నేరం చేశారా లేదా అన్న విషయం జోలికెళ్లని బాబు లాయర్లు
ఎంపీ విజయసాయిరెడ్డి
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడిందని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా బుధవారం ఆయన ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. బాబు తరుపు లాయర్లు ఆయన నేరం చేశారా? లేదా? అన్న వాదనలు జోలికి వెళ్లకుండా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయకూడదన్న వాదన మాత్రమే వినిపిస్తున్నారని అన్నారు. అయితే స్కిల్ కుంభకోణంపై విచారణ 2018 కి ముందే ప్రారంభమయ్యిందని సీఐడీ వివరణ ఇచ్చిందని అన్నారు.
రాజకీయలబ్ది కోసం పసిపిల్లల్నీ వదలని టీడీపీ
తెదేపా తన నీచ రాజకీయాల కోసం పసిపిల్లలను కూడా వదలడం లేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అన్నెం పున్నెం తెలియని పసివాడి చేతికి మైక్ ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడించి టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారని అన్నారు. ఈ లోకంలో లేని వైఎస్సార్ ని తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. వారి స్వార్థం కోసం పసి మెదళ్లలోనూ విషం నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవ్వా తాతలకు అండగా సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వయో వృద్దులకు కొండంత అండగా నిలుస్తున్నారని వారికి అన్ని విధాలుగా బాసటగా నిలుస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 41.05 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నారని, ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు 35% రాయితీ కల్పిస్తున్నారని అన్నారు. వృద్దులకు ఫిజియోధెరఫి సెంటర్లు, వృద్దాశ్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు.
మొబైల్ తయారీ రంగంలో ప్రపంచ నంబర్ 1 స్థానానికి చేరువలో ఇండియా
మొబైల్ తయారీ రంగంలో ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో ఇండియా ప్రపంచంలోనే మొబైల్ తయారీ రంగంలో రెండవ స్థానంలో ఉందని, మొదటి స్థానంలో నిలిచేందుకు త్వరితగతిన ముందుకు సాగాలని అన్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో తయారయ్యే మొబైల్స్ లో 22% ఎగుమతి కానున్నట్లు అన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రత్యేకించి మేకిన్ ఇండియా చొరవతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు దేశం నుంచి 5.5బిలియన్ డాలర్లు విలువగల మొబైల్స్ ఎగుమతి చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.