-వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది
-యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు
-రానున్న ఎన్నికల్లో అరాచక పాలన అంతానికి ఓటే ఆయుధం
-ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు
నిడమర్రు: చంద్రబాబు పాలనలోనే మహిళలకు భద్రత దొరుకుతుందని, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు గ్రామంలో భువనేశ్వరి పరామర్శించారు.
ఈ సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, మహిళలతో భువనేశ్వరి మాట్లాడుతూ….వైసీపీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకమైంది..మహిళలపై దాడులు, అత్యాచారాలు, నేరాలు పెరిగిపోయాయి. 30,196మంది మహిళలు కనిపించకుండాపోయారు. అయినా వైసీపీ ప్రభుత్వం వారిగురించి పట్టించుకోలేదు.
వైసీపీ నాయకులు ఏపీని డ్రగ్స్, గంజాయి, ఇసుక మాఫియా, కల్తీ మద్యానికి అడ్డాగా మార్చారు… తాజాగా ఏపీలో 25వేల కేజీల డ్రగ్స్ దొరికితే..వైసీపీ నేతలు ఆ నెపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ పాలనలో కొంత మంది వైసీపీ నేతలు మహిళలకు గంజాయి అలవాటు చేసి, ఆ మత్తులో ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్న మహిళలపై దాడులకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు.
పూతలపట్టు నియోజకవర్గంలో హంసవేణి అనే మహిళ మంచినీళ్లు అడిగినందుకు వైసీపీ నేతలు ఆమె కళ్లు పీకేసి రాక్షసుల్లా వ్యవహరించారు.
చంద్రబాబు పాలనలో ఏపీకి పెట్టుబడులు భారీగా తరలివచ్చేవి, యువతకు ఉద్యోగాలు వచ్చేవి. నేడు ఏపీ నుండి కంపెనీలన్నీ ప్రక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారు..రైతులకు ప్రతియేటా పెట్టుబడిసాయం 20వేలు, యువతకు 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు ప్రతినెల రూ.3వేలు నిరుద్యోగ భృతి, 18సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు, పేదవారికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి ప్రజాపాలనకు స్వాగతం పలకాలని భువనేశ్వరి అన్నారు.