-రాజ్యాంగబద్ధంగా న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ వై ఎస్ సునీత కు హ్యాట్సాఫ్
-అమరావతి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్న మారీచ, సుభాహులు జగన్, సజ్జల
-కాపురం… కొత్త కాపురం అనే జగన్మోహన్ రెడ్డి పాట సమంజసమా?
-సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న రాజధాని కేసు
-అయినా తాను విశాఖపట్నం లో కాపురం పెడతానంటున్న సీఎం
-ఇడుపులపాయలో సీఎం కు ఓ ఇల్లు ఉంది… అది ఏమైనా రాష్ట్ర రాజధానినా?
-అలాగే ఉత్తరాంధ్రలోనూ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్యాలెస్ ఉంటుంది… అంతే తప్ప పెద్ద తేడా ఉండదు
-20వ తేదీ కావస్తున్నా 30 నుంచి 35 శాతం మంది విశ్రాంత ఉద్యోగులకు అందని పెన్షన్లు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి అనుభవం, లేకపోయినాప్పటికీ, వందమంది చిల్లర సలహాదారులను పెట్టుకొని, విజయకుమార్ వంటి న్యాయ మాంత్రికుని కలిశారని మీడియా కోడై కోస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి కాపురం… కొత్త కాపురం అని పాట పాడడం సమంజసమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు తెలియజేశారు. కాపురం… కొత్త కాపురం, ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం అని సినిమాలో పూరి గుడిసె వేసుకున్న హీరో కృష్ణ, హీరోయిన్ భారతి పాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి దంపతులు బెంగుళూరు, హైదరాబాదు, ఇడుపులపాయ, తాడేపల్లి లలో ప్యాలెస్ లు నిర్మించుకొని పాట పాడుకున్నారెమో. విశాఖపట్నంలో మరొక కోట నిర్మించుకొని సెప్టెంబర్ లో అదే పాట పాడుకుంటారెమో. కొత్త కోట లో కాపురం పెట్టబోయే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చిరు సిగ్గుతో ప్రజలకు తెలియజేయడం అద్వితీయం.
జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో, విశాఖ ప్రజల ముఖాలలో ఆనందం ఆవిరయ్యింది. ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నారు… ఇడుపులపాయ ఏమైనా రాష్ట్ర రాజధాని అయ్యిందా?, ఇప్పుడు విశాఖలో కోటను నిర్మించుకునే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ లోగా ప్యాలెస్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవచ్చు. పూర్తి అయిన వెంటనే, ఆయన విశాఖపట్టణం కోట లోకి పాలు పొంగించుకుని, లేదంటే కేకులు కట్ చేసి గృహప్రవేశం చేయవచ్చు. దానివల్ల పెద్దగా ఫరక్ పడేది ఏమీ లేదు. రాష్ట్ర రాజధాని ఏమీ మారదు. రాయలసీమలో ఒక ప్యాలెస్ ఉన్నట్లుగానే, ఉత్తరాంధ్రలోను ఆయనకు మరొక ప్యాలెస్ ఉంటుంది. అలాగే కోస్తాను, హైదరాబాదులో విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. తాజాగా చెన్నైలోనూ మరొక ప్యాలెస్ నిర్మిస్తున్నారట. ఎందుకంటే తమది జాతీయ పార్టీ కాబట్టి అని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజధాని కేసు వేసిన పిటీషన్ దారులు ముఖ్యమంత్రి కొత్త కాపురం ముచ్చట్లను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి అన్ని జోన్ ల కేసు విచారణకు రాగా, రైతుల తరఫున దేవదత్ కామత్ చక్కటి వాదనలను వినిపించారు. అమరావతిలో నవ నగరాలను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో కొత్త కాపురం పెట్టాలను కుంటున్న జగన్మోహన్ రెడ్డి, అమరావతి నవనిర్మాణ యజ్ఞాన్ని మారీచ, సుభాహు అనే రాక్షసుల మాదిరిగా విఘ్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను మారీచులు అని సంబోధించే ముఖ్యమంత్రి, అమరావతి నిర్మాణ యజ్ఞాన్ని అడ్డుకునేందుకు మారీచుడి అవతారం ఎత్తగా, ఆయనకు సుభాహు అనే రాక్షసుడిలా సజ్జల రామకృష్ణారెడ్డి తోడయ్యారు. అమరావతి నవ నగరాల నిర్మాణ యజ్ఞాన్ని , రాజధాని నగరంలో గుడిసెలు వేయించి అడ్డుకోవాలని చూస్తున్నారు. గత నాలుగేళ్ల క్రితం పూర్తయి, ప్రారంభించిన ఇళ్లను కూడా తానే నిర్మించినట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం దారుణం.
గత ప్రభుత్వ హయాంలో 90 శాతం నిర్మాణం పూర్తయి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధి దారులకు జగన్మోహన్ రెడ్డి అందించలేకపోయారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి, రాజధాని నగరంలోని 1134 ఎకరాలలో గుడిసెలు వేయించాలనే పథకరచన వెనుక కుట్ర కోణం స్పష్టమవుతుంది. పేదవాడికి ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి ప్రతిపక్షాలు అడ్డుపడు తున్నాయని ఆయన పేర్కొంటుంటే నవ్వొస్తుంది. హైకోర్టులో న్యాయం జరగకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. గతంలో హైకోర్టు తాను ఇచ్చిన తీర్పును తానే పరిగణలోకి తీసుకోకపోవడం అన్నది జరగకపోవచ్చు. రాజధాని నగరంలో నిజంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భావిస్తే, మరొక వెయ్యి ఎకరాల భూమిని సేకరించి, ఇళ్ల స్థలాలను కేటాయించాలి. రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో కడప, కర్నూలు, చిత్తూరు, పలాస ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి, తాను మాత్రం తన కాపురాన్ని విశాఖపట్నం మారుస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అమరావతి నగర నిర్మాణం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ఎలాగైనా అమరావతిని విధ్వంసం చేయాలన్నదే ఆయన ఎత్తుగడగా కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.
బాబాయి హత్యకు తోడేళ్లను పంపించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి
తన బాబాయి అయిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తోడేళ్లను పంపించారన్న అభియోగాలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను తోడేళ్లుగా సంబోధించే జగన్మోహన్ రెడ్డి, మన తోడేళ్లే బాబాయిని హత్య చేశాయని నిజ, నిజాలను సిబిఐ చెప్పిన విషయాన్ని విస్మరిస్తున్నట్లున్నారు . ఆ తోడేళ్ల వెనుక ఎవరు ఉన్నారనేది పక్కన పెడితే, తోడేళ్లను పంపించామన్న అభియోగాలను ఎదుర్కొంటూ, వై నాట్ 175 అని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. బ్యాంకులో డబ్బులు లేకుండానే బటనులు నొక్కుతూ అబద్ధాలు చెప్పడం ఎందుకనీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అమరావతిని ఏమి చేయవద్దు… రాజధాని ఇక్కడే ఉంటుంది. అమరావతిని చెడగొట్టాలనే మీ విశ్వ ప్రయత్నాలను ఆపితే మంచిది. ముందస్తు ఎన్నికలంటూ జరిగితే నవంబర్, డిసెంబర్ లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అలా కాదనుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లోనైనా నూతన ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అమరావతి అభివృద్ధిని ఊహించిన దానికంటే రెండింతలు నూతన ప్రభుత్వం చేసి చూపెడుతుంది. హైకోర్టు తన తీర్పు తాను కాదనుకుంటే, సుప్రీంకోర్టులో జూలై 23వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణకు వచ్చేవరకు అమరావతి పై జగన్మోహన్ రెడ్డి తన ప్రయోగాన్ని ఆపాలి. రాజధాని అభివృద్ధి చేయకపోతే, రైతులకు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు?. రాజధానిని సర్వనాశనం చేసి చేతులెత్తేసే కుట్రలు ఇకనైనా మానితే మంచిది. మారీచ, సుబాహుల అమరావతి యజ్ఞాన్ని భగ్నం చేస్తామంటే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
హైకోర్టు తీర్పు ను సుప్రీం లో డాక్టర్ వైఎస్ సునీత సవాల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ఊరట కలిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డాక్టర్ వైఎస్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. తన తండ్రికి జరిగిన అన్యాయంపై డాక్టర్ వైఎస్ సునీత రాజ్యాంగబద్ధమైన న్యాయపోరాటం చేస్తుంది. సాక్షి దినపత్రిక, సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న కట్టు కథలను చూసి, ఆమె ఊరుకోదని తన మనసుకు ముందే అనిపించిందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. తాను అనుకున్నట్లుగానే, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైఎస్ వివేక హత్య కేసు విచారణ ఆలస్యం అవుతుందనే, సుప్రీంకోర్టు విచారణ అధికారిని మార్చిన విషయం తెలిసిందే. అయినా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారే పదే, పదే కోర్టు లలో కేసులు వేస్తూ, విచారణ మరింత ఆలస్యం అయ్యేలా కుట్రలు చేస్తున్నారు. గతంలో హైకోర్టులో వైయస్ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, తాము ఈ కేసులో కలగజేసుకోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదే హైకోర్టులో మరొక ధర్మాసనం మాత్రం, ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. కోర్టులలో కేసులు వేయడం ద్వారా, ఈ కేసు విచారణలో 20 రోజులను నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారు హరించి వేశారు.
కేసు విచారణ ఆలస్యం కావడానికి సాక్షి దినపత్రిక, కుట్రలో భాగస్వామిగా ఉన్నది. సాక్షి రాసిన కథనాలని న్యాయవాదులు న్యాయస్థానానికి వినిపించారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటే, సీబీఐ నిప్పు అని సజ్జల, వైఎస్ ఫ్యామిలీ లు పేర్కొన్నాయి. ఇప్పుడు అదే సిబిఐతో, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారనడం వారికే చెల్లింది. ఒకవేళ నిజంగానే సిబిఐతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలే ఉండి ఉంటే, నాలుగేళ్లుగా ఆర్థిక నేరాభియోగ కేసులలో జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోయినా, ఆయన చూస్తూ ఊరుకొని ఉండేవారా? ఆరిపోయే దీపాన్ని ఎవరు కాపాడలేరనే విషయాన్ని తమ పార్టీ నాయకులు తెలుసుకుంటే మంచిదని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని అనుసరిస్తూ, తన తండ్రి హత్యకు కుట్ర చేసిన నిజదోషులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతను ప్రజాస్వామ్య వాదులంతా అభినందించాలని ఆయన కోరారు.
దొరకని ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్
ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన యధావిధిగా కొనసాగే అవకాశం ఉందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు . రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. గతంలో అప్పుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి రావత్ లు ఢిల్లీలో అప్పుల కోసం తిరిగేవారు. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని విదేశీ పర్యటన రద్దు చేసుకొని, తమకు అందుబాటులో ఉండాలని కోరిన జవహర్ రెడ్డి, ఇప్పుడు ఆయనకు ఏమి చెబుతారో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలకుమార్జిన్ మనీ చెల్లించకుండానే, ఆ పథకాల అమలుకు సంబంధించిన పదివేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ఢిల్లీ పెద్దలను కోరడం విస్మయం కలిగించింది. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలకు, ఉత్తమ గ్రామపంచాయతీలుగా అవార్డులు లభించాయి. కానీ ప్రస్తుతం ఆ అవార్డులన్నీ తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పట్టుకు పోతున్నాయి. రాష్ట్రంలోని గ్రామపంచాయతీ నిధులను ప్రభుత్వమే స్వాహా చేయగా, ఇక పంచాయితీల అభివృద్ధి ఎలా సాధ్యం?. విభజన సమస్యలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమవుతాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇతరులను అన్యాయంగా అరెస్టు చేయడానికి చర్చించుకోవడం కాదని, విభజన సమస్యల పరిష్కారానికి కూడా చర్చించుకుంటే మంచిదన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత
విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ అందజేయడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సామాజిక పింఛన్లు అందజేయడం రాష్ట్ర ప్రభుత్వ విధి మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ద్వారా లభించే ఆదాయాన్ని, సామాజిక పింఛన్ల రూపములో పంచుకునే వెసులుబాటు ఉంది. అదే ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు తాము అందించిన సేవలకు గాను సకాలంలో తప్పనిసరిగా పెన్షన్లను అందజేయాలి. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లను 20వ తేదీ అయినప్పటికీ, 30 నుంచి 35 శాతం మందికి ఇంకా అందజేయకపోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తొలుత పదవ తేదీ, ఆ తరువాత 15వ తేదీ, ఇప్పుడు 20వ తేదీ వచ్చినప్పటికీ, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదు. సామాజిక పింఛన్లను ఒకటవ తేదీనే అందజేస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, విశ్రాంత ఉద్యోగులు కూడా 60 ఏళ్లు దాటిన వారేనని గుర్తించాలి. వారికి ఎన్నో ఖర్చులు ఉంటాయని తెలుసుకోవాలి. పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందజేయడం లేదంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అని స్పష్టమవుతుందన్నారు.
సంస్కరణవాది చంద్రబాబు నాయుడు
ఎన్నో సంస్కరణలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్యుడని రఘురామకృష్ణం రాజు కొనియాడారు. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో, ఆయుర్ ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి, ప్రజల చెంతకు పాలనను తీసుకువెళ్లారన్నారు. చంద్రబాబు నాయుడు ఆకాంక్ష రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజల ఆకాంక్ష తాము సుఖంగా ఉండాలని, అటు చంద్రబాబు నాయుడు, ఇటు ప్రజల ఆకాంక్షలు నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ కు పునర్జీవం కలిగించే శక్తిని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, ముక్కోటి దేవతలు చంద్రబాబు నాయుడుకు ప్రసాదించాలని రఘురామకృష్ణం రాజు కోరుకున్నారు.