Suryaa.co.in

Features

ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు

ఉడుకెత్తే రక్తం..
పోరాటమార్గమే రక్తసిక్తం..
నచ్చని బాపూ పథం..
స్వరాజ్యసాధనే శపథం..!

ఆ పేరు చెబితేనే ఈనాటికీ
ఉప్పొంగిపోవును కదా
ప్రతి భారతీయుడి హృదయం..
జీవితంలో సగం
చెరసాల పాలు..
చివరకు తాగి
ఉరికొయ్యల ఉగ్గుపాలు
భరతమాత ఒడిలో
నిదురించిన మహావీరుడు..!

_*భగత్ సింగ్..*_
మనిషి రూపంలోని విప్లవం
మండే అగ్నిగోళం..
పేలడానికి నిరంతరం సిద్ధంగా ఉండే తుపాకి..
తానే ఆవేశమై..
హింసకు ప్రతీహింసే
నచ్చే సన్నివేశమై..
చిన్న వయసులోనే నిద్ర లేచిన విప్లవ భావాలు..
మొక్కలు నాటుతూ
తుపాకీలు నాటుతున్నానని
తండ్రికే చెప్పిన లేతప్రాయం..
ఎక్కడిదీ ఆ బుడతడిలో భయం..
పసి వయసులోని ఆ కసి
వయసుతో పాటు ఎగసి..
ఒకనాటికి తన మరణమే
తెల్లోడి పాలనను కూలద్రోసి!

ఒకే మాట..అది అసలైన వీరుడి నోటి నుంచి వెలువడిన తూటా..
జైలు నుంచి తన విడుదలకు
అర్ధిస్తున్న తండ్రని వారిస్తూ..
*నా విడుదల కన్నా*
*నా మరణమే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయగలదని..*
ఆ విశ్వాసమే భరతజాతి
ఆవేశమై..మహోగ్ర పోరాట సన్నివేశమై..దొరల పెత్తనానికి ప్రాయోపవేశమై
స్వతంత్ర భారత పతాకమై..!

విప్లవం వర్ధిల్లాలి..
ఈ నినాదాన్ని మొదటగా
పలికిన సింహనాదం..
ఆ నినాదమే మహావీరులకు
ముదమై..మోదమై..
జాతికే ఆమోదమై..
రవి అస్తమించని
రాచరికానికే ప్రమాదమై..
ఈనాడు నువ్వూ నేనూ
పీలుస్తున్న
ఈ స్వేచ్ఛావాయువు.
నిజానికి నాడు
భగత్ సింగ్
బిగించి..ఆపై తెగించి విడిచిన ఊపిరి

*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286

LEAVE A RESPONSE