Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరులో మిర్చిబోర్డు ఏర్పాటు చేయండి

▪️గుంటూరులోని పొగాకుబోర్డును పట్టిష్టం చేసేందుకు సహకరించండి
▪️పొగాకు బోర్డులో 700 మంది ఉద్యోగస్తులు ఉండాల్సి ఉండగా 300మంది అందుబాటులో ఉన్నారు
▪️ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 3శాతం డీఏను పెంచాలి
▪️పార్లమెంట్‌లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి

మిర్చి పంట ఉత్పత్తిలో గుంటూరు జిల్లా దేశంలోనే అగ్రగామిగా ఉందని, దేశంలో పండించే పంటలో 37శాతం గుంటూరు నుంచే పండుతుందని, రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు గాను గుంటూరులో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా మిర్చి పంట ఎగుమతిలో భారతదేశంలో అగ్రగామిగా ఉంటే ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ పంట పండించే రాష్ట్రంగా ఉందన్నారు.గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చిసాగు జరగుతుందన్నారు. ఈ ప్రాధాన్యత దృష్ట్యా వాణిజ్య స్టాండింగ్‌ కమిటీ గుంటూరులో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు.పొగాకు బోర్డు మాదిరిగానే..గుంటూరులో మిర్చిబోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు.

అలాగే గుంటూరులో ఉన్న పొగాకు బోర్డును మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పొగాకు రైతు ధైర్యంగా పంటను వేసేందుకు, పంటలను క్రమబద్ధీకరించుకోవడానికి, గిట్టుబాటు ధరలు పొందేందుకు, నేరుగా తమ సమస్యలను చర్చించుకోవడానికి రైతులకు వెన్నుదన్నుగా ఈ బోర్డు నిలుస్తుందని పేర్కొన్నారు.

కానీ ఆదాయాన్ని గడిస్తూ, సేవలు అందిస్తున్న ఈ బోర్డులో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ బోర్డులో 700మంది ఉద్యోగస్తులు ఉండాల్సి ఉండగా, 300మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని, దీన్ని పరిష్కరించాలని కోరారు.

అలాగే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 3శాతం డీఏ పెరుగుదల అంశాన్ని పరిష్కరించాలని విన్నవించారు.ఆక్వాకల్చర్‌ ఎగుమతుల్లో భారతదేశంలో అగ్రగామిగా ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రధాన పాత్ర పోషిస్తూ ముందజలో ఉందన్నారు. ఇంత ప్రధాన్యత ఉన్న మనదేశంలో ఆక్వాకల్చర్‌ విషయంలో ఎగుమతిదారులకు మేలు చేకూరుస్తూ ఉన్న.. మర్చండైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఇన్‌సెంటివ్‌ స్కీంను రద్దు చేయడం బాధాకరం అని అన్నారు.

2020 ఆగస్టు 31న ఉత్తర్వులు ఇచ్చి ఆర్ధాంతరంగా ఈ స్కీంను రద్దుచేశారు. ఎగుమతిదారులకు సమయం కూడా ఇవ్వకుండా ఉత్తర్వులు ఇచ్చిన కొన్ని రోజుల్లోనే రద్దు చేశారు.రూ.2కోట్లు పైబడిన కంపెనీల వారికే ఈ స్కీం వర్తించేలా ఉత్తుర్వులు ఇచ్చారు. కానీ రూ.2కోట్లు దాటిన కంపెనీలు దేశంలో 2శాతం ఉన్నాయన్నారు. ఈ ఆక్వాసాగుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీంను వర్తింపచేయాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలకు అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉండాలని విన్నవించారు.

LEAVE A RESPONSE