– రేవంత్ రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట
– రేవంత్ వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. అలంపూర్ కోర్టు వద్ద అన్నదాతలకు పోలీసులు సంకెళ్లు వేసిన సంఘటన ముఖ్యమంత్రి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట.
పెద్ద ధన్వాడలో గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే దారుణమైతే.. చివరికి దొంగలు, నేరస్తుల లాగా బేడీలు వేయడం క్షమించరాని నేరం.
గతంలో లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీని అడ్డుకున్నారనే కోపంతో గుండెపోటు వచ్చిన రైతుపై కనికరం కూడా లేకుండా బేడీలు వేసి, ఈ ముఖ్యమంత్రి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ధన్వాడ రైతుల విషయంలో కూడా ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి రేవంత్ వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలి.