– కేసీఆర్ అభినందన
భారతదేశ పురోగమనే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్,మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా మహారాష్ట్రలో నెలకొల్పబడిన ప్రగతిశీల సామాజిక సంస్థ “శంభాజీ బ్రిగేడ్” బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకుంది.
ప్రగతిభవన్ లో “శంభాజీ బ్రిగేడ్” పదాదికారులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ని కలిసి బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు తమ సమ్మతిని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కి స్వయంగా అందించి తమ నిర్ణయాన్ని తెలిపారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శంభాజీ బ్రిగేడ్ ఇక నుంచి బిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ నాయకులు తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ 2024 మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల శంభాజీ బ్రిగేడ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, పురోగమనమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ, శంభాజీ బ్రిగేడ్ ఒకే భావజాలం, విధానాలతో కలిసి పనిచేస్తుందని వారు ఉద్ఘాటించారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శంభాజీ బ్రిగేడ్ కేడర్ తో పాటు 1600 మంది పదాదికారులు ( రాష్ట్ర స్థాయి నుంచి బ్లాక్ లెవల్ వరకు) ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గారు అనుమతిస్తే రానున్న రోజుల్లో చేరికలు, రాష్ట్ర పదాదికారులకు బాధ్యతల అప్పగింత పై చర్చించనున్నట్లు తెలిపారు.