కన్నతల్లిని చంపి దండేసి కీర్తించే బాపతు కేసీఆర్

9

-బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించాడు
-చనిపోయాక దండేసి కీర్తిస్తున్నడు
-అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నడు
-అసెంబ్లీలో అంబేద్కర్, గాంధీజీలను ఆకాశనెత్తుతడు
-సర్పంచ్ లుసహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను సర్వనాశనం చేసిన కేసీఆర్
-కేసీఆర్ కు దమ్ముంటే పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
-వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా?
-మొక్కలు ఎండిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తున్నారు… మరి నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దు?
-రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి…
-ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలకు ఇండ్లు, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం

కన్నతల్లిని చంపేసి ఆమె ఫొటోకు దండేసి కీర్తిస్తూ దండం పెట్టే బాపతు ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్పూర్తిని తుంగలో తొక్కుతూ అసెంబ్లీ లో వారి గురించి గొప్పగా పొగడటం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణ కోసం జీవితాలనే ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలను పదేపదే తూలనాడిన కేసీఆర్.. వారు చనిపోయాక కీర్తిస్తుండటం సిగ్గు చేటన్నారు. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం రామసాగర్ లో ఈజీఎస్ నిధులతో గ్రామ పంచాయతీ భవనం, ఇంటర్నల్ రోడ్డు పనులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, స్థానిక బీజేపీ నేతలతో ప్రవీణ్ బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

రామసాగర్ లో 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షలతో ఇంటర్నల్ రోడ్ నిర్మాణానికి వెచ్చిస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లే.. రాజకీయాలకు అతీతంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలనే లక్ష్యంతో కేంద్ర నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్నారు. సర్పంచులుసహా స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారాలివ్వాలని 73వ రాజ్యాంగ సవరణ చెబుతుంటే… అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నడు. కేసీఆర్ తీరు ఎట్లా ఉందంటే.. కన్నతల్లిని చంపి ఆమె ఫోటోకు దండేసి బాపతు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానంటడు. అసెంబ్లీలో అంబేద్కర్ ను పొగుడుతాడు. తెలంగాణ కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన జయశంకర్, కొండా లక్ష్మణ్ లను అడుగడుగునా అవమానించిండు.. వాళ్లు చనిపోయాక పొగుడుతున్నడు.

గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచిండు.. సర్పంచ్ వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసిండు. ఏకగ్రీవంగా పంచాయతీలకు నిధులిస్తానన్నడు. సీఎం నిధి నుండి ఫండ్స్ ఇస్తానన్నడు. పంచాయతీలను నిధులిస్తానని మోసం చేసిండు. చివరకు సర్పంచ్ అధికారులకే కత్తెర వేసిండు. కేంద్ర నిధులన్నీ దారి మళ్లించిండు. ఇదేమిటని ప్రశ్నించే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తానంటున్నడు… మొక్కలు ఎండిపోతే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తున్నరు కదా…సర్పంచుల పైసలు దొబ్బుతున్న సీఎం కేసీఆర్ ను ఏం చేయాలే? నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు? జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు రూ.24 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. సగటున 50 లక్షల మందికి కేంద్రం ఉపాధి కల్పిస్తోంది. కరీంనగర్ పరిధిలోనే లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నం. కేంద్రం ఇస్తున్న జాతీయ ఉపాధి నిధులన్నీ కేసీఆర్ దారి మళ్లిస్తున్నడు. లెక్కలడిగితే కనీసం వివరణ ఇవ్వలేదు. కేసీఆర్ నిర్వాకంవల్ల రూ.150 కోట్లు వెనక్కుపోయినయ్.

డబుల్ బెడ్రూం ఇండ్లుసహా లబ్దిదారుల ఎంపిక గ్రామ సభలు నిర్వహించి నిర్ణయించాలి. కానీ ఎమ్మెల్యేలకు ఆ అధికారం ఇవ్వడంవల్ల లంచాల పెరిగిపోయినయ్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం మోదీగారు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిస్తే సర్పంచులకు అధికారాలు కల్పిస్తే వాళ్ల పైసలను అర్ధరాత్రి ఎత్తుకుపోయిన దొంగ కేసీఆర్. కేసీఆర్ నిర్వాకంవల్ల ఇయాళ సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. పండగొస్తే తట్టెడు మట్టి కూడా తీయలేని దుస్ధితి వాళ్లది. సర్పంచ్ పరిస్థితే ఇట్లుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవాలి. మా బతుకులే బాలేదు.. ఇక ప్రజల బతుకులను ఏం బాగుచేస్తామనే నిర్వేదంలో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్ధం చేసుకోవాలి.

నేను చాలాసార్లు సవాల్ చేసిన. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి. గ్రామాల వారీగా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులేవి? ఇస్తున్న నిధులెన్ని? అట్లాగే కేంద్రం నేరుగా, ఆర్దిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులెన్ని? వీటిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నారా? నిరూపించాలని నేను సవాల్ చేసిన. తోకముడుచుకున్నడు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలాడుతుంటే జనం నవ్వుకుంటున్నరు. రుణమాఫీ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? రుణమాఫీ అమలు చేయకపోవడంవల్ల రైతుల సొంత సొమ్మును బ్యాంకోళ్లు జమ చేసుకుంటున్నరు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నరు. రామరాజ్యం రావాలని భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యంతోపాటు నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. ఫసల్ బీమా కింద పంట నష్టపరిహారం అందిస్తాం.