September 16, 2026

ఆమె మగాడ్రా బుజ్జీ!

  • సీఎం రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ తిరుగుబాటుపై కాంగ్రెస్ క్యాడర్ ఫిదా
  • వేటు వేసినా క్యాడర్ మద్దతు ఆమెకే
  • కొండా ప్రశ్నలు ఢిల్లీకి జ్ఞానోదయం కలిగించాలి
  • భట్టి భార్య వసూళ్లు, పొంగులేటి కొడుకు దందాలపై కొండా ప్రశ్నలకు జవాబేదీ?
  • సోనియా, రాహుల్, ఖర్గే, వేణుగోపాల్ కంటే రేవంత్ స్థాయి ఎక్కువా?
  • పార్టీ నాయకత్వం నిర్ణయాలను సీఎం రేవంత్ ఎలా ప్రకటిస్తారు?
  • వీటిని అడిగేందుకు సీనియర్ల నోర్లు ఏమయ్యాయి?
  • కొండా పాటి దైర్యం సీనియర్లకు లేదా?
  • ఆత్మగౌరవం లేని సీనియర్ల కంటే ఆమెనే హీరోనంటూ కితాబులు
  • సీనియర్లు పదవుల కోసం పెదవులు మూసుకున్నానంటూ ఆగ్రహం
  • ఇక బీసీ వర్సెస్ రెడ్డి పోరాటమేనని స్పష్టీకరణ
  • కొండాపై వేటు బీఆర్‌ఎస్‌కే లాభమని వాదన
  • ‘అచ్చ కాంగ్రెస్’ వారికి అడుగడుగునా అవమానాలేనని ఆవేదన
  • మధ్యలో వచ్చిన మాజీ టీడీపీ నేతల పెత్తనమేంటి?
  • వలసవాదులతోనే పార్టీకి ప్రమాదమన్న ఆందోళన

( మార్తి సుబ్రహ్మణ్యం)\

ఇది మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ముచ్చట. నిండు గర్భిణి అయినప్పటికీ, హైదరాబాద్ నగర నడిబొడ్డున ధర్నా చేసి.. నాటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా పాణ్యం వెళ్లి మరీ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రేణుకాచౌదరిని, అప్పట్లో ఎన్టీఆర్ ‘టీడీపీలో ఒక్క మగాడు’ అని నోరారా ప్రశంసించారు. అది ఆమె పోరాట పంథాకు, పార్టీ శ్రేణులు ఇచ్చిన ప్రశంసాపూర్వకమైన బిరుదు లాంటి గుర్తింపు. దశాబ్దాలు దాటినా రేణుకలో ఇప్పటికీ అదే ఫైర్. అది వేరే కథ.

సీన్ కట్ చేస్తే.. మళ్లీ మూడున్నర దశాబ్దాల తర్వాత అదే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అధికార పార్టీ రాజకీయాల్లో, కేవలం తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రలను ఒంటిచేత్తో ఎదుర్కొంటూ.. స్వయంగా సీఎంతో కలబడి-నిలబడి, సీనియర్లు సైతం సిగ్గుపడేలా సింహనాదం చేస్తున్న ఒక మహిళ, అందునా ఒక బీసీ బిడ్డ చేస్తున్న తిరుగుబాటు చూసిన అదే అధికార పార్టీ శ్రేణులు.. ‘కాంగ్రెస్‌లో ఒక్క మగాడు’ అని ప్రశంసించడమే కాదు. ‘ఆమె మగాడ్రా బుజ్జీ’ అని నేరుగా.. సీఎంపైనే తిరుగుబాటు జండా ఎగరవేసిన ఆమె ధైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

తాజాగా ఆమె పదవిని ఊడగొట్టినా .. ఆత్మగౌరవం లేని సీనియర్లు చేయని తెగింపు చేసిన ఏకైక ‘మహిళా సివంగి’ అన్న కీర్తి మాత్రం సొంతం చేసుకున్నారు.

ఇంతకూ ఢిల్లీ బాసుల కంటే తానే శక్తివంతుడనని.. అనేక సందర్భాల్లో నిరూపించుకున్న సీఎం రేవంత్‌రెడ్డిపైనే తిరుగుబాటు చేసి.. తన ప్రశ్నలతో అధిష్ఠానాన్ని ఆత్మరక్షణలో నెట్టిన ఆ ఫైర్ బ్రాండ్ పేరు, కొండా సురేఖ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సహజంగా ఏ పార్టీలో అయినా..ఒక వివాదారస్పద నేతను పార్టీ అధ్యక్షుడు పిలిపించి మాట్లాడి ంచి పంపిస్తే, బయటకు వచ్చిన సదరు నాయకుడు బయట ఉన్న మీడియాకు ఏం చెబుతారు? ‘అధ్యక్షుడితో అన్నీ మాట్లాడా. నా వివరణ ఇచ్చా. సమస్య త్వరలో సర్దుబాటు అవుతుందనుకుంటున్నా. ఈ విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తా. అయినా ఇదంతా మా కుటుంబంలోని సమస్యలు. మీకు లోపల ఏం జరిగిందో చెప్పాల్సిన పనిలేదు’’ అని తప్పించుకుంటారు. సహజంగా ఏ పార్టీలో అయినా జరిగేది ఇదే.

కానీ వరంగల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ అందుకు భిన్నం. అలా పార్టీ అధినేత ఖర్గేతో భేటీ అయి బయటకు వచ్చిందో లేదో.. ఇలా బయట మీడియా దగ్గర సీఎం రేవంత్‌రెడ్డిపైనా చర్య తీసుకోవాలని కోరినట్లు చెప్పి బాంబు పేల్చారు. దానికీ ధైర్యం కావాలి మరి. అధ్యక్షుడిని కలిసిన తర్వాత కూడా, భయపడకుండా ఆమె చేసిన ప్రకటనకు దమ్ము కావాలి. ఇప్పుడు తెలంగాణ సీనియర్లలో కనిపించ నిది ఆ ఆత్మగౌరవం.. ఆ ధైర్యమే.

అవును. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఖరారు చేసేది ఢిల్లీ నాయకత్వం. అంటే ఏ సోనియా గాంధీనో, ఏ రాహుల్ గాంధీనో, ఏ ప్రియాంకగాంధీనో. ఏదైనా పార్టీ అధ్యక్షుడి పేరు మీద ఆయా రాష్ట్రాల ఇన్చార్జిల ప్రకటన ద్వారా టికెట్లు దక్కుతుంటాయి. మరి మధ్యలో సీఎం రేవంత్‌రెడ్డి ఎవరు? ఆయన కూడా తన మాదిరిగా హైకమాండ్ నుంచి సీటు తెచ్చుకుని, హైకమాండ్ నిర్ణయంతో సీఎం అయిన నామినేడెట్ నాయకుడే కదా? మరి టికెట్లు ఇస్తానని చెప్పడానికి ఆయనెవరు? అన్నది కొండా సురేఖ మీడియా భుజంపై తుపాకీ పెట్టి ఢిల్లీకి గురిపెట్టిన ప్రశ్నాస్త్రాలు.

నిజమే. ఈ పాటి నిలదీసే దమ్ము,ధైర్యం, ఆత్మగౌరవం ఉన్న సీనియర్లు కాంగ్రెస్‌లో లేరన్నది కొండా సురేఖ ఎపిసోడ్ స్పష్టం చేసింది. అసలు ఈ ప్రశ్నలు వేయాల్సింది సురేఖ కాదు. కాంగ్రెస్‌లోనే పుట్టిన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు.. భట్టి విక్రమార్కలు..కోమటిరెడ్డిలు.. పొన్నం ప్రభాకర్‌లు.. శ్రీధ ర్‌బాబులు.. అజారుద్దీనులు..దామోదర రాజనర్శింహలు.. జూపల్లి కృష్ణారావులు!

ఎందుకంటే వీరిలో అజారుద్దీన్, జూపల్లి, పొన్నం మినహా మిగిలిన వారంతా సీఎం, పీసీసీ చీఫ్ పదవుల కోసం పరితపించిన సీనియర్లే. ప్రస్తుత క్యాబినెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, పొంగులేటి మినహా మిగిలిన వారంతా ‘అచ్చ కాంగ్రెస్‌‘ వారే. అంటే ‘పుట్టు కాంగ్రెస్’ వారన్నమాట!

ఆ ప్రకారంగా తాము చేయాల్సిన ఫిర్యాదులు.. తాము సంధించాల్సిన ప్రశ్నలను సురేఖ సంధిస్తుంటే, తల నేలకు వంచాల్సిన పరిస్థితి సీనియర్లది. పార్టీలో తమ కంటే జూనియర్ అయిన ఒక మహిళ ఆత్మగౌరవం దెబ్బతిని వేసిన ప్రశ్నలు, సీనియర్ల వైఫల్యానికి-వారి పదవుల ఆరాటానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కొండా సురేఖ ఢిల్లీ గడ్డపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లలో ఆత్మగౌరవం చచ్చిపోయి.. పదవుల కోసం రాజీ పడుతున్న దుస్ధితికి అద్దం పడుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

‘‘ వారి మౌనం ద్వారా తమకు సీఎం అయ్యే అర్హత లేదు. అందుకు రేవంత్‌రెడ్డి ఒక్కరే అర్హులని ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, దామోదర రాజనర్శింహ, పొన్నం లాంటి మంత్రులు.. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, జానారెడ్డి, వీహెచ్, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్ వంటి సీనియర్లు నేరుగా అంగీకరించినట్లయింద’’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

లేకపోతే వీరంతా, తానే మరో పదేళ్లు సీఎంగా ఉంటానని.. ఫలానా వారికి వచ్చే ఎన్నికల్లో టికెటు ఇస్తానని రేవంత్ ప్రకటించిన గంటలోనే స్పందించి, ఆ హక్కు మీకు ఎక్కడ ఉందని ప్రశ్నించేవారు. మేము కూడా సీఎం పదవికి అర్హులమేనని ధైర్యంగా ప్రకటించేవారు.

ఆవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పటికి అరడజను సార్లు.. తానే సీఎంగా ఉంటానని బహిరంగంగా చెప్పినా ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సహా సీనియర్ మంత్రులంతా మౌనంగా ఉన్నారంటే వారంతా రేవంత్‌రెడ్డికి భయపడుతుండటమో, లేదా ఆయనతో సర్దుబాటుచేసుకోవడమో జరగాలని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇంత భయపడే వాతావరణం వైఎస్ కాలంలోనూ లేదని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ను రేవంత్.. తనతోపాటు టీడీపీ నుంచి వచ్చిన వారితో ‘పచ్చ కాంగ్రెస్’గా మార్చి, అచ్చ కాంగ్రెస్‌కు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల్లో బాహాటంగానే వినిపిస్తున్నాయి. సీఎం అపాయింట్‌మెంట్లు కూడా గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పటి అనుబంధాలకే దక్కుతున్నాయన్న వ్యాఖ్యలు సైతం వినిపించకపోలేదు. వలసవాదులతో పార్టీకి ఎప్పటికయినా నష్టమేనని, నాయకత్వం తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి, పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను తనంతట తానే కాలరాసుకుంటోందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఇక పార్టీలో తరచూ బీసీవాదం వినిపిస్తూ, బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదంటూ కారాలు మిరియాలు నూరే వి.హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ లాంటి బీసీ నేతలు.. కొండా సురేఖ వ్యవహారంపై స్పందించకుండా మౌనంగా ఉండటంపై బీసీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బీసీ మంత్రి సురేఖను తొలగించేందుకు సీఎం గారు భట్టి ద్వారా ప్రయత్నిస్తున్నారన్న వార్తలు మీడియాలో వస్తున్నా, బీసీ నాయకులమని చెప్పుకునే వీహెచ్ తదితర నాయకులు మౌనంగా ఉండటం ఏమిటి? కేవలం మీ పదవుల కోసమే బీసీ వాదం వినిపిస్తారా? అని బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ బీసీ వ ర్సెస్ రెడ్డి నినాదం బలపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అది పార్టీకి బీసీలను దూరం చేయటంతోపాటు, బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే బీసీ సంఘాలు కొండాను బర్తరఫ్ చేసిన తీరుపై విరుచుకుపడుతున్నాయి. ఇది బీసీలను అవమానించడమేనని మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌లో రెడ్లకు తప్ప బీసీ, ఎస్సీలకు గౌరవం లేదన్న నిజం కొండా సురేఖ బర్తరఫ్‌తో తేలిపోయిందని కారాలు మిరియాలు నూరుతున్నారు.

Total Visitors: 2,654,948