సరస్వతి నమస్తుభ్యం!
స్కూల్స్ చేసేసి శుభ్రం
మళ్లీ సరస్వతీ నమస్తుభ్యం..
ఇన్నాళ్లు ఇంట్లోనే
కూర్చుందేమో చదువులమ్మ
బడికెళ్తే సాక్షాత్కారమౌను
మరోసారి గురుబ్రహ్మ..!
తరగతి గదులకు తాళాలు
బడులకు గొళ్లేలు..
పలకలకు పగుళ్లు…
బలపాలకు తెగుళ్ళు..
ఇప్పుడు మళ్లీ
అక్షరాలకు చిగుళ్ళు..
కళకళలాడేనిక
చదువుల గుళ్ళు..!
పోయిన కాలం పోయింది
కరోనా మహమ్మారి
చదువులను మింగేసింది..
చాన్నాళ్లుగా ముక్కీమూలుగుతూ చదువు..ఇప్పుడిక
భయానికి సెలవు..
పూర్తిగా తెరుచుకుంది
చదువులమ్మ కొలువు..!
ఇన్నాళ్లు
ఆ మూలనపడున్న బెత్తం..
విరిగిపోయిన చాక్పీసు..
రంగు వెలిసిన బ్లాక్ బోర్డు..
చెదలు పట్టిన మేజాలు
వికసించని అక్షరాల రోజాలు
బూజు పట్టిన డస్టరు..
కనిపించని హాజరు..
బ్రతుకే బేజారు..!
వేసవి సెలవులు కావవి
వానాకాలం చదువులు
కానే కావు..
లాక్ డౌన్లతో
చచ్చేంత చావు..
చదువుకే చాకిరేవు…
బరువైపోయిన బ్రతుకు తెరువు
గుండె చెరువు..!
ఆన్లైన్ క్లాసులు..
ఎందుకొచ్చిన తిరకాసులు..
బడి..ఆ సొగసే వేరు…
ఆ వరసే వేరు..
గలగలా పారే సెలయేరు..
ఎదురుగా పుస్తకంతో
అపరసరస్వతిలా సారు…
చదువంటే అదే..
ఇక పాఠాల వరదే..
సరస్వతీ నమస్తుభ్యం వరదే..!
తప్పులు చేస్తే గుంజీలు
ఇంటర్వెల్ లో
గుడుగుడు గుంచాలు..
గంట కొట్టేటప్పటికి
తుర్రుమంటూ ఇంటికి
అమ్మ పెట్టే జంతికల
కోసం వంటింటికి..!
బడుంటేనే సందడి..
ఇంట్లో..వీధిలో..ఊళ్ళో
భుజాన సంచి..
దీవించును విరించి..
ఆపై చదువు నిను వరించి
అజ్ఞాన తిమిరాలను నిలువరించి..
విజ్ఞాన జ్యోతులను పంచి
భవితకు తివాసీ పరచి..
నువ్వు డాక్టరైనా..కలెక్టరైనా..
మురిసిపోయే అమ్మ…
ఆ చదువులమ్మ..!
-సురేష్ కుమార్
9948546286