మహిళా సాధికారత ఎండమావేనా?

12

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం కోసం ఇది విస్తృతంగా నిర్వహిస్తారు. ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం విభిన్న థీమ్‌తో జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 యొక్క థీమ్ ఇప్పటికే నిర్ణయించారు. ఆవిష్కరణ మరియు సాంకేతికతలో లింగ సమానత్వంగా పేరు పెట్టారు. తమ హక్కుల కోసం పోరాడిన ముఖ్యమైన మహిళలందరినీ ఈ రోజు స్మరించుకోవాలి. స్త్రీలకు ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, హక్కులు ఉంటాయని సమాజం పూర్తిస్థాయిలో గుర్తించటం లేదు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా మానవ హక్కులు అనుభవించ నీయకుండా స్త్రీ ఆంక్షలకు, లింగ వివక్షతకు గురవుతోంది.

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది.దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు.

2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే ఈ ఏడాది జరిగేది 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.పనికి విలువ లేదు, జీతం ఉండదుమహిళలు చేసే ఇంటి పని, సేవలు, నిర్వహించే కుటుంబ బాధ్యత మొదలైనవన్నీ ఇంటి ఆర్థిక పరిస్థితికి వెన్నుదన్నుగా ఉంటూ కుటుంబాలను నిలబెడతాయి. కానీ ఇవేవీ కూడా అధికారికంగా “పని” అని గుర్తింపు పొందవు.మహిళలు చేసే పనికి ఎప్పుడూ విలువ ఉండదు. జీతం భత్యం లేని పని, పరిహారం చెల్లించక్కర్లేదు కాబట్టి బెంగ పడవలసిన అవసరం లేదు. అంతే కాకుండా, ఎల్లవేళలా అందుబాటులో ఉండే విషయం గా పరిగణిస్తారు.మహమ్మారి వలన ప్రపంచానికి ఒక విషయం బాగా తెలిసి వచ్చింది, మహిళలు నిర్వహించే కుటుంబ బాధ్యతలు, ఇంటి పని సామాజిక భద్రతకు కారణమని, మిగతావారు బయటికెళ్లి సంపాదించుకుని రావడానికి తోడ్పడుతున్నాయి అర్థమైంది. కానీ దీనికి చెల్లిస్తున్న మూల్యం చాలా విలువైనది, కుటుంబ సంరక్షణ భారాన్ని మోస్తున్న మహిళల అభివృద్ధి కుంటుపడింది.

విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆనాటి స్త్రీ సంఘ సంస్కర్తలు సావిత్రీబాయీ ఫూలే, పండిత రమాబాయి, స్వర్ణకుమారీ దేవి, అరుణ అసిఫ్ అలీ మొదలుకొని నేటి మహిళా ఉద్యమకారిణి మేధా పట్కర్ స్ఫూర్తిని ప్రతి మహిళా ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో స్త్రీలను కుల, మత, వర్గ, పార్టీలనే భేదం లేకుండా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు, వారి నైతిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడి మహిళా సాధికారత వైపు కృషి చేయాలి. ఆజాది కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ ప్రతి నిత్యం జరిగే గృహ హింస, లైంగిక వేధింపులు, భ్రుణ హత్యలు, పరువు హత్యలకు చరమగీతం పాడలేకపోతున్నాం.

– డాక్టర్ యం. విరూపాక్ష రెడ్డి
(గౌరవ అధ్యక్షులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్)