అమ్మా.. కొడుకు.. ఒక కూతురు!

-కూతురా? కొడుకా?
-విజయమ్మ ఎటు వైపు?
-కొడుకు జగన్ మళ్లీ సీఎం కావాలని ఆశీర్వాదం
-మరోవైపు కూతురు షర్మిలతో కలసి ఉంటున్న తీరు
-కొడుకుతో యుద్ధం చేస్తున్న కూతురు షర్మిల
-విజయమ్మ రెండు పడవల ప్రయాణం
-దానితో ఇదో ప్యామిలీ డ్రామా అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కొడుకా? కూతురా?.. ఇదేదో తల్లా?పెళ్లామా సినిమా అనుకుంటున్నారా? యస్. కాకపోతే టైటిల్‌లో చిన్న ఛేంజ్! పులివెందులలోని ఇడుపులపాయ స్టుడియోలో జరుగుతున్న, వైఎస్ ప్రొడక్షన్ వారి కూతురా? కొడుకా అనే కొత్త సినిమా షూటింగ్ ఇది. ఈ సినిమాలో నిజజీవితంలోని పాత్రలే , పాత్రధారులు కావడం విశేషం.

తల్లిగా విజయమ్మ, కొడుకుగా జగన్, కూతురుగా షర్మిలా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పులివెందుల-ఇడుపులపాయ-హైదరాబాద్-తాడేపల్లి లొకేషన్స్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఇక కథలోకి వెళితే.. కొడుకు జగన్ జైల్లో ఉన్నప్పుడు, చెల్లి షర్మిల-తల్లి విజయమ్మ ఆయన కోసం రోడ్డెక్కారు. న్యాయం కావాలని విలపించారు. చెల్లి ఏకంగా వేలకిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తల్లి ఆమెకు బాసటగా నిలబడింది.

సీన్ కట్‌చేస్తే.. ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో మళ్లీ తల్లి-చెల్లి శ్రమదానం చేశారు. జగన్‌ బాబును గెలిపించాలని, నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానంటూ తల్లి విజయమ్మ ఓటర్లను కోరారు. అన్న జగన్‌ను గెలిపించాలని చెల్లి షర్మిల మండుటెండల్లో కాలికిబలపాలు కట్టుకుని ప్రచారం చేసింది. బావ బ్రదర్ అనిల్ చాపకింద నీరులా క్రైస్తవ సమాజాన్ని జగన్ కోసం పోలింగ్ బూత్‌లకు తరలించారు. ఆ మేరకు బావ కష్టం చెప్పలేనిది. అసలు ఆయనదే ప్రధాన పాత్ర. అయినా ఏసుప్రభువు కరుణించలేదు. బావమరిది సీఎం కాలేదు. కాకపోతే బలమైన ప్రతిపక్షనేతగా అవతరించాడు.

మళ్లీ సీన్ కట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత జగనన్న అధికారంలోకి వచ్చాడు. విజయమ్మ బైబిల్ పట్టుకుని చేసిన ప్రార్ధన ఫలించింది. చెల్లి కష్టం కలసివచ్చి, ఆమె శ్రమకు ఫలితం దక్కింది. కొద్దికాలం వరకూ అంతా బాగానే ఉంది. అందరూ తాడేపల్లికి వచ్చి పోయేవాళ్లు. ఇడుపులపాయలో నాన్న సమాధి దగ్గర అమ్మ-చెల్లి-బావ తో గ్రూప్ ఫొటోలు, కొడుకు నుదుటిపై తల్లి ముద్దులు.. చెల్లెమ్మ నెత్తిపై అన్నయ్య ఆశీర్వాదం అన్నీ మామూలే.

ఇంకోసారి సీన్ కట్ చేస్తే… వాతావరణం మారింది. లెక్కలు కుదరక సఖ్యత కాస్తా సమరంగా మారింది. అన్నయ్య పార్టీకి అమ్మ రాజీనామా చేసింది. హైదరాబాద్ వేదికగా బిడ్డ పెట్టిన తెలంగాణ పార్టీకి పనిచేసేందుకు, కూతురి దగ్గరకే వెళ్లింది. తాడేపల్లికి వెళ్లడం మానేసింది. యుద్ధవాతావరణం ముదిరేముందు.. చెల్లి షర్మిల కాంగ్రెస్‌లో చేరింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా మారింది.

మరోసారి సీట్ చేస్తే… అన్నయ్యను నేరుగా పేరుపెట్టి విమర్శిస్తోంది. అన్నయ్య పాలనను దుమ్మెత్తిపోస్తోంది. అన్నయ్యకు డబ్బు దాహం తప్ప అనుబంధాల విలువ తెలియవని ఎకసెక్కాలాడుతోంది. అవినీతి పాలన అని విరుచుకుపడుతోంది. మాఫియారాజ్ అని ఆరోపిస్తోంది. చిన్నాన్న హంతకులను, అన్నయ్య కాపాడుతున్నారంటూ ఇద్దరు చెల్లెళ్లు ఏకరాగంతో ఆరోపించారు. చివరాఖరుగా అన్నయ్య పాలన అంతమే తమ పంతమని ప్రతిన చేశారు.

శుభం కార్డుకు ముందు ఒక చిన్న మలుపు…
దేవుడి బిడ్డ జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రొటీన్‌గా ఇడుపులపాయ ఎస్టేట్‌లో పెద్దాయన సమాధికి నివాళి సీన్. అంతలో ఎవరూ ఊహించని విధంగా తల్లి విజయమ్మ కనిపించిన దృశ్యం. బిడ్డను గుండెలకు హత్తుకుని.. జయం కలుగుతుంది బిడ్డా.. వెల్లిరా నాయనా అని మనసారా ఆశీర్వదించిన దృశ్యమది. అంటే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఎన్టీఓడిని కన్నాంబ ఆశీర్వదించినట్లన్నమాట!

అంతేనా? ‘‘నా బిడ్డను నీకే అప్పచెబుతున్నా. నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు. ప్రతి బాధలో కూడా తోడుగా ఉన్నావు. నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా’’నని బైబిల్ చేతిలో పెట్టుకుని మరీ, ఏసుప్రభువును నిండుమనుసుతో ప్రార్ధించిన దశ్యం ఈ ఫ్యామిలీ సినిమాకు హైలెట్‌గా చెప్పవచ్చు.

ఈ కుటుంబ కథా చిత్రంపై విశ్లేషణ రాసిన పరిశీలకులు మాత్రం, అమ్మ ప్రేమ చాలా గొప్పదని, కొడుకు ఎలాంటివాడైయినప్పటికీ, కన్న పేగు కొడుకువైపే ఉంటుందని చాలా ఆర్తిగా వివరించారు. కొడుకుకు దూరంగా ఉంటున్నప్పటికీ ఆమె తలపు మాత్రం, తాడేపల్లి లోనే ఉంటుందని మరోసారి తేలింది. కొడుకును మళ్లీ సీఎంను చేయాలని ఏసుపభ్రువు కోరడమంటే, తమ మనసులోని ప్రేమను బయటపెట్టడమే.

బాగుంది. రేపు కూతురు షర్మిల కూడా ప్రచారానికి వెళ్లేముందు.. ఇదే ఇడుపులపాయ లోకేషన్‌కు వెళితే, కూతురును కూడా సీఎంను చేయమని ఏసుప్రభును ఆ తల్లిమనసు ప్రార్ధిస్తుందా? ఒకవేళ మొహమాటానికో, కూతురుపై వల్లమాలిన ప్రేమతోనే కోరినప్పటికీ.. ఒక రాష్ట్రానికి ఒకే సీఎం ఉంటారు తప్ప, ఇద్దరు ఉండరు కదా? జీసస్ మరి అమ్మ కోరికను ఎలా మన్నిస్తారు? పోనీ ఎన్నికల తర్వాత ఏపీని రెండు ముక్కలు చేసి.. రాయలసీమ వరకూ చెల్లిని సీఎంను చేసేలా ఆశీర్వదిస్తారా? అన్నది అప్పుడు తెరపైకి వచ్చే లాజిక్ ప్రశ్న. ఇప్పటికయితే.. అమ్మ ఎవరి పక్షం కాదు. అంటే అమ్మా.. నాన్నా.. ఒక తమిళమ్మాయి మాదిరిగా, అమ్మ.. కొడుకు.. ఒక కూతురు అన్నమాట! అదీ పులివెందుల ప్రొడక్షన్ సినిమా!

Leave a Reply