ఆమె గళమెత్తిందంటే గగ్గోలే..
పాటందుకుంటే బాక్సాఫీసు బద్దలే
ఇక మసక మసక చీకటిలో మల్లెతోట ఎనకాల మాపటేల కలుసుకో.. నీ మససైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే.. అని పిలిస్తే మూడు తరాలోళ్ళు ఎఱ్ఱెక్కి యా అనాల్సిందే.
సినిమా గాత్రంలో ఎల్లార్ ఈశ్వరిది ఓ ప్రత్యేక సూత్రం. మత్తెక్కించే మంత్రం!
మాయదారి పిల్లోడు మనసే లాగేసిండు.. ఆ హస్కీ గొంతుతో ఎన్ని హృదయాలు కొల్లగొట్టేసిందో.. తెలుగు సినిమాల్లో జ్యోతిలక్ష్మి..జయమాలిని.. హలం.. ఈ త్రయం కోలాహలం.
ఈ ముగ్గురిలో ఎవరి కాల్షీట్ ఖరార్ అయినా తదుపరి ఎల్లార్ ఈశ్వరి దుమ్ము దుమారమే నాటి రసిక రాజుల గుండెల్లో అలారమే..!
ఈశ్వరి గొంతు సర్దితే ఆశాభోంస్లే..ఉషాఉతఫ్… కలిసి పాడినట్టే.. ఆశాజీ దమ్మారో దం అంటూ కిక్కెక్కస్తే, మన ఈశ్వరి అదే రాగంలో నందామయా గురుడ నందామయా.. ఇలా పిచ్చెక్కించేసింది. ఆ స్వరం ఆమెకో వరం. అందులో ఓ ఊపు..ఓ కైపు..! లగ్గమెప్పుడ్రా మామా.. కుదిపేసిన ఈ ప్రశ్న.. లెలే లెలెలే నా రాజా.. లేలే నా రాజా.. ఊపేసిన ఆ పిలుపు.. తీస్కో కోకోకోలా.. ఏస్కో రమ్ముసారా ఏస్తే నిషా.. గుటకేస్తే మజా.. ఆమె పాట వింటేనే మజా.. ఆ పాటే నిర్మాతకు ఖలేజా..!
సంప్రదాయానికి సుశీలమ్మ.. వైవిధ్యానికి జానకమ్మ.. ఈ రెంటికీ నడుమ అందమైన నడుం చూపించే జ్యోతిలక్ష్మి.. జయమాలిని.. ఆ ఇద్దరి కోసమే ఈమె పుట్టిందా అన్నట్టు.. కొన్ని పాటలు ఆమె కోసమే పుట్టాయా అనుకునేట్టు.. ఊపేసింది.. టాపు లేపేసింది!
పాటలు సినిమాకి ఆయువుపట్టు
ఎల్లార్ ఈశ్వరి పాట ఉప్మాతో పెసరట్టు!
అభిమాన గాయని ఎల్ ఆర్ ఈశ్వరి @87.. జన్మదిన శుభాకాంక్షలు
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286