రామాయణం రచించి
వాల్మీకి అయ్యె మహాముని
భారత కథను ప్రవచించిన
వ్యాసుడాయె భగవానుడు
గీతామృతమును పంచి కాలేదా కృష్ణం వందే జగద్గురుం
సకల దేవతల మంత్రాలు
శ్లోకాలు..కృతులు..ఆకృతులు
అభివర్ణించిన శంకరుడు
అయ్యాడు భగవత్పాదుడు
నిత్య ఆరాధ్యుడు!
ప్రమథ గణాధిపతి గణపతి
స్తుతికి పంచరత్న స్తోత్రం
శంకరాచార్య విరచితం
ఆరోగ్య ప్రదాయి సుబ్రమన్యుని
అనుగ్రహానికి భుజంగస్తోత్రం
ఆ మహనీయుడి వరం..
ముల్లోకాలను ఏలే ఈశుడు
పరమేశుడి కరుణా కటాక్ష వీక్షణములకై శ్లోక శతకాలే
అర్ధనారీశ్వర స్తోత్రం
ముక్కంటి అనుగ్రహానికి హామీపత్రం..
దశ శ్లోకీ స్తుతి
హాలాహలదారునికి చేర్చదా
నీ సన్నుతి..
భోళాశంకరుని దక్షిణామూర్తిగా
కొలువ మూడు రూపాల కొలువు..
దక్షిణామూర్తి స్తోత్రం
దక్షిణామూర్తి అష్టకం..
వర్ణమాలా స్తోత్రం..
హరుని కటాక్ష విరి
శివానందలహరి..
మారుమ్రోగే ఢమరుకం శివాష్టకం!
నీ ఇంట సిరుల పంట..
కనకధార ఆదిలక్ష్మి కంట..
శంకరాచార్య విరచిత
శ్లోకమాల..
సౌభాగ్యమే కదా జగమెల్ల!
అమ్మవారి స్తోత్రాలు…
విష్ణు స్తోత్రాలు..
మాతృ పంచకం..
కళ్యాణ వృష్టి..
వరాల కుంభవృష్టి..
ప్రసన్నమయ్యేలా లోకాల ఏలిక నవరత్న మాలిక..
అంజనీ సుతుని స్తుతికి
పంచరత్నం..
క్షేత్ర స్తోత్రాలూ
ఆ మహనీయుని విరచితాలు..
గంగను..నర్మదను..
యమునను ప్రసన్నం చేసే స్తోత్రాలు…
ఈ కలియుగాన మన ముక్తికి
దారి చూపే ఎన్నో స్తోత్రాలు
శంకరుని అద్భుత విరచితాలు!
మానవ మనుగడకే దిక్సూచిలు
మోక్ష మార్గంలో భక్తి సుమాలు!
(శంకర జయంతి సందర్భంగా నమస్సులతో)
-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546386