– డీజీపీని రీకాల్ చేయాలి
– రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
– న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం
రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఏడుగురు నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దిల్లీలో కలిసింది. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా పలువురు నేతలున్నారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏక కాలంలో జరిగిన దాడులను వివరించినట్లు సమాచారం.
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని.. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. తెదేపా నేతలతో కలిసి దిల్లీలో రాష్ట్రపతితో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆయా రాష్ట్రాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. దేశం, అంతర్జాతీయంగా ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు.
మద్యపాన నిషేధం పేరుతో భారీగా రేట్లు పెంచారని.. మాఫియాగా ఏర్పడి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి ఆరోపించారు. ‘డ్రగ్స్ ఫ్రీ ఏపీ’ కోసం తెదేపా పోరాడుతోందన్నారు. డ్రగ్స్‌తో యువత.. తద్వారా జాతి నిర్వీర్యమవుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నియంత్రించాలని కోరితే ఒకే రోజు తెదేపా కార్యాలయాలపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మీడియానూ నియంత్రిస్తున్నారు. తెదేపా నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టారు. అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కస్టడీలో టార్చర్ పెడుతున్నారు. తెదేపా నేతలను ఆర్థికంగా, శారీరకంగా హింసలు పెడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే మా కార్యాలయంపై దాడి చేశారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేదని.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లే దాడి చేసి ప్రజలపై కేసులు పెడుతున్నారని.. రాష్ట్రాన్ని భయానకంగా మార్చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రపతికి అవన్నీ వివరించామన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మాఫియా దేశ సమగ్రతకు ముప్పుగా తయారయ్యే పరిస్థితి ఉందని.. దీన్ని నియంత్రించాలని రాష్ట్రపతిని కోరామన్నారు.
తెదేపా కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని కోరామన్నారు. సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థని డీజీపీ భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీని రీకాల్ చేయాలని.. ఆయన చేసిన తప్పులకు శిక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా తెదేపా పోరాటం కొనసాగిస్తుందన్నారు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని.. దోషులను కఠినంగా శిక్షించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.