వ్యవస్థలు గొప్పా? వ్యక్తులు గొప్పా?

– విచారణకు హాజరుకాని వీఐపీలు
– వీఐపీలే విచారణ సంస్థలకు తేదీలు ఇస్తారా?
– జగన్‌ నుంచి కవిత వరకూ ఇదే తీరు
– ఇక విచారణ సంస్థలకు ఏం విలువ ఉంటుంది?
– సాధారణ నిందితులకు ఆ సూత్రం ఎందుకు వర్తించదు?
– ఈడీ, సీబీఐ నోటీసులను లెక్కచేయని వీఐపీలు
– తాజాగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డిదీ అదే శైలి
– వీలున్నప్పుడు వస్తే అది విచారణ అవుతుందా?
– మరి సామాన్యులను ఇంటికొచ్చి అరెస్టు చేయడమెందుకు?
– నిందితులొచ్చే వరకూ కుటుంబసభ్యులను వేధించడమెందుకు?
– వీఐపీలు అడిగిన వెంటనే అంగీకరిస్తున్న విచారణ సంస్థలు
– విచారణల తీరుపై విస్తుపోతున్న సమాజం
( మార్తి సుబ్రహ్మణ్యం)

భారతదేశంలో వ్యక్తులు గొప్పా? వ్యవస్థలు గొప్పా? ఇప్పుడు ఇదీ సమాజ మస్తిష్కాన్ని వేధిస్తున్న ప్రశ్న. ఈడీ, సీబీఐ మాత్రమే కాదు, చివరకు సీఐడీ సైతం విలువలేకుండా పోయింది. నోటీసు ఇచ్చిన రోజున తాము విచారణకు హాజరుకాలేమని, తాపీగా తమకు వీలున్న తేదీకి తెగేసి చెబుతున్న వైచిత్రి, గతంలో ఎప్పుడూ కనిపించలేదు. వినిపించలేదు. ఇటీవలి కాలంలో వ్యక్తులు బాహుబలి అంత స్థాయికి ఎదగటంతో, విచారణ సంస్థలు మరగుజ్జుగా మారిన విషాదం దర్శనమిస్తోంది.

ఈ విచారణ నోటీసులు-వాటికి రాజకీయ నేతలిచ్చే సమాధానాలు.. ‘‘నేతల దయ-విచారణ సంస్థల ప్రాప్తం’’ అన్నట్లు తయారయింది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదన్నది ప్రజాస్వామవాదుల ఆందోళన. విచారణ సంస్థలు సైతం, వీఐపీల కోరిక మన్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితకు ఈడీ తాజాగా నోటీసులిచ్చింది. లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించి, ఈనెల 9న విచారణకు హాజరుకావాలన్నది ఆ నోటీసు సారాంశం. అయితే తనకు బోలెడన్ని కార్యక్రమాలు ఉన్నందున, 15వ తేదీ తర్వాత హాజరవుతానని కవిత ఈడీకి ఓ లేఖ రాశారు. నిజానికి కవిత 10న ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా నిర్వహిస్తున్నారు. దానికి జాతీయ స్థాయి నేతలు కూడా హాజరుకానున్నారు. 2022 ఆగస్టు 17న సీబీఐ, ఆమెపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా, ఈడీ ఆమెకు నోటీసులిచ్చారు.

లిక్కర్‌ కేసు తెలుగు రాష్ర్టాలను కుదిపేసింది. ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట తనయుడు, వైసీపీలో నెంబర్‌ టూ విజయసాయిరెడ్డి సమీప బంధువు సహా, చాలామంది ఈ కుంభకోణంలో పీకల్కోతు కూరుకుపోయారు. ఆ మేరకు అనేక అరెస్టులు జరిగిన ఫలితంగా, కొందరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, బెయిలు సంపాదించారు.

ఇప్పుడా కేసులో ప్రధాన నిందితులంతా.. కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు కవితేనని, ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ఎప్పుడెప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్లిందీ, ఏ హోటల్‌లో బస చేసిందీ వివరించారు. ఆప్‌కు ఎన్నికల ఖర్చు ఏ రూపంలో ఇచ్చిందీ, విచారణ అధికారులకు పూసగుచ్చినట్లు చెప్పారు.

అసలు తాము ఎవరి కోసం బినామీలుగా పనిచేస్తున్నామన్న గుట్టు కూడా విప్పారు. వీరిలో చాలామంది అప్రూవర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కవితపై కేసు బలంగా బిగిసుకుంటుందన్నది సుస్పష్టం. చట్టానికి కావలసింది ఆధారాలే. ఆరోపణలు కాదు. ఇదే కేసులో ఢిల్లీ మంత్రి సిరొడియా ఇప్పటికే అరెస్టవడాన్ని విస్మరించకూడదు.

దాని ఆధారంగా నోటీసులిచ్చిన ఈడీ ప్రయత్నాలు ఫలించినట్లు లేదు. 9న విచారణకు రమ్మన్న ఈడీ లేఖను పట్టించుకోని కవిత, 15 తర్వాత వచ్చి కలుస్తానని లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. నిజంగా కవిత ఈ కుంభకోణంలో నిరపరాధి, అమాయకురాలయితే సంతోషమే. ఒక మహిళ లక్ష్యంగా ఇంత గత్తర జరుగుతున్నా, దాని నుంచి బయటపడటం ఒక మహిళ సాధించిన విజయంగానే భావించవచ్చు. ఆ ప్రకారం.. ఈడీ చెప్పిన తేదీన విచారణకు హాజరయి, తన చేతులు స్వచ్ఛంగా ఉన్నాయని వాదించి, తన వద్ద ఉన్న ఆధారాలు చూపించి, పులుకడిగిన ముత్యంలా ఆమె బయటపడవచ్చు.

ఒకవేళ ఈ కేసులో నిందితులయిన రామచంద్రపిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబు ఎదురుగా కవితను కూర్చోబెట్టి, ఈడీ తన సందేహాలకు సమాధానం కోరవచ్చు. సహజంగా దర్యాప్తు సంస్థలు ఇలాగే వ్యవహరిస్తాయి. ముందు రామచంద్రపిళ్లై-బుచ్చిబాబు, ఆ తర్వాత రామచంద్రపిళ్లై-కవిత.. మళ్లీ కవిత బుచ్చిబాబు.. చివరకు కవిత-రామచంద్రపిళ్లై, బుచ్చిబాబును కూర్చోబెట్టి, తమ శైలిలో విచారించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎవరెంతమందిని తెచ్చి కూర్చోబెట్టినా, కవిత నిరపరాధి అయితే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తాను నిజాయితీపరురాలయినప్పుడు ఆమె ఏ విచారణకూ వెనుకాడాల్సిన అవసరమే లేదు.

తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోనప్పుడు.. అదే సమయంలో ఎవరికీ డబ్బులివ్వనప్పుడు, ఆమె ఎవరి ఒత్తిళ్లకూ తలొంచాల్సిన పని లేదు. అందుకోసం తన అనుయాయులతో ప్రకటనలు ఇప్పించాల్సిన అవసరం అంతకంటే లేదు. మరి తాను నిజాయితీపరురాలిని అని నిరూపించుకునే ఆధారాలు ఎవరెడీగా ఉన్నప్పుడు.. విచారణ తేదీకి, గడువు కోరాల్సిన అవసరం లేదన్నది మేధావుల అభిప్రాయం.

ఎలాగూ 10న ఢిల్లీలోనే ధర్నా ఉంది కాబట్టి.. అంతకుముందు 9 వతేదీనో, లేకపోతే దీక్ష ముగిసిన మరుసటి రోజునే తానే స్వయంగా ఈడీ ఆఫీసుకు వెళ్లి తన దగ్గరన నిజాలు చెబితే, కవిత ఇమేజ్‌ హిమాయమంత ఎత్తు ఎదిగేది. అందుకు భిన్నంగా గడువు కోరడమంటే, అది తనపై అనుమానాలు మరింత పెంచడమేనన్నది.. ప్రజాస్వామ్య పిపాసుల వ్యాఖ్య.

నిజానికి ఢిల్లీ లిక్కర్‌ కేసు సెల్‌ఫోన్ల వల్ల బట్టబయలయిన వ్యవహారం. అందులో నల్లధనం-తెల్లధనం జమిలిగా ఇమిడిఉంది. ఆ డబ్బు పంజాబ్‌ ఎన్నికల కోసం వెళ్లిందన్నది ఓ అభియోగం. కేసు కథ అదయితే… ‘తెలంగాణ తలవంచ దు’ అని కవిత ట్వీట్‌ చేయడమే, విపక్షాలను విస్మయపరిచింది.

అసలు లిక్కర్‌ కేసుకు-తెలంగాణకు ఏం సంబంధం? అంటే కవితకు నోటీసు ఇస్తే తెలంగాణకు నోటీసు ఇచ్చినట్లా? మరి రామచంద్రపిళ్లై, బుచ్చిబాబుకు నోటీసులిచ్చి అరెస్టు చేసినప్పుడు కవిత ఈ ట్వీట్‌ ఎందుకు చేయలేదు? వారికీ తెలంగాణకు సంబంధం లేదా? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేసినప్పుడు, ఆయనెప్పుడూ ఢిల్లీ తలవంచదు అని ట్వీట్‌ చేయలేదు. మరి సిసోడియాను అరెస్టు చేస్తే ఢిల్లీ తలవంచినట్లేనా?. కేసులకు-సెంటిమెంటు రంగు పులమటం వల్ల ప్రయోజనమేమిటి? అన్న ప్రశ్నలు విపక్షాల నుంచి దూసుకువస్తున్నాయి. వీటికి ఎవరు సమాధానం చెబుతారన్నదే ప్రశ్న.

వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి… ఏపీ సీఎం జగన్‌కు బాబాయ్‌ వరసయ్యే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కూడా, సీబీఐ చెప్పిన విచారణ తేదీకి రానని మొండికేస్తున్నారు. తనకు పార్టీ కార్యక్రమాలున్నాయి కాబట్టి, విచారణకు రాలేదకపోతున్నానన్నది భాస్కర్‌రెడ్డి చెప్పే కారణం. ఆయన కొడుకయిన ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా, ముందు ఇలాగే తనకు వెసులుబాటయిన తేదీలోనే వెళ్లి, సీబీఐ అధికారులను కలిశారు.

అసలు తన కుటుంబసభ్యుడైన వివేకానందరెడ్డిని చంపినవాళ్లెవరు? అసలు ఆ హత్య ఎలా జరిగిందో సీబీఐ అధికారులకు ఎంత త్వరగా చెబితే, హంతకులపై అంత త్వరగా శిక్షలు పడతాయి కదా? పాపం ఎంపీ అవినాష్‌రెడ్డి సైతం..వివేకా హంతకులెవరో తేల్చాలనే డిమాండ్‌ చేస్తున్నారు కూడా. కాబట్టి సీబీఐ పిలిచిన రోజే వెళ్లి.. తమ వద్ద ఉన్న ఆధారాలేమిటో ఇచ్చి, తామంతా పులుకడిగిన ముత్యాల్లా బయటపడే అవకాశాలను, వీరంతా ఎందుకు వదులుకుంటున్నారన్నదే అమాయక ప్రజల సందేహం.

అంతెందుకు? స్వయంగా సీఎం జగన్‌ కూడా, తాను కోర్టు విచారణకు హాజరుకాలేనని చెప్పి, హాజరు మినహాయింపు తీసుకున్నారు. విచారణ జరిగే రోజు ఏదో ఒక కార్యక్రమం రూపొందించుకోవడం.. ఆ కార్యక్రమం ఉంది కాబట్టి, తాను కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని చెప్పడం చాలకాలం పాటు చూసిందే. చివరాఖరకు తన హాజరీ కష్టమని కోర్టుకు తేల్చిచెప్పడం, కోర్టు కూడా పెద్దమనసు చేసుకుని.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌కు హాజరీ మినహాయింపు ఇచ్చేసింది. తాను నిజాయితీపరుడినని నిరూపించుకునే ఆధారపత్రాలు.. కట్టలకు కట్టలు అందుబాటులో ఉన్నప్పుడు, అవన్నీ కోర్టుకు చూపించి దర్జాగా కేసు నుంచి బయటపడే అవకాశాన్ని, ఆయన ఎందుకు వదులుకుంటున్నారన్నదే అమాయకుల ప్రశ్న.

ఈ విచారణ మినహాయింపు, తేదీల మార్పు వెసులుబాటు కేవలం వీఐపీలకే పరిమితమా? లేక అధికారులు- వారితోపాటు సామాన్య నిందితులకూ వర్తింపచేస్తారా? అన్నదే అందరి ధర్మ సందేహం. జగన్‌ అక్రమార్కుల కేసులో చాలామంది ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు అరెస్టయ్యారు. మరికొందరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వారెవరూ తాము ఫలానా తేదీకి విచారణకు హాజరుకాలేము, తర్వాత వస్తామని చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ కేసులో కూడా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా చాలామంది వ్యాపారవేత్తలు, ఒక ఎంపీ అరెస్టయి, కేసు ఎదుర్కొంటున్నారు. వారెవరూ తాము ఫలానా తేదీన మాత్రమే వస్తామని గడువు పెట్టలేదు. మరి వీఐపీల విషయంలోనే, ఈ మినహాయింపులెందుకన్నది బుద్ధి జీవుల ప్రశ్న.

ప్రతిరోజూ దేశంలో అనేకమందిపై కేసులు నమోదవుతుంటాయి. రకరకాల అభియోగాలపై వారంతా కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. సీబీఐ-ఈడీలు రోజువారీ కేసులు నమోదుచేస్తుంటాయి. మరి ఆ కేసుల్లో నిందితులు కూడా.. రాజకీయ నాయకులు- అధకార పార్టీ నేతల మాదిరిగానే… ‘మాకు ఇప్పుడు తీరిక లేదు. బోలెడు పనులున్నాయి. తర్వాత రండి’ అని చెబితే, వారి విషయంలో కూడా విచారణ సంస్థలు, కోర్టులు దొడ్డ మనసు చూపిస్తాయా? అన్నదే ప్రశ్న. ఇది ప్రజాస్వామ్యానికే కాదు. విచారణ సంస్థలు, కోర్టుల విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్నగా భావించకతప్పదన్నది న్యాయవాదుల ఆందోళన.

Leave a Reply