ఈ మధ్యనే శరత్ చంద్ర గారి “సమాహారం” కథల సంపుటి చేతి కందింది. ఎంతో ఆనంద మనిపించింది. ఒక్కసారి తిరగేద్దాం అని పుస్తకం చేతిలో పట్టుకున్నాను. అంతే… ‘సమాహారం’ నన్ను ఆవహించింది. ఈ ఒక్క కథా చదివి ఆపేద్దాం అనుకుంటూ పుస్తకం మొత్తం ఏకబిగిన చదివేసా. ఈ రోజుల్లో ఈ విధంగా చదివించే పుస్తకాలు కడు తక్కువ. వెంటనే “సమాహారం” కథల గురించి నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే మీ అందరూ ఈ పుస్తకాన్ని చదివితే ఆనందిస్తారని అనిపించింది.
ఈ కథా సంపుటి చదివేటప్పుడు రచయిత లోని ఆశావహ దృక్పథం, సామాజిక బాధ్యత నన్ను అబ్బుర పరిచాయి. ఏ కథ చూసినా ఒక సమస్యను ఎత్తి చూపటం, దాని పరిష్కారాన్ని సూచించటం! ఇటువంటి కథలను సమాజాన్ని భిన్న దృక్కోణాల నుంచి పరిశీలిస్తే కానీ వ్రాయటం అసాధ్యం. రచయిత ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఆ హోదాలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించటానికి చేపట్టిన చర్యలు ఇందులోని కొన్ని కథలను సాధికారంగా వ్రాయటానికి సహాయపడ్డాయి అనటంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు.
ప్రతి కథావస్తువు ఆకట్టుకుంటుంది. ఇంచుమించు ప్రతి కథలో ఓ ఊహించని మలుపు ఉంటుంది. ప్రతి ముగింపు ఆశావహంగా ఉంటుంది. రచయిత ఎక్కడా నినాదాలు ఇవ్వలేదు. సందేశం ఇచ్చే ప్రయత్నం చెయ్యలేదు. కానీ… ప్రతి కథలోనూ పాఠకులను ఆకట్టుకొనే అంతర్లీన సందేశం ఉంది. అది పాఠకులను కట్టి పడేస్తుంది. ‘సమాహారం’ ఈ సంపుటిలో మొదటి కథ “సమాహారం” ఈ కథ రైతుల సమస్యకు అందించిన పరిష్కారం అపూర్వం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఏం చేయవచ్చో సూచించిన ఈ కథ “నవ్య”కథల పోటీలో బహుమతిని పొందింది. ‘వేస్ట్ ఫెలో’ కథ కుటుంబంలో ఎందుకూ పనికిరానివాడుగా తీసివేయబడ్డ వ్యక్తి అసలు విలువను తెలియజేస్తుంది. ‘సంపన్నుడు’ కథ జీవితంలో ఆచరించవలసిన విలువను ప్రబోధిస్తోంది. ఇక ‘రిజిస్ట్రేషన్’ కథ కుటుంబ విలువలకు అద్ధం పడుతుంది. ‘ చేదెక్కిన లోకం’ మారుతున్న విద్యా విధానాలపట్ల ఆవేదనను వెలిబుచ్చితే, ‘రఘుపతి రాఘవ రాజారామ్’ ముగ్గురు మిత్రులు జీవితంలో ప్రయాణించిన మార్గాలను, స్నేహానికి నిర్వచనాన్ని చెప్తుంది.
‘అక్వేరియం ‘ కథ ఓ పసిబాలుడి ఆవేదనను, ఆలోచనలను మనముందు పరచి ఒక హెచ్చరికను పంపుతుంది.వ్యవస్థ లో చిన్న వాడిని పెద్ద వాడు ఎలా దోచుకుంటున్నాడో ఎత్తి చూపుతుంది. సామ్యవాద దృక్పధం ని అద్భుతం గా చిత్రిస్తుంది. దానికి “ఎక్వేరియం”లోని చేపల ధోరణిని ఉదాహరణగా చూపడం విశేషం. ‘జీవించు’ కథ ఒక ఉపాధ్యాయుడు శిష్యుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలడో మన కళ్ళ ముందు నిలుపుతుంది. ‘విరోధి’ కథ యదార్థ వాది లోకవిరోధి అనే సామెతను గుర్తు చేస్తుంది. ‘అడుగుజాడ’ రచయిత దార్శనికతను తెలియజేస్తుంది. ఈ కథ చదివాక అన్నివేళలా పెద్దలే మార్గదర్శకులు కానక్కరలేదు, కొన్ని సందర్భాల్లో పిల్లలే పెద్దలకు దారి చూపించవచ్చు అనుకుని నిట్టూరుస్తాం.
‘నాన్న’, ‘అమ్మ లేని లోగిలి’ పేర్లను చూస్తేనే అర్థమౌతుంది అవి కుటుంబానికి సంబంధించిన కథలని. సున్నితమైన కుటుంబ బంధాలను ఈ కథల్లో అందంగా ఆవిష్కరిస్తారు రచయిత. ఇక ‘దామిని’, ‘శివపురి’ సమాజంలో పాతుకు పోయిన దురాచారాలపై, మహిళల దయనీయమైన పరిస్థితులపై ఎక్కు పెట్టిన బాణాలైతే ‘చక్రభ్రమణం’ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతా రాహిత్యం మీద చురకలేస్తుంది. తాతకు అసలైన వారసుడు మనవడే అని అందంగా చెప్తుంది. ‘బ్లాక్’ కథ అంధత్వం జీవితంలో పురోగమించటానికి అడ్డంకి కాదనే సందేశాన్ని అందిస్తే, ‘చెత్త’ కథ మనల్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తుంది. ‘పేటెంట్ ‘ కథ మనుషుల్లోని స్వార్థపరత్వాన్ని పరిహసిస్తుంది. ‘లాల్ బి’ కథ పైకి కనిపించని మనుష్యుల స్వభావాలను మన ముందుకి తెస్తుంది. ఒక్క నిమిషం మనం ఆశ్చర్య పోతాం పైకి కనిపించే స్వభావాలకి, అసలు స్వభావాలకి ఇంత అంతరం ఉంటుందా అని.
‘నిర్వాసితులు’కథ రచయితకు ఉన్న రాజకీయ అవగాహనను మనకు తెలియజేస్తుంది. చిత్తశుద్ధి ఉన్నవారు నాయకులైతే ప్రజలకెంత మేలు చేయగలరో చెప్తుందీ కథ. ‘కాలచక్రం’ కథ ఊహించని మలుపుతో హృదయాలను బరువెక్కిస్తుంది. ఇక ఈ సంపుటిలోని ఆఖరి కథ ‘సౌందర్యం’ ఒక కొత్త ఆలోచనా విధానాన్ని పాఠకుడి ముందు నిలుపుతుంది.చైతన్య పరుస్తుంది. దేవుడి ని అడ్డుపెట్టుకొని ఎదగాలి అనుకున్న వాళ్ళ కు ఈ కథ ఒక చర్నాకోల్. ప్రతి కథా ఒక విభిన్న కథాంశం తో కూడినదే. కథ చదివాక కొంత సేపు ఆలోచింప చేసేదే. సాటి మనిషి పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆనందింపచేసేదే. మానవ సంబంధాలను పటిష్ఠ పరిచే దిశగా అడుగులేసేదే. అంతో, ఇంతో మనను, అంటే పాఠకుడిని ఆలోచింపచేసేదే. ఇందులో ఏ కథా కేవలం కాలక్షేపానికే అనేలా ఉండదని నా హామీ.
ఈ రకంగా 22 మంచిముత్యాలతో కూర్చిన ‘సమాహారం’ శరత్ చంద్ర గారు సాహిత్య సరస్వతికి అలంకరించిన కంఠాభరణం. అన్ని కథలనూ చదివిన తరువాత నాకు అనిపించింది ఒకటే. శరత్ గారికి సామాజిక సమస్యల పట్ల పూర్తి అవగాహన, సమాజం పట్ల, తోటి మనుషుల పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నాయి. కేవలం ఇటువంటి భావనలు ఉన్నవారే బాధ్యతాయుతమైన రచనలు చెయ్య గలరు. వీటికి తోడు రచయితగా వారికున్న ఆపారానుభవం ఈ కథల సంపుటిని ఇంత చక్కని శైలితో మనకందించేదుకు దోహదపడింది. ప్రతి కథను గురించి ఒక్క వాక్యమే వ్రాసినా నా సమీక్షే ఓ పెద్ద కథంత అయ్యింది. ఇంకా వ్రాయటం అంటే సాహసమే అవుతుంది.
దానా, దీనా నాకు అనిపించిందేంటంటే “సమాహారం” చదివినవారు “ఆహా” అనుకుంటే, చదవలేని వారు “అయ్యో ” అని బాధపడటం ఖాయం. ఇటీవల కాలంలో వెలువడిన ఓ మంచి కథా సంకలనం “సమాహారం”. అందుకనే ఈ చక్కని కథలను చదువుదాం, చదివిద్దాం, ఆనందిద్దాం!
ప్రచురణ :పాలపిట్ట ప్రచురణలు
రచయిత నుండి కాపీ కావాలి అనుకున్న వారు రచయిత వాట్సాప్ నెంబర్ :9849 241 286. సంప్రదించవచ్చు.
-సరస్వతి కరువది