Suryaa.co.in

Features

చరిత్ర మరిచిన బైరాన్ పల్లి బలిదానం

బైరాన్ పల్లి బలిదానానికి 74 ఏళ్ళు. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఇప్పుడు సిద్దిపేటజిల్లాలో ఉన్న గ్రామం.భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో జలియన్వాలాబాగ్ ను మించిన నరమేధం ఆనాడు బైరాన్BYRANPALLY3 పల్లి,కూటిగల్ గ్రామాలలో జరిగింది. రజాకార్ల సైన్యాధిపతి మానవ మృగం ఖాసీం రజ్వి ఆకృత్యాలకు ఆగడాలకు అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ వీరబైరాన్ పల్లి.

నిజాం నిరంకుశ నరహంతక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి, ప్రాణాలర్పించిన కర్మభూమి బైరాన్ పల్లి. బైరాన్ పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు. చరిత్రలోకి తొంగి చూస్తే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం,సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా జరిగిన మహోన్నత పోరాటం.

తెలంగాణ ప్రాంతంలో భూమికోసం భుక్తికోసం విముక్తికోసం కాకతీయ రాజుల మీద తిరుగుబాటు చేసిన గిరిజన వీరవనితలు, సమ్మక్క సారాలమ్మ ప్రాణ త్యాగం మొదలుకొని .. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాలన్నీ నెత్తుటి చరిత్రనే లిఖించినాయి.

తెలంగాణ ఉద్యమాలలో పోరాటాలలో…
బైరాన్ పల్లి,కూటిగల్ వీరుల బలిదానం,త్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చిందనుటలో అతిశయోక్తి లేదు. బైరాన్ పల్లి కూటిగల్ ఈ రెండు గ్రామాలలోకి అడుగుపెట్టగానే ఊరు మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోటబురుజులు ఆనాటి నెత్తుటి చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తాయి,కూటిగల్ గ్రామం నుండి బైరాన్ పల్లి, వల్లంపట్లకు వెళ్లేదారిలోగల మర్రిచెట్టు అమరవీరుల త్యాగాలకు నేటికీ సాక్షిభూతంగా నిలుస్తుంది.

ఇక చరిత్రలోకి వెళితే 1947 ఆగస్టు 15 వ తారీకున దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవడంతో యావత్ భారతావని స్వాతంత్ర్య సంబరాల్లో మునిగితేలుతూ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుతుండగా, ఆనాడు 16 జిల్లాలతో కూడిన(మరాట్వాడా, బీదర్ ప్రాంతాల నుండి 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతం నుండి 8 జిల్లాలు)తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలపడానికి నిరాకరించినాడు.

ప్రత్యేక దేశంగా గుర్తించాలని లేదా కనీసం పాకిస్తాన్ లో అంతర్భాగంగా ఉంచాలని పాకిస్తాన్ పాలకుడు మహమ్మదాలీ జిన్నాతో మంతనాలు జరిపాడు. తన ప్రతినిధిని పంపించి ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయించాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి విఫలయత్నం చేశాడు. విదేశాల నుండి ఆయుధాలు దిగుమతి కోసం ప్రయత్నించాడు. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని , పరిపాలించాలని ఏకచత్రాధిపత్యం చలాయించాలని కలలుగన్నాడు.

ఇందుకోసం తన సొంత మిలటరీకి తోడుగా, కరడుగట్టిన మతోన్మాది ఖాశీం రజ్వి నాయకత్వంలో రజాకార్ల సైన్యాన్ని ఏర్పాటు చేయించాడు. రజాకార్లంటే నరరూప రాక్షసులు గ్రామాలపైబడి దోపిడీ చేయడం ఇండ్లుRAZAKAR-KILLINGS తగలబెట్టడం , హత్యలు మానభంగాలు ప్రజల మానప్రాణాలు దోచుకోవడం నానా అరాచకాలు సృష్టించారు. భర్త కళ్ళముందే భార్యను అత్యాచారం చేసేవారు. భార్య కళ్ళముందే భర్తను నరికిచంపేవారు. భర్తల ఆచూకీ చెప్పకపోతే పిల్లలను గాల్లోకి ఎగిరేసి, కత్తితో గుచ్చి చంపేవారు. పన్నులు చెల్లించని వారి గొర్ల కింద మాంసాన్ని కత్తితో కోసి, గోర్లు ఊడదీసి కారం చల్లేవారు. చెట్లకు తలకిందులుగా వేలాడదీసి కింద మంటలు పెట్టేవారు.

ఇవన్నీ సాధారణ శిక్షలు. పేదరికంలో మగ్గిపోతున్న ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసిన సొమ్ముతో రజాకార్లు విలాసాలు జల్సాలు భోగభాగ్యాలు చేసుకున్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే భాషకందని అరాచకాలు సృష్టించారు. ఈ అరాచకాలమీద కన్నెర్రజేసిన రామానందతీర్థ నేతృత్వంలో, ఆర్యసమాజ్ ఉద్యమాలు ఉద్భవించాయి.కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటాలు గెరిల్లాదళాలు గ్రామరక్షక దళాలు ఏర్పడ్డాయి, కమ్యూనిస్టులు గ్రామరక్షక దళాలకు ఆయుధాలు సమకూర్చారు. ఉద్యమం ఉదృతమైంది.

ఆనాటి ఉద్యమాలకు రావి నారాయణరెడ్డి,చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం,అరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం మాడపాటి హనుమంతరావు, షోయబుల్లా ఖాన్, సురవరం ప్రతాపరెడ్డి లాంటి యోధులు నాయకత్వం వహించారు. దాశరథి రంగాచార్యులు,కాళోజీ నారాయణరావుల కలాలు, కరాలBYRANPLAL-LY1 ధ్వనులు వినిపించాయి, నిజాం నవాబు గుండెలను వడ్రంగిపిట్ట లాగా తొలిచినాయి. వారి కవితలు రచనలు ఉద్యమానికి ఊతమిచ్చి ఊపిరి పోసినాయి.. దాశరధిని నిజాం ప్రభుత్వం జైల్లోఉంచగా, బొగ్గుతో గోడలపైన కవిత్వాలు రాసీ చైతన్యపరిచినాడు ఆయన రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ, ,కాళోజి అచ్చు తెలంగాణ యాసలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాసిన కవితలు, యాదగిరి రాసిన బండెనుక బండిగట్టీ.. సుద్దాల హనుమంతులాంటి కవుల కవితలు రచనల వల్ల ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష చిగురించింది.

ఆ రోజుల్లో జర్నలిస్ట్ ‘షోయబుల్లాఖాన్’ గొప్ప మానవతావాది ‘ఇమ్రోజ్’పత్రికా వ్యవస్థాపకుడు. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని కరాకండిగా చెబుతూ సంపాదకీయాలు రాసేవాడు. ‘ఇత్తేహాదుల్ ముసల్మీన్’ (అదే సంస్థ తర్వాత కాలంలో ‘ఎంఐఎం’ పార్టీగా అవతరించింది)BYRANPALLY2
సంస్థను నిషేధించాలని ఆనాడే తెగేసి చెప్పాడు ఆ సంస్థకు అధ్యక్షుడిగా ‘ఖాశీంరజ్వి’ వ్యవహరించేవాడు. 1948 ఆగస్టు 19వ తేదీన హైదరాబాదులో ఒక సభలో షోయబుల్లా ఖాన్ చేతులు నరికి వేస్తానని చెప్పాడు ఖాశీంరజ్వీ. ఆగస్టు 21వ తేదీన కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో, అతను వార్తలురాసే కుడి అరచేతిని నరికివేశారు దుండగులు. ఆగస్టు 22వ తేదీ షోయబుల్లాఖాన్ వీర మరణం చెందాడు.

ఇక ఇదే తరుణంలో వీరభైరాన్ పల్లి కేంద్రంగా పోరాటం ఉధృతమైంది గ్రామంలో ఇమ్మడి రాజిరెడ్డి, మోటం రామయ్య లాంటి చురుకైన యువకులు గ్రామ రక్షణదళంగా ఏర్పడి ప్రజల్ని చైతన్యపరిచారు. ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై దిక్కారస్వరం వినిపించి గ్రామమంతా ఒకతాటిపై నిలిచేలా చేశారు.ఇదే స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాలైన కూటిగల్ కొండాపూర్ బెక్కల్ లింగాపూర్ దూల్మిట్ట దోర్నాల వల్లంపట్ల గ్రామాలు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నాయి. గ్రామంలో చురుకైన యువకులకు ఆయుధ శిక్షణను ఇచ్చారు అప్పటి కమ్యూనిస్టులు.

అంతేకాదు ఆయుధాలు కూడా సమకూర్చారు.స్థానికంగా తయారుచేసుకున్న ఆయుధాలు కత్తులు గొడ్డండ్లు బరిసెలు ఒడిసెలు గుత్పలు కారపుముంతలు సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు గ్రామంలో రాత్రిళ్ళు గస్తీతిరిగేవారు. రజాకార్లు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రేబర్తి,మద్దూరు గ్రామాలను కేంద్రంగా చేసుకొని పక్క గ్రామాలపై దాడులు చేసేవారు.ఇదేక్రమంలో ఒకరోజు బైరాన్ పెళ్లి పొరుగున ఉన్న లింగాపూర్ దూలిమిట్ట గ్రామాలపైబడిన రజాకార్లు దోపిడీజేసి దోచుకున్న సొమ్ముతో బైరాన్ పల్లి మీదుగా వెళ్తున్న రజాకార్లు బైరాన్ పల్లి గ్రామ రక్షకదళం కంటపడ్డారు.

ఆనాటి గెరిల్లాదళం దూబూరి రాంరెడ్డి,ముకుందరెడ్డి, మురళీధర్ రావు సహాయంతో దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టారు,దిక్కార స్వరంతో రజాకార్లకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బైరాన్ పల్లి గ్రామంపై కక్షగట్టిన రజాకార్లు ఏ క్షణమైనా దాడిచేసే అవకాశముందని అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు పునర్నిర్మించుకున్నారు. బురుజుపైన మందుగుండు సామాగ్రి నిలువ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపలాఉండే ఇద్దరు వ్యక్తులు నగారా(బెజ్జాయి) మోగించేవారు, ఈ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్ కొండాపూర్ బెక్కల్ లింగాపూర్ దూల్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చేవారు.

1940 మే నెలలో 60 మంది రజాకార్లు బైరాన్ పల్లిపై దాడికి యత్నించి విఫలమయ్యారు. రెండవసారి 150 మంది రజాకార్లు దాడికి పాల్పడి ఓటమిపాలయ్యారు. ఇలా రెండుసార్లు దాడిచేసి విఫలమయ్యారు,ఈ దాడిలో 20 మంది రజాకార్లు చనిపోయారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ‘హాసీం’ బైరాన్ పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించాడు. బైరాన్ పల్లిని ఏరోజైనా నేలకూలుస్తానని పతినబూనాడు. ఇలా కక్ష పెంచుకున్న రజాకార్లు ఏదో ఒకరోజున పెద్దఎత్తున దాడి చేసే అవకాశముందని గ్రామంలో ఎవరూ ఉండవద్దని గ్రామ రక్షకదళానికి గెరిల్లాదళం పంపిన వర్తమానం అందలేదు. ప్రజలంతా నమ్మి వారిరోజువారి పనులలో నిమగ్నమయ్యారు.

దీంతో ఖాశీంరజ్వీ పర్యవేక్షణలో బైరాన్ పల్లిపై మూడవసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆగస్టు 26 రాత్రి నిజాం సైనికులు, రజాకార్లు అంతాగలిసి 500 మంది జనగామలో బసచేసి 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున ఒంటిగంటకు పదిబస్సుల్లో జనగామ-సిద్దిపేట దారిగుండా ముస్త్యాల మీదుగా బైరాన్ పల్లి గ్రామానికి బయలుదేరారు గ్రామం చుట్టూ డేరాలు వేశారు. తెల్లవారుజామున దొంగదాడికి సిద్ధంగా ఉన్నారు.రైతులు లేగలను,దూడలను ఆవుల వద్దకు పాలకు వదులుతున్న వేళ తెల్లవారుజామున 4గంటల సమయం. అప్పుడే బహిర్భూమికి వెళ్లిన ఉల్లెంగల నరసయ్యను అదుపులోకి తీసుకున్నారు.

ఆయనను వెంటబెట్టుకొని గ్రామంలోకి వస్తుండగా వారిని వదిలించుకొని నరసయ్య గ్రామంలోకి పరిగెత్తాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తంచేశాడు కేకలు వేశాడు. బురుజుపైన ఉన్న కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు, బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య,మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగులనుంచి వచ్చిపడ్డ నిప్పురవ్వలతో బురుజుపై నిల్వచేసిన మందుగుండు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్టే మట్టుబెట్టారు. అంతటితో ఆగకుండా ఇల్లిల్లూ తిరిగి 96 మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలుగట్టి వరుసగానిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు.

శవాలు గుట్టలుగావేసి వాటి చుట్టూ వందమంది మహిళలను చరబట్టి వివస్త్రలుగాచేసి బతుకమ్మలాడించారు. కొందరు మహిళలు ఇదంతా భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అదేరోజు తెల్లవారేసరికి కూటికల్ గ్రామం చేరుకున్నారు. ఊరు కరణందొర నర్సింగరావు సహాయంతో బురుజుపైన ఉన్న గ్రామరక్షక దళసభ్యులు 25మంది యువకులను ప్రాణహాని తలపెట్టమని నమ్మించి కిందికి దించారు. జోడు లెంకలుగట్టి ఊరు పొలిమేరలో ఉన్న మర్రిచెట్టువద్దకు తీసుకెళ్లారు.

వరుసగా నిలబెట్టి ఒకే తూటాతో 22 మందిని కాల్చి చంపారు ఆరోజు దాడినుండి తప్పించుకున్న ఆరె ఫకీరు,చింతకింది వెంకటయ్య అనే యువకులు పక్కనే ఉన్న జెనిగలవాగు తుంగలో దాక్కొని ప్రాణాలను రక్షించుకున్నారు. అలా రికార్డుల ప్రకారం రెండు గ్రామాలలో118 మందిని హింసించి కాల్చిచంపారు. కానీ ఈసంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

బైరాన్ పల్లి నరమేధం హింసకాండ సమాచారం అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అందింది. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనపరుచుకోవాలని సైనిక చర్యకు ఆదేశించాడు. సైనికాధికారిగా జే.ఎన్ చౌదరిని నియమించాడు. సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ సంస్థానానికి మూడు వైపుల నుండి భారతసైన్యం కవాతు ప్రారంభమైంది. రజాకార్ల ప్రతిఘటన భారతసైన్యం ముందు నిలువలేకపోయింది. నిజాంనవాబు ప్రాణం సంకటంలోబడింది.

కింగ్ కోటి నుండి బయలుదేరిన నవాబు లేక్ వ్యూ అతిథి గృహంలో తనచే గృహనిర్బంధంలో ఉంచబడిన భారత ప్రభుత్వ ప్రతినిధి కె.యం మున్షి శరణుగోరిండు. లొంగిపోవడం దప్ప తరుణోపాయం లేదని, నవాబుకు మున్షీ సలహా ఇచ్చిండు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన బైరాన్ పల్లి నరమేధం జరిగిన సరిగ్గా 21 రోజులకు నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయినాడు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా ఉంటుందని భారత సైన్యానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకోవద్దని రేడియోలో నవాబు ప్రసంగించాడు. నవాబు కబంధ హస్తాల నుండి తెలంగాణకు విముక్తి విమోచనం లభించింది.

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సమైక్యాంధ్ర వలస పాలకులు బైరాన్ పల్లి చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రపంచానికి చెప్పలేదు. అదో రాజకీయ కుట్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ పెద్దలుకూడా ఏనాడు బైరాన్ పల్లి గ్రామంవైపు చూడలేదు సందర్శించలేదు. బైరాన్ పల్లి-కూటిగల్ వీరులకు నివాళులులర్పించలేదు. బైరాన్ పల్లి గ్రామాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలని జలియన్వాలాబాగ్ లాగా అభివృద్ధి చేయాలని ఇక్కడి వీరుల త్యాగాలను విద్యార్థుల పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ బి.జనార్దన్ రెడ్డి 2008లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు.

కానీ అవి కార్యరూపం దాల్చలేదు. మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో సామూహిక పితృయజ్ఞం అమరవీరులకు పిండప్రధానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయనకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. త్యాగాల చరిత్ర కలిగిన బైరాన్ పల్లిని చుట్టూ ఉన్న గ్రామాలు కూటిగల్ బెక్కల్ వల్లంపట్ల లింగాపూర్ కొండాపూర్ దూలిమిట్ట దోర్నాల గ్రామాలతో కలిపి మండల కేంద్రంగా అభివృద్ధి చేసి, బెక్కల్ రామలింగేశ్వర స్వామి గుట్ట పరిసర ప్రాంతాలలో మండల కేంద్రానికి సంబంధించిన సామూహిక భవనాలు అభివృద్ధి చేస్తే బాగుండేదని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన బైరాన్ పల్లి కూటిగల్ వీరులచరిత్ర , అజరామరంగా నిలవాలని ముందు తరాలకు స్ఫూర్తి నివ్వాలని కోరుకుందాం.

LEAVE A RESPONSE