Suryaa.co.in

Political News

సరైనోడు..

(వి. ఎల్. ప్రసాద్)

కనిపించని నాలుగో సింహాల శాఖల్లో ఇలా సరైనవారు దొరికితే.. నిత్య భరతమే.. అక్రమార్కుల గగ్గోలే.

ఎన్ని దశాబ్దాలు పడుతుందో పోలీసు శాఖ, అవినీతి నిరోధక శాఖ, సీఐడి శాఖలు ప్రక్షాళన కావడానికి అని భావించారు ఆంధ్రాలో. మొదట అక్కడ ప్రక్షాళన జరిగితేనే కదా శాంతిభద్రతలు దారికి రావాలన్నా.. అక్రమార్కులలో భయం పుట్టాలన్నా అని నిరాశతో అంతా పెదవి విరిచిన వారే.

అలాంటి పరిస్థితులలో రాష్ట్ర డిజిపిగా ద్వారకా తిరుమల రావు వచ్చారు. గతంలో ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా, ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలలో నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది ఆయనకు. ఆయన ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తే వైకాపా హయాంలో ఆయన్ను ఎర్రబస్సు ఆర్టీసీ విభాగానికి బదిలీచేసి వుంటారో ఊహించుకోండి.

తాజాగా డిజిపిగా వస్తూనే స్వీయ శాఖ ప్రక్షాళన మొదలెట్టారు.
అరాచక యువ ఆఫీషర్ నుండి దృష్టి సారించారు. బైక్ ర్యాలీలో పాల్గొన్నందుకు ఒక యువకుడిని కర్రలతో చితక బాదారు. అది మామూలే.. కానీ ఏఎస్పీగా స్వయంగా రిషాంత్ రెడ్డి ఆ పని చెయ్యడం ఆశ్చర్యం కదా. తుపాకీ ముఖం మీద పెట్టి చంపుతానంటూ బూతులు తిట్టి, మేడపై నుంచి కిందికి, పైకి పరుగులు పెట్టించాడు. ఆ సమయంలో పడిపోయి అతని కాలు పూర్తిగా దెబ్బతిన్నది. ఆస్పత్రికి తరలించకుండా పిల్లల ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స చేయకపోవడంతో వాళ్లు మరో ఆసుపత్రికి తరలించారు.

ఆ తరువాత అతని కాళ్లు రెండూ దెబ్బ తిన్నాయి. ఈ విషయంలో రిశాంత్ రెడ్డిపై కేసు పెట్టినా చర్యలు లేవు. కోర్టులో కేసు వేసినా.. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. తర్వాత మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే పోలీసు శాఖ నుంచి రెండు లక్షలు పరిహారం ఇప్పించారు సంతోష్ అనే బాధితుడికి. తరువాత ఎస్పీగా రిషాంత్ రెడ్డి చిత్తూరుకు రాంగానే.. కుప్పం, పుంగునూరులలో చేయించిన విధ్వంసంతో ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు మారుమోగిపోయింది అంటే చూసుకోండి ఎంత రెచ్చిపోయాడో.

వందలాది మంది మీద 307 కేసులు, అట్రాసిటీ కేసులు. ఇలాంటి రిషాంత్ రెడ్డి నుండి ఎంపీనే కస్టడీలో కుళ్లబొడిచిన అరాచకాలకు, కక్ష సాధింపులకు పేరుమోసిన సీఐడీ చీఫ్ పివి సునీల్ కుమార్ వరకు, మరో వైపు పిఎస్సార్ ఆంజనేయులు నుండి క్రాంతి రాణా టాటా వరకు బాధితులుగా న్యాయం కోసం వెళితే కేసులు నమోదు చెయ్యకపోగా తమమీదే కేసులు పెడతారు అనే భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది రాష్ట్రం.

అలాంటి వారు ఏకంగా 16 మంది, పైగా స్వయంగా ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా.. ప్రజల మీదే పగబట్టినట్లుగా, నాలోగో సింహం అని చెప్పుకొనే పోలీసు వ్యవస్థకే కళంకంలా తయారయ్యారు. తాను వెనుకబడిన బోయకులం నుండి వచ్చిన ఆఫీసర్ అనే భయం లేదు తిరుమల రావులో. అంతే నిక్కచ్చిగా.. క్యాన్సర్ గడ్డను పెకలించినట్లుగా.. ప్రక్కనబెట్టి హెడ్ క్వార్టర్స్‌కి రిపోర్ట్ చెయ్యమన్నారు. అక్కడ కూడా పొద్దున వెళ్లి సంతకం చేసి కూర్చోకుండా నామోషీగా తోక జాడించిన ఆఫీషర్లకు ఏకంగా మెమో ఇచ్చాడు. సింహ స్వప్నంలా మారాడు స్వీయ పోలీసు శాఖకే. చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది చివరి సారి అవ్వాలని ఆ శాఖ మారుతుంది అని ఆశిద్దాం.

హ‌రీశ్ కుమార్ గ‌ప్తా జ‌మ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన వ్య‌క్తి. 90 దశకంలో నక్సల్స్ జిల్లాల్లో పనిచేసి వచ్చారు. వైకాపా హయాంలో.. 2022లో ఎస్ఎల్‌పీఆర్‌బి చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న కొద్ది నెల‌ల‌కే.. రైల్వేలో అడిష‌న‌ల్ డీజీపీగా వెళ్లారంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన కూడా ఎంత కచ్చితంగా వుంటారో. ఎన్నికల సమయంలో ఇసి డిజిపిగా హరీష్‌కుమార్ గుప్తా ని నియమించడం మనకు తెలిసిందే. తాజాగా ఆయన సీఐడి చీఫ్ గా నియమించబడ్డారు.

గతంలో ఆయన విజిలన్స్ విభాగంలో పనిచేసిన అనుభవంతో.. అగ్రి గోల్డ్ భూములు ఎలా చేతులు మారాయి, సర్వే నంబర్లు ఎలా మార్చారు, రెవెన్యూ.. రిజిస్ట్రేషన్ శాఖలో ఏ ఏ అధికారి జోగి రమేశ్‌కు సహకరించి సీఐడీ అధీనంలో వున్న భూములు అమ్మేశారో.. చాలా లోతుగా వెళ్లారు. అరెస్టుల పర్వం మొదలైంది. రాజకీయ అక్రమార్కుల నుండి ప్రభుత్వ ఉద్యోగులలోని అక్రమార్కుల వరకు అదిరి పడ్డారు.

ఓ వైపు స్వీయ శాఖల్లో ప్రక్షాళన, పరివర్తన తెచ్చేలా హడలెత్తిస్తూనే.. మరో వైపు ఒక్కో అక్రమాల గుట్టును సాక్ష్యాలతో సహా పెకలించి న్యాయస్థానాల్లో నిలబెట్టే వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నేళ్లకు ధర్మం, న్యాయం వైపు దృష్టిసారించింది మన పోలీసు శాఖ అనే చర్చ సామాన్య జనాలు చర్చించుకొంటున్నారు.

LEAVE A RESPONSE