– అప్పటి ‘ బడి ‘ క్రమశిక్షణ నేర్పింది
– నేడు ఏ. సి లు పెట్టినా ఆ గది నుండి గంజాయి కంపే వస్తుంది
నాడు
బల్లలు లేకుండా నేల మీద కూర్చొని చదువుకున్నా.. వాటిని నేల బారు చదువులన్నా..
మాస్టార్లు చెట్టుకింద కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పినా.. వాటిని వానాకాలం చదువులన్నా…
రంగులు హంగులు లేని బడులున్నా…వాటిని వీధి బడులన్నా…
పిల్లాడి నిక్కరకు కన్నాలు ఉన్నా …టై – బూటు లేకపోయినా….బతలేక బడిపంతులు నెల జీతం వందల్లో ఉండి సైకిల్ తొక్కుకొని బడికి వచ్చిన రోజున….
పరీక్షలు నిజాయితీగా , నిబద్దతతో నిర్వహించారు.
అప్పటి ‘ బడి ‘ క్రమశిక్షణ నేర్పింది.
మార్కులు దండిగా రాకపోయినా ‘ జీవితం లో కష్టపడటం నేర్పింది.
ఆనాడు పిల్లవాడి నిక్కర్ కి మాత్రమే కన్నం ఉంది కానీ … పిల్లాడి గుణం మాత్రం మిన్నగా ఉండేది.
నేడు..
పిల్లాడి నోట్లో తండ్రే ప్రతిరోజూ సిగరెట్టు పెట్టి వెలిగించి…
మా వాడికి ‘ఎంజాయ్ మెంట్ ‘ నేర్పుతున్నాను అన్నట్లుగా…..
మాస్టార్లే దగ్గరుండి పరీక్షల్లో కాపీ లు కొట్టిస్తూ…. పిల్లవాడికి సహాయం చేస్తున్నాని గొప్పగా చెప్పుకుంటూ…..,
చదివిన చదువుకు – పడ్డ కష్టానికి సంబంధమే లేకుండా మార్కుల వర్షం కురిపిస్తూ ….
పిల్లల ఆలోచనా విధానాన్ని పూర్తిగా చెడగొట్టి … పిల్లాడికి బెల్ట్ పెట్టి, టై కట్టి , బూట్లు వేసి , మంచి బ్యాగ్ వేసి బడికి పంపితే …….
బడిలో గ్రానైట్ ఫ్లోరింగ్ , గోడలకు అందమైన రంగులు , వాటిపై చూడచక్కని బొమ్మలు వేసినా….
తరగతి గదులకు ఏ. సి లు పెట్టినా…..
ఆ గది నుండి గంజాయి కంపే వస్తుంది.
ఉపాధ్యాయులారా ! మీరు కాపీల నీళ్ళు పోసి పెంచుతున్న కలుపు మొక్కల నుండి ‘ కమ్మటి గంజాయి వాసన ‘ వస్తుంది.ఆస్వాదించండి.
కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకోండి… ఇదంతా మా కష్టార్జితం అని.
ఈ రోజు మీ నరం లేని నాలుక మీ తప్పును సమర్ధించుకోవడానికి , దానిని సమాజంపై నెట్టడానికి వింత వింత వాదనలు చెయ్యొచ్చు.
యూనియన్ నాయకుల పడికట్టు పదాలు , ఈ వినాశనం లో మీ పార్టనర్స్ అయిన విద్యాశాఖ అధికారులు ..
మీరు చేస్తున్న ఈ తప్పులను ” గొప్పలుగా కీర్తిస్తూ , ఉత్తమ ఉపాధ్యాయులుగా శాలువాలు కప్పొచ్చు ”
సమాజానికి , తెలుగు జాతికి మీరు చేస్తున్న ద్రోహానికి , పిల్లల భవిష్యత్తు ను చేజేతులా నాశనం చేస్తున్నందుకు…. మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది.
బడిలో బీర్లు పొంగటానికి , గంజాయి గుభాళించడానికి కారణం , వారికి కష్టపడి చదవడం అంటే తెలియకుండా మీరు పోస్తున్న ” కాపీ ల నీళ్ళు , పిచ్చి మార్కులనే ఎరువే కారణం ” …. దీనికి సెల్ ఫోన్ లు కారణం అని , సామాజిక మాధ్యమం కారణం అనే డొంకతిరుగుడు మాటలు చెప్పి .. సత్యాన్ని మరుగున పరచలేరు.
చాపకింద నీరులా, ప్రభుత్వ – ప్రైవేట్ అనే తేడా లేకుండా బడులలో విస్తరిస్తున్న గంజాయి సంస్కృతి ని, కూకటివేళ్లతో పెకిలించాలని కోరుకుంటూ ….
దానికి విత్తుగా నున్న కాపీల మత్తును వదలాలని కోరుకుంటూ…
– డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి