– నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్లు పుట్టారనుకుంటున్నావా?
– ఏం పాపం చేశారని వంశీ, కొడాలి నానిపై కేసులు పెట్టారు?
– బాబు పై మాజీ సీఎం జగన్ ఆగ్రహం
రెంటపాళ్ల: ఏం పాపం చేశారని నాగమల్లేశ్వరరావును చంపారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కమ్మవాళ్లు వైసీపీలో ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అని ప్రశ్నించారు. నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్లు పుట్టారు అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. కమ్మవాళ్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటాడి, హింసించి జైల్లో పెడుతున్నాడని మండిపడ్డారు.
తప్పుడు కేసులు సృష్టించి వాళ్లను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత కమ్మసామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చేసరికి మరో కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయనను జైలులో పెట్టి రెండు నెలలు దాటిపోయిందని అన్నారు.
ఏం పాపం చేశారని వంశీ, కొడాలి నానిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలిని కూడా వేధిస్తున్నారని అన్నారు. మీరు మీతో పాటు కొన్ని ఛానళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్న దాన్ని పంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తి చూపితే వెంటాడి చంపుతావా అంటూ మండిపడ్డారు.
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్ పల్నాడులోని రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనం అని అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి ఏవీ లేవని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల వేళ తమకు అనుకూలమైన పోలీసులను నియమించుకున్నారని ఆరోపించారు.
కూటమిని గెలిపించుకునేందకు అన్యాయాలు చేశారని, ఆ విషయం ఈ ప్రాంతం వాళ్లందరికీ తెలుసని చెప్పారు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్ కాగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున జనసేన, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని అన్నారు. అక్కడ పోలీసులు ఆయనను ఘోరంగా అవమానించారని తెలిపారు.
ఊరి విడిచి వెళ్లకుంటే రౌడీ షీట్ తెరుస్తామని సీఐ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వాళ్ల ఇంటిపై దాడి చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఆయన కుటుంబం ఇంకా బాధలోనే ఉందని, చంద్రబాబు వీరి కుటుంబానికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.