Suryaa.co.in

Andhra Pradesh

కుంభమేళాలో పుణ్యస్నానం అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవం

– పులకించి పోయాను
– ఈ ఆధ్యాత్మిక అనుభవం అనిర్వచనీయం
– వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి: ప్రస్తుతం యుపిలో కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం నాడు ఆయన ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానమాచరించారు. ఈ పవిత్ర స్నానం తనకు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంతో పులకింప చేసిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ స్నానం సందర్భంగా హైందవ సంస్కృతి ప్రవాహం యొక్క విశిష్టతను అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం తనకు లభించిందన్నారు. ధనిక, పేద కుల, వ్యత్యాసాలకు అతీతంగా ఆధ్యాత్మిక వికాసానికి హిందూ ధర్మం చూపే విశ్వసనీయ మార్గానికి ఈ మహా కుంభమేళా సజీవ సాక్ష్యమని ఆయన అభివర్ణించారు. కోట్లాది మంది భక్తులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాగ్ రాజ్ వద్ద పవిత్ర స్నానం చేయటానికి యుపి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అభినందనీయమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడం తనకు సంతోషం కలిగించిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకలో నేను కూడా భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తన ప్రకటనలో వివరించారు. కోట్లాది మంది ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలకు ఈ కుంభమేళా ప్రతీకగా నిలిచిందనీ, హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన అభివర్ణించారు.

LEAVE A RESPONSE