వినియోగం వంటి అవకతవకలకు పాల్పడటం వల్ల సదరు సంస్థను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అయితే ఆ సంస్థలో కీలక స్థానంలో పనిచేస్తున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఈ సంస్ధను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. దీనిలో భాగంగా నిబంధనలకు విరుద్దంగా టెర్రా సాఫ్ట్ కంపెనీపై విధించిన నిషేదంను తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించింది.
2015, మే 11న టెర్రాసాఫ్ట్ ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టగా, అదే ఏడాది ఆగస్టు 6న ఆ నిషేధం ఎత్తివేశారు. ఆ మర్నాడే ఏపీ ఫైబర్ నెట్ టెండర్లు పిలిచారు. ఈ టెండర్లకు ముందే ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన టెర్రాసాఫ్ట్ కంపెనీలో కీలక స్థానంలో పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను ఆ సంస్థ నుంచి రాజీనామా చేయించి, ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో డైరెక్టర్ గా నియమించారు. ఇదే వేమూరి హరికృష్ణ ప్రసాద్‌పై గతంలో హైదరాబాద్‌లో శిక్ష పడింది.
ఈవీఎంల ట్యాంపరింగ్ చేశాడని ముంబైలో కేసు నమోదైంది. అటువంటి వ్యక్తి ద్వారా ఏపీ ఫైబర్ నెట్ టెండర్లు టెర్రాసాఫ్ట్ కు కట్టబెట్టారు. ఈ మొత్తం ప్రక్రియలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. దొంగ చేతికే తాళం ఇచ్చిన చందంగా వేమూరి హరికృష్ణ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసిన అ అవినీతి కుంబకోణం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీఐడీ విచారణలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి.