( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక సినిమా వందరోజులాడితే అప్పట్లో శతదినోత్సవ వేడుక జరిపేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన వందరోజులకు, దానిని ఒక ఈవెంట్‌గా మార్చడం దేశంలో సాధారణమయింది. అందుకు ఎన్డీఏ కూటమి మినహాయింపుకాదు. ఏదేమైనా వందరోజుల క్రితం అనితర సాధ్యమైన విజయం సొంతం చేసుకుని, కీలకమైన ఐదు ఎన్నికల హామీలు నెరవేర్చిన ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఇమేజ్-జగన్‌పై పూర్తి వ్యతిరేకత, కలగలసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందనేది నిస్సందేహం. ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఎన్డీఏ కూటమిపై ప్రేమ కంటే, జగన్‌పై వ్యతిరేకతే కూటమి గద్దెనెక్కేందుకు కారణమయిందన్నది… మనం మనుషులం అన్నంత నిజం.
శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల అనే నియోజకర్గంలో అసలు కనీస ఉనికిలేని బీజేపీ గెలిచిందంటే.. పోలింగ్‌బూత్ ఏజెంట్లకూ దిక్కులేని రాయలసీమలోకూడా బీజేపీ అభ్యర్ధులు గెలిచారంటే.. అది జగన్‌పై వ్యతిరేకతేనన్నది విస్మరించి, తమ వల్లే గెలిచిందనుకోవడం పొరపాటు. చంద్రబాబు-పవన్-లోకేష్-భువనేశ్వరి అకుంఠిత-అవిశ్రాంత ప్రచారం వల్ల కూటమి గెలిచినప్పటికీ… గెలిపించింది మాత్రం జగన్‌పై వ్యతిరేకతేనన్న వాస్తవాన్ని గ్రహించి మరో నాలుగేళ్ల తొమ్మిదినెలలు పాలించడం కూటమి కర్తవ్యం.
కానీ ఈ వందరోజుల్లో.. టీడీపీ అగ్ర నాయకుల నోటి నుంచి..‘మీరొక్కరి వల్లే గెలిచామా.. ఫొటోల కోసమే కదా మీరు వచ్చింది? తీసుకునివెళ్లండనే’ అవమానకర వ్యాఖ్యలు వినాల్సి రావడాన్ని, భుజం పుండ్లు పడేలా మోసిన కార్యకర్త మనసును గాయపరుస్తోంది. ఈ విషయం నాయకత్వానికి తెలిసినా-తెలియకపోయినా, పార్టీ జెండామోసిన కార్యకర్తలకు విస్తరించడం పార్టీ భవిష్యత్తుకు మంచిదికాదు.
రాజకీయ పార్టీ అంటే పోరాటం- సమిష్టి కృషి. అధికారం వస్తే అందులో అందరి భాగస్వామ్యం ఉంటుంది. విజయంలో అధినేతల ముఖవిలువ ఎక్కువగా ఉన్నప్పటికీ.. కిందిస్థాయిలో పోరాడే కార్యకర్త తన ప్రత్యర్ధికి ధీటుగా నిలబడినందుకే, అధికారం వచ్చిందన్న విషయాన్ని నాయకత్వాలు విస్మరించకూడదు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పోగుచేసే క్రమంలో… అన్నిరకాలుగా నష్టపోయినా, ప్రత్యర్ధితో కలబడి నిలబడేది కార్యకర్త మాత్రమే.
మరి అలాంటి కార్యకర్త ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? తాను మోసిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ఉన్నాడా? లేదా? ఉంటే ఓకే. లేకపోతే ఎందుకు లేడన్నది తెలుసుకోవలసిన బాధ్యత నాయకత్వానిదే. అందుకు ఉన్న మార్గాలు అనేకం. మరిప్పుడు కూటమికి నాయకత్వం వహిస్తున్న టీడీపీలో అలాంటి ప్రక్రియ జరుగుతోందా? అన్నదే ఆత్మవిమర్శ చేసుకోవలసిన ప్రశ్న.
మూడునెలల క్రితం వరకూ జగన్‌పై నిప్పులు కురిపించిన టీడీపీ సైనికులు, తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు పెదవి విరుస్తున్నారో తెలుసుకోవాలి. మునుపటి మాదిరిగా పొగడ్తలకు పడిపోయి, సద్విమర్శలు చేసేవారిని దూరంగా పెట్టడం ప్రారంభిస్తే దెబ్బతినేది పార్టీ నాయకత్వమే. కానీ వాటి ఫలితాలు అనుభవించేది మాత్రం ఎప్పటికీ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే కార్యకర్తలే.
రాజకీయ పార్టీకి అన్ని రకాల వర్గాలు, వ్యక్తులు అవసరం. అందులో మంచివారు, చెడ్డవారు ఉండవచ్చు. కానీ అధికారం వచ్చిన తర్వాత.. ఎవరి సేవలు ఏమిన్నది బేరీజు వేసుకుని, వారికి వారి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత నాయకత్వాలదే. ఎవరైనా ఏదో ఒకటి ఆశించే పార్టీల్లో చేరుతుంటారు. కొనసాగుతుంటారు. అంతే తప్ప, అదేదో లయన్స్‌క్లబ్, రోటరీక్లబ్ మాదిరిగా సేవ చేయడానికి ఎవరూ రారన్నది నిష్ఠుర నిజం.
అంతే తప్ప, తమను చూసి పార్టీలో చేరారు కాబట్టి.. వారి అవసరం కోసం వచ్చారు కాబట్టి, తాము అవకాశం ఇచ్చేవరకూ వారు వేచి ఉంటారనుకునే తత్వం వల్ల నష్టపోయేది నాయకత్వాలే. ఎందుకంటే.. ఒక పార్టీ నుంచి వచ్చిన వారికి మరో పార్టీలోకి వెళ్లడం పెద్ద సమస్యకాదు.
ఇదే సందర్భంలో ఆయా పార్టీల జెండా మొదటినుంచి మోసిన వారు.. మమ్మల్ని వదిలేసి, మధ్యలో వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారన్న అసంతృప్తి సరైంది కాదు. రాజకీయపార్టీలకు అంతిమ వేదిక ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎవరైతే పార్టీని ఆదుకుంటారో, వారిని గుర్తుపెట్టుకోవడం నాయకత్వాల బాధ్యత. అందువ ల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత, ముందు ఫలాలు అనుభవించే జాబితాలో వారే ముందువరసలో ఉంటారు. అంతమాత్రాన ‘పుట్టు పార్టీవాదులు’, ఉడుక్కుని రగిలిపోవలసిన పనిలేదు. వారి సమయం కోసం వేచి ఉండాలంటే. ఇప్పుడు కూటమి పాలనలో కార్యకర్తల మనోభావన, జరుగుతున్న పరిణామాలు, నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి.
అయితే అందుకోసం ఎంచుకున్న ప్రాతిపదికే విమర్శలకు తావిస్తోంది. పార్టీకి ఎవరేం చేశారన్న డేటా తమ వద్ద ఉందని, ఎన్నికల ముందువరకూ చంద్రబాబు-లోకేష్ చెప్పారు. కాబట్టి ఇక కొత్తగా ఎవరి వివరాలు తీసుకోవలసిన పనిలేదు. కానీ మళ్లీ 60ఏళ్లకు పైబడిన నాయకులు, కార్యకర్తలను లైన్లలో నిలబెట్టి.. పదవుల కోసం దరఖాస్తులు తీసుకోవడం, టీడీపీ సభ్యత్వ కార్డులు అడగడటం ఎందుకో శ్రేణులకు అర్ధంకావడం లేదు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి పార్టీలో చేరి, టికెట్లు తీసుకుని మంత్రిపదవులిచ్చిన పార్ధసారథి, సుభాష్, రాంప్రసాద్‌రెడ్డి వంటి వారికి సభ్యత్వకార్డులు లేవు కదా?
మరి వారికి లేని నిబంధనలు మాకెందుకన్నది వారి ప్రశ్న. నిజమే కదా? ఆఫీసు నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో తప్పలేదు. కానీ అది కంపెనీలకు తప్ప, ఆత్మీయత-నమ్మకానికి సంబంధించిన పొలిటికల్ పార్టీలకు పనిచేయవన్న సూత్రం గమనించకపోవడమే ఆశ్చర్యం.
రాజకీయ నాయకులు సహజంగా గౌరవం కోరుకుంటారు. ఆత్మగౌరవం ఆశిస్తారు. అంటే ముఖ్యమంత్రినో, పార్టీ అధ్యక్షుడినో కలిసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ పదినిమిషాలు వారితో తమ ఈతిబాధలు చెప్పుకుంటే, వారిలోని ఆవేదన-అసంతృప్తి తగ్గిపోతుంది. అది లేకపోతే అంతా యాంత్రికమే అవుతుంది. అవసరార్ధ రాజకీయమే అవుతుంది తప్ప, అందులో ఆత్మీయత కనిపించదు.
వైఎస్ హయాంలో ఆయనను ఒక పట్టణ మునిసిపల్ చైర్మన్‌ను కూడా సులభంగా కలిసేవారు. వారు చెప్పిన పని చేయకపోయినా వైఎస్ భుజం మీద చేయి వేస్తే, అది వారికి కొన్నేళ్ల పాటు ఆక్సిజన్‌గా పనిచేసేది. అందుకు కారణం ఆయన వద్ద పనిచేసే అధికారులు, వ్యకిగత సిబ్బంది. అసలు చాలా సమస్యలు వైఎస్ వద్దకు వెళ్లకుండానే పరిష్కారమయ్యేవి. దానికి కారణం ఆయన కోసం మనస్ఫూర్తిగా పనిచేసే సిబ్బందే.
సహజంగా ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో సీఎంను కలిసే సందర్భంలో వారితో ఆ నియోజకవర్గ మండలాధ్యక్షులో, జడ్పీటీసీలో కలసి వస్తుంటారు. సీఎంలు కూడా ఎమ్మెల్యేతో వచ్చిన ఆ నాయకులతో కలసి ఫొటోలు దిగేవారు. వారిని సీఎంఓ సెక్యూరిటీ కూడా అడ్డుకోరు. ఎందుకంటే.. ఎమ్మెల్యేలతో వచ్చిన స్థానిక నేతలను అడ్డుకుంటే, ఇక ఆయనకు నియోజకవర్గంలో విలువ లేనట్టే లెక్క. ఆ విషయం సదరు స్థానిక నాయకులు అందరికీ చెబుతారు కాబట్టి.
ఏదైనా కీలక సమస్య వస్తే, నిబంధనలు మార్చి సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. మనం అధికారంలో ఉన్నది పనిచేయడానికి. నిబంధనలు మార్చి ఆ పనిచేయండి అనే వైఎస్‌కు, అందుకే అంత క్రేజ్. వైఎస్‌తో వారి బంధంలో మానవీయత కనిపించేది. కానీ అదే ఆయన కొడుకు జగన్ దగ్గర, అది భూతద్దం వేసి వెతికినా కనిపించేది కాదు. జగన్ మంత్రులు-ఎమ్మెల్యేలు-ఎంపీలు-పార్టీ సీనియర్లను కలిసేవారు కాదు. ఆ అవమానంతోనే దాడి వీరభద్రరావు, డొక్కా మాణిక్యప్రసాదరావు లాంటి ఎంతోమది సీనియర్లు పార్టీ నుంచి నిష్క్రమించారు. రఘురామకృష్ణంరాజు లాంటి ఎంపీని కలవడం ఇష్టం లేదని చెప్పిన తర్వాతనే కదా, జగన్ పతనం ప్రారంభమయింది? అసలు వారంతా తాను గెలిపిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారన్న భావన జగన్‌ది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అలాంటి భావనే ఉందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ భావన విస్తరించడం కూడా మంచిదికాదు. సీఎంను క లవడం దుర్లభంగా మారింది. ఆయన దగ్గర పనిచేసే ఒక అధికారి మమ్మల్ని అవమానిస్తున్నారంటూ జీవీరెడ్డి అనే జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ మేలుకోరే చానెల్‌లోనే నిర్భయంగా చెప్పారంటే దాని సంకేతం ఏమిటి? తనతోపాటు మరో సీనియర్ నేత పట్టాభి కూడా సీఎం అపాయింట్‌మెంట్ వ్యవస్థ, ఆయన పీఎస్ వ్యక్తిగత వ్యవహార శైలితో అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పార ంటే.. పార్టీపై ఇక ఎవరికైనా గౌరవం ఉంటుందా?
నిజానికి ఇలాంటి రహస్యాలు నేతలు బయటకు చెప్పరు. అవమానాలు దిగమింగుకునే పనిచేస్తారు. లేకపోతే సహచరులతో పంచుకుంటారు. కానీ అన్నీ తెలిసిన జీవీరెడ్డి తెగించి మరీ, నేతలకు సీఎంఓలో జరుగుతున్న అవమానాల గుట్టు విప్పారంటే, అలాంటి వారు ఎంత మానసికక వేదన అనుభవించారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అసలు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజూ తమతో ఫోన్లలో మాట్లాడే నాయకత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎందుకు కలవడం లేదన్నది ప్రశ్న.
ఇవన్నీ చాలామంది సీనియర్లు, మాజీ మంత్రుల స్థాయి నేతలకు ఎదురవుతున్న అవమానాలే. కానీ జీవీరెడ్డి ఒక్కరే పిల్లిమెడలో గంటకట్టారు. దానిపై దిద్దుబాటుకు దిగాల్సిన బాధ్యత అధినేతదే. జీవీరెడ్డి ధైర్యాన్ని ఇప్పుడు సీనియర్లు కూడా మెచ్చుకుంటున్నారంటే, ఆయన ఆరోపణ-ఆవేదన ప్రభావం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.
అసలు నిజానికి ప్రతిపక్షనేత బాబు వద్ద జరిగే సమావేశ వివరాలు ఎప్పటికప్పుడు, తాడేపల్లికి తెలుస్తున్నాయన్న చర్చ అప్పట్లోనే వినిపించింది. ఆ ఉప్పందించే అధికారికి, ధనంజయరెడ్డి ఆఫీసు అధికారి, విజయవాడ క్లబ్‌లో సభ్యత్వం కూడా ఇప్పించారని గత కొద్దిరోజుల నుంచి సొషల్‌మీడియాలోనే ప్రచారం మొదలయింది.
అమరేందర్ అనే అధికారిపై చర్యలు తీసుకోమంటూ, స్వయంగా సీఎం కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు అమలుకాకుండా, అదే సీఎంఓలో బాబు కార్యదర్శి అడ్డుపడుతున్నారని సోషల్‌మీడియాలో చర్చ జరగడం ప్రమాదకర సంకేతం. జెసి బ్రదర్స్ లాంటి వాళ్లు, ఇప్పటికీ బాబు అపాయింట్‌మెంట్ కోసం సుదీర్ఘకాలం నుంచీ ఎదురుచూస్తున్నారట. ఎమ్మెల్యేలతో సీఎంఓకు వచ్చే నియోజకవర్గ కీలక నేతలను కూడా నిలిపివేస్తున్న కొత్త సంప్రదాయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి యుద్ధప్రాతిపదికన తెరదించకపోతే.. పెద్దాయన ఆదేశాల మేరకే ఇలా జరుగుతుందన్న అపప్రద ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకూ ‘‘సార్ చెబితేనే పీఏ, పీఎస్‌లు చేస్తా’’రనే మరో వాదన కూడా లేకపోలేదు.
చంద్రబాబును కలవాలనుకునే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు సదరు కార్యదర్శి నుంచి వచ్చే సమాధానం ఏమిటంటే.. ఏం పని? ఎందుకు?! ఇదో ఆశ్చర్యం. ఈ అవమానకర పరిస్థితిని భరించలేక.. ఏడాది క్రితం స్వయంగా బాబు పిలిస్తే పార్టీ ఆఫీసులో పనిచేసేందుకు వచ్చిన ఓ మాజీ అధికారి, సదరు కార్యదర్శి అవమానం భరించలేక ఒక మంత్రి వద్ద ఓఎస్డీగా వెళ్లిపోయిన పరిస్థితి. ప్రజాప్రతినిధులు, రాజకీయనేతలకు సీఎం-పార్టీ అధ్యక్షులతో అనేక పనులుంటాయి. అవన్నీ వారి వ్యక్తిగత కార్యదర్శులు, తమకు చెప్పాలనుకోవడమే అభ్యంతరం. ఇప్పుడు చంద్రబాబు దగ్గర జరుగుతోంది అదేనన్నది వినిపిస్తున్న చర్చ.
నిజానికి అధినేత చంద్రబాబు-భావి అధినేత లోకేష్ అపాయింట్‌మెంట్ వ్యవస్థపై చాలాకాలం నుంచి సీనియర్లలో అసంతృప్తి ఉందనేది నిష్ఠుర నిజం. సహజంగా నాయకులు తమ అసంతృప్తిని, సహచరులు-సన్నిహితంగా ఉండే మీడియా ప్రతినిధుల వద్ద పంచుకుంటారని.. తర్వాత అవే మీడియా-సోషల్‌మీడియాలో కథనాలుగా వస్తాయన్న విషయాన్ని అధినేతల వద్ద పనిచేసే కార్యదర్శులు గమనిస్తే మంచిది.
అసలు వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది పనితీరు అధినేతల ప్రతిష్ఠను పెంచేలా ఉండాలి. కార్యదర్శులకు ఫోన్లు చేస్తే కట్ చేయడం, స్విచ్చాఫ్ చేయడం వంటి పనుల వల్ల దెబ్బతినేది అధినేత ప్రతిష్ఠే. తమకు వచ్చిన ఫోన్లకు బదులివ్వడం, అధినేతలను కలుసుకోవాలనుకున్న వారి పేర్లు, అధినేతలకు ఇవ్వడమే కార్యదర్శుల పని. తర్వాత వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలా? వద్దా? అన్నది అధినేతల ఇష్టం. అసలు వారి దగ్గర పనిచేసే జీతగాళ్లే, ఎదుటవారి అర్హతను నిర్ణయించడం దారుణం.
బహుశా ఈ కారణంతోనే.. ‘అప్పటి టీడీపీ వేరు-ఇప్పటి టీడీపీ వేరు. ఇప్పుడు పార్టీలో మనకు గౌరవం లేదు.పార్టీలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఉంది’ అన్న భావన, శ్రేణుల్లో బలంగా నాటుకుపోయేందుకు కారణమవుతోంది. ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిదికాదు. ఎందుకంటే జగన్ తమను కలవరన్న అసంతృప్తి, ఆగ్రహంగా మారిన ఫలితంగా ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎం-విపక్షనేతగా ఉన్నంతవరకూ, ఇలాంటి వ్యవస్థ ఎప్పుడూ కనిపించిన దాఖలాలు లేవు. ఆయన మండల పార్టీ అధ్యక్షులను కూడా కలిసిన దాఖలాలు కోకొల్లలు. రాష్ట్రం విడిపోయి, తొలిసారి సీఎం అయన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కనిపించలేదు. అయితే అప్పటి సీఎంఓలో కొందరు ఐఏఎస్‌ల పనితీరుపై విమర్శలున్నప్పటికీ, బాబు వ్యక్తిగత కార్యదర్శులతో ఎవరికీ ఇబ్బందులు ఉండేవి కాదు. బాబు దగ్గర సుదీర్ఘ కాలం నుంచి పనిచేసిన శ్రీనివాస్, ఇప్పటికీ కొనసాగుతున్న రాజగోపాల్‌కు దాదాపు నాయకుల పనితీరు, వ్యక్తిగత వివరాలు తెలుసుకాబట్టి వారిపై పెద్దగా ఫిర్యాదులొచ్చిన సందర్భాలు కనిపించవు.
శ్రీనివాస్ ఆయన పీఎస్‌గా పనిచేసిన సందర్భాల్లో.. బాబుకు సమయం లేకపోయినా, ఆయన వచ్చేముందో, వెళ్లేముందో బాబును కలిపించడంతో నాయకులు తృప్తిపడేవారు. ఎందుకంటే పార్టీకి ఎవరు పనిచేశారు? ఎవరి ప్రాధాన్యం ఏమిటి? బాబు ప్రాధాన్యతలు, అభిరుచులు ఏమిటన్నది శ్రీనివాస్‌కు బాగా తెలుసుకాబట్టి. అధినేతలు-ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే వారు, దానిని ఒక రొటీన్ ఉద్యోగంగా భావిస్తే ఫలితాలు ఉండవు. వారికోసం నిస్వార్ధంగా పనిచేసినప్పుడే, అధినేతల ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు అటు బాబు-ఇటు లోకేష్ వద్ద, అలాంటి వ్యవస్థ లేదన్నది వినిపిస్తున్న వ్యాఖ్య. దీనిపై దిద్దుబాటుకు దిగితే వారికే మంచిది.
ఈ మూడునెలల కాలంలో.. టీడీపీ సోషల్‌మీడియా సైనికులు పెడుతున్న పోస్టింగులు పరిశీలిస్తే, ప్రభుత్వంగా విజయం సాధించి-పార్టీగా విఫలమవుతున్నామన్న ఆవేదన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ స్థానికంగా వైసీపీ వారికే పనులు జరుగుతున్నాయి. తమపై కేసులు పెట్టి జైల్లో వేసిన వారికే మళ్లీ పోస్టింగులిస్తున్నారు. ఇవి చూసేందుకేనా మేం ఆ దుర్మార్గుడితో పోరాడి, పార్టీని అధికారంలోకి తెచ్చింది? అని నిష్ఠూరాలాడుతున్న పోస్టింగుల వెనుక ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే.
దానికి కారణం పార్టీలో కొత్తగా మొదలైన, ‘సింగిల్ విండో’ వ్యవస్థ అన్నది ఒక విమర్శ. రాజకీయాల్లో అధికార వికేంద్రీకరణ చాలా అవసరం. దానివల్ల ప్రజాప్రతినిధులు- నాయకులకూ గౌరవం పెరుగుతుంది. కానీ అన్ని అధికారాలను ఒకేచోట కేంద్రీకృతం చేసే, ఏకీకృత వ్యవస్థ భవిష్యత్తులో పెను ప్రమాదం తెస్తుంది. ఇన్ని దశాబ్దాలూ ఎమ్మెల్యేలకు పరిమితమైన ఎస్‌ఐ-సీఐ-డీఎస్పీ పోస్టింగులు కూడా, సింగిల్‌విండో వ్యవస్థ నుంచి విడుదల కావడం.. ఒక రాజకీయ పార్టీ భవితవ్యానికి, అధినేతల వ్యక్తిగత ఇమేజీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది సీనియర్ల ఉవాచ. ప్రజాప్రతినిధులు ఎలాంటివారన్నది పక్కనపెడితే.. అది వారి ఆత్మగౌరవ అంశమని గుర్తించాలి. ఆత్మగౌరవానికి భంగం కలిగిన రెండు సందర్భాల్లో ఏం జరిగిందనేది టీడీపీకి అనుభవమే.
ఇంకా సూటిగా చెప్పాలంటే.. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు కురిపించిన మెగా, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీపై విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమవుతోంది. ఇటీవల క్వారీల సీనరేజీ వసూళ్లను, మళ్లీ జగన్ హయాం నాటి కంపెనీలకే అప్పచెప్పిన వైనం సోషల్ మీడియాకెక్కడంతో, అది పార్టీ సైనికుల మనస్తాపానికి గురిచేసింది. వీటికి సంబంధించి జరుగుతున్న చర్చ నాయకత్వానికి తెలియదనుకోలేం. ఇటీవల విజయవాడ వరద బాధితులసాయం పేరిట, అధినేతను కలిసి చెక్కులిస్తున్న వారిలో, గతంలో తాము అవినీతి ఆరోపణలు చేసిన కంపెనీలు-వ్యక్తులు ఉండటాన్ని, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిష్ఠుర నిజం.
అసలు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగన్‌ను ఎదిరించి న్యాయపోరాటం చేసిన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్దపీట వేస్తారని పార్టీ శ్రేణులు ఆశించాయి. టీడీపీ-జనసేన యుద్ధక్షేత్రంలోకి దిగడానికి మూడేళ్ల ముందు.. జగన్‌పై ఒంటరి యుద్ధం చేసి, సీఐడీతో చావుదెబ్బలు తిన్న రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి ఇస్తారని పార్టీ కార్యకర్తలు భావించారు. ఇక జగన్ శాడిజానికి పరారయి, దాదాపు ఏడాదిపాటు కుటుంబానికి దూరమైన బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌ను, అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ సీఎంఓలో తీసుకుంటారని సీనియర్లు సైతం అంచనా వేశారు. వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు.
పైగా… మెగా కంపెనీకి మళ్లీ పోలవరం ప్రాజెక్టును అప్పగించడం, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు జగన్ ఇచ్చిన భూమి రద్దు చేసి, దానిపై విజిలెన్స్ విచారణ జరిపించకపోవడం, క్వారీ సీనరేజీ వసూళ్లను జగన్ బినామీ కంపెనీలకే కట్టబెట్టడం.. పార్టీ జెండాను భుజం పుండ్లు పడేలా మోసిన కార్యకర్తను విస్మయానికి గురిచేసింది. ఏతావతా.. ఈ వందరోజుల్లో యధావిథిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వందమార్కులు తెచ్చుకుంటే, పార్టీ అధినేతగా తమను మెప్పించలేకపోయారన్న వ్యాఖ్యలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.
ఐదేళ్లు బాబు కుటుంబం స్వయంగా అనుభవించిన అవమానాలు.. 54 రోజుల పాటు స్వయంగా జైల్లో అనుభవించిన వేదన.. జగన్ జమానాలో నేతలు-కార్యకర్తలు ఆర్ధికంగా-మానసికంగా పడిన కష్టాలను ప్రతిరోజూ గుర్తుంచుకుని, ఆమేరకు జెండా మోసిన సిపాయిలను మెప్పిస్తే.. మరో నాలుగేళ్ల తొమ్మిదినెలల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా, టీడీపీదే విజయమన్నది తమ్ముళ్ల ఉవాచ.