– క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి డాటా ఎంతో ముఖ్యం
– ప్రభుత్వ పనితీరులో ఆర్టీజీ సహకారం ఎంతో అవసరం
– పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్
– ఒన్ గవర్నెన్స్, ఒన్ స్టేట్, ఒన్ సిటిజన్, ఒన్ డాటా విధానంతో పనిచేస్తున్నాం
– ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు, డీప్ టెక్‌తో పథకాల పర్యవేక్షణ
– ఆర్టీజీఎస్ ఈసీఓ కె. దినేష్ కుమార్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు, దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. టెక్నాలజీలో పాలన కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించారని తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ని సందర్శించారు.
ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ మంత్రికి స్వాగతం పలికి, ఆర్టీజీఎస్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ కలిగి ఉండటం అద్భుతమన్నారు. ఈ సాంకేతిక సదుపాయంతో ప్రభుత్వంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టగలమన్న నమ్మకం ఆర్టీజీఎస్‌ను చూశాకా కలుగుతోందన్నారు. టెక్నాలజీ కలిగి ఉండటం ఒక ఎత్తైతే, డాటా కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమన్నారు.
డాటా వాస్తవాన్ని చాటుతుందని, డాటాను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, పథకాలు అమలు తీరు, లబ్దిదారులకు పథకాలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌ను ప్రజలకు ఒక పద్దతి ప్రకారం క్షేత్రస్థాయిలో పంచాయతీ, పురపాలక స్థాయిలో అందించడానికి ఆర్టీజీఎస్ చక్కగా పనిచేస్తోందిని అన్నారు.
ఈ సమాచారంలో మంత్రులుగా మేం కూడా మా శాఖల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అలాగే కార్యక్రమాల అమలుకు ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకుని ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా ఉపయోగించుకోవచ్చని ఆర్టీజీఎస్‌ను చూశాకా నమ్మకం కలుగుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాంకేతిక సహకారం అందించడంలో అద్భుతంగా పనిచేస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ, ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్
సీఈఓ కె. దినేష్ కుమార్ ఆర్టీజీఎస్ గురించి మంత్రికి వివరిస్తూ ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా ప్రజలకు పాలన మరింత చేరువయ్యేలా ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆర్టీజీఎస్ అందిస్తోందని చెప్పారు. ఒకే ప్రభుత్వం, ఒకే రాష్ట్రం, ఒకే పౌరుడు, ఒకే డాటా విధానంతో స్మార్ట్ గవర్నెన్స్‌ను ప్రజలకు అందించే విధంగా ఆర్టీజీఎస్ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు తనవద్ద ఉన్న డాటా ఆధారంగా విశ్లేషిస్తోందన్నారు.
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అపారమైన డాటా లభ్యమవుతోందని, అయితే ఇప్పటి వరకు ఈ డాటా అంతా ఒకే చోట అనుసంధానం కాలేదని, ఆర్టీజీఎస్ ఇప్పుడు అన్ని శాఖల్లో లభ్యమవుతున్న డాటాను సేకరించి ఒక పెద్ద డాటా లేక్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు, డీప్‌టెక్ సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుని ఈ డాను విశ్లేషించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను ప్రభుత్వం అందించడానికి ఆర్టీజీఎస్ సహకారం అందిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ, ప్రతి పల్లెకు ఒక ప్రత్యేక ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు.