కార్తీకమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని మహాపాదయాత్ర చేస్తున్న మహిళలు ఈ రోజు ప్రత్యేక పూజలు చేశారు.వీరు చేస్తున్న మహాపాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ మహిళా జేఏసీ నేతలు విజయవాడలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేకువజామునే దీపాలు వెలిగించి.. సీఎం మనసు మారాలని కోరుకున్నారు.
ప్రకాశం జిల్లాలో అమరావతి రైతులు, మహిళలు రెండు రోజులు నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నిన్న రాత్రి ఇంకొల్లు శుభమస్తు కళ్యాణమండపంలో బస చేశారు. కార్తీక సోమవారం కావడంతో మహిళలు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.శ్రీ వెంకటేశ్వర స్వామి రథం ముందు రంగవల్లులు వేసి.. ధూప, దీప, నైవేధ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.స్వామివారిని కీర్తీస్తూ, అమరావతిని సాధిద్దామంటూ భజనలు చేశారు.ఈ కార్యక్రమంలో అమరావతి మహిళా రైతులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా మహిళా జేఏసీ నేతల పూజలు..
“న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ” పేరుతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని కోరుతూ… మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీకమాసం తొలిసోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించేలా ముఖ్యమంత్రి జగన్కు పరమేశ్వరుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తెలిపారు.
మహాపాదయాత్రను ప్రజలు పూలతో స్వాగతం పలుకుతుంటే.. ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉందని ఆమె పేర్కొన్నారు.
పోలీసులు అక్రమ కేసులు బనాయించినా, అవమానాలు ఎదురైనా రాష్ట్ర భవిష్యత్ కోసం భరించామని తెలిపారు.రైతుల త్యాగాలు వృథా కాకుండా మహా పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిపించాలని శివయ్యను కోరుకున్నట్లు చెప్పారు.