Suryaa.co.in

Telangana

కేసీఆర్.. కర్షకులను ఆదుకోరా?

– బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై సత్వర నిర్ణయం తీసుకోకపోతే, తెలంగాణ రైతాంగం పూర్తిగా రోడ్డునపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ..

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి, తేది: 06.05.2022
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం …
విషయం: అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం మరియు ధాన్యం కొనుగోలుకు సత్వర చర్యలు చేపట్టడం గురించి …

వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అకాల వర్షంతో ధాన్యం పండిరచిన రైతులు నిట్టనిలువునా మునిగారు. ‘‘వరి వేస్తే ఉరే’’ అంటూ రైతాంగాన్ని మీరు భయబ్రాంతులకు గురిచేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఉండవని మీరు ప్రకటించారు.

మీరు అహంకారంతో చేసిన వ్యాఖ్యల వల్ల 30 లక్షల ఎకరాల్లో ధాన్యం పండిరచకుండా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. బిజెపి రాష్ట్ర శాఖ చేసిన ఆందోళనకు దిగి వచ్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఇటీవల మీరు ప్రకటించారు. మీ మాటలు నమ్ముకొని చాలా చోట్ల రైతులు వరి పంట వేయలేదు. మీ మాట నమ్మి వరి పంట వేయని రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైన, మీ పైన ఉంది.

వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాష్ట్రప్రభుత్వం అలసత్వం కారణంగా తెలంగాణలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్దం అని ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికెక్కలేదు. మీకు మీ రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ రైతాంగం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి లేదు.

ధాన్యం సేకరణకు అవసరమైన ఖర్చునంతా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. గన్నీ సంచులనుండి, ఐకెపి కేంద్రాల నిర్వహణ ఖర్చులు, మిల్లర్లు కమీషన్‌లు కేంద్రమే భరిస్తుంది. కానీ మీ అసమర్థ ప్రభుత్వం కనీసం రైతాంగానికి అవసరమైన గన్నీ సంచులను సైతం సమకూర్చలేకపోయింది.

ఐకెపి కేంద్రాలను సకాలంలో ప్రారంభించని ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ రోజు తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా మీ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా వ్యవహరించింది.

7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి 20 రోజులు గడుస్తున్నా కేవలం 2500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. ఇప్పటి వరకు కనీసం 10శాతం ధాన్యం కొనుగోలు కూడా జరగలేదు. ఐకెపి కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకుని రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షంతో ఇప్పుడు రైతాంగం పూర్తిగా దెబ్బతిన్నారు.

వడ్లు కొనుగోలు కేంద్రాల్లో కనీస ఏర్పాటు చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అమ్మకానికి తెచ్చిన ధాన్యానికి సైతం కనీస రక్షణ ఏర్పాట్లు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొట్టుకుపోయింది. నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచించాల్సిన మీ ఆర్థిక శాఖామంత్రి, సివిల్‌ సప్లయ్‌ శాఖామంత్రి, ఇతర మంత్రులు ఎఫ్‌.సి.ఐ. తనిఖీలపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మీ మంత్రులు ఎఫ్‌.సి.ఐ తనిఖీలపై చేస్తున్న అభ్యంతరాలను చూస్తే మిల్లర్లతో, టీఆర్‌ఎస్‌ నాయకులు, మీ మంత్రులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమౌతోంది. ఎటువంటి తప్పు చేయకపోతే తనిఖీలపై ఎందుకు ఆ ఉలికిపాటు? ధాన్యం అన్‌లోడ్‌కు ముందే మాకిచ్చే కమీషన్‌ తేల్చండంటూ రైస్‌మిల్లర్లు కోరుతుంటే ఎఫ్‌.సి.ఐ. తనిఖీల వల్లే ధాన్యం ఆన్‌లోడ్‌ సమస్య ఏర్పడుతుందటూ మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. ఎఫ్‌.సి.ఐ. తనిఖీలు జరిగితే మంత్రిగారికి వచ్చిన సమస్య ఏంటి? కమీషన్ల బాగోతం బయటపడుతుందనే భయమా?

అకాల వర్షాల వల్ల వరిధాన్యంతో పాటు ఇతర పంటలు నష్టపోయిన రైతాంగానికి వెంటనే పంటనష్ట పరిహారం ఇవ్వాలని బిజెపి డిమాండ్‌ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ డిమాండ్‌ చేస్తుంది.

సకాలంలో ఐకెపి కేంద్రాల ఏర్పాటులో అలసత్వం వహించిన మీ సివిల్‌ సప్లయ్‌ శాఖామంత్రి, అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందు హెచ్చరించినా రైతాంగాన్ని, వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేయని మీ వ్యవసాయశాఖామంత్రిని మీ క్యాబినెట్‌లో కొనసాగించడం సిగ్గుచేటు.
అటువంటి అసమర్థత కలిగిన మంత్రులను మీ క్యాబినెట్‌లో కొనసాగించాలా లేదా అనే విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికైనా రైతాంగానికి జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించి, తెలంగాణ రైతాంగానికి మీరు చేసిన పాపానికి ప్రశ్చాతాపం ప్రకటించండి.
అభినందనలతో …

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.

LEAVE A RESPONSE