– బాబు రెండు కళ్ళ సిద్ధాంతమే రామోజీ సిద్ధాంతం
– పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు స్టాండ్ ఏమిటి..?
– పోలవరం ఆలస్యానికి చంద్రబాబు కారణం కాదా..?
– టీడీపీ హయాంలో వైఫల్యాలు ఈనాడు రామోజీకి కనిపించవా?
– రూ. 50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు అయినా ఎందుకు పూర్తి చేయలేదు?
– మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్‌మీట్
మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టేనాటికే వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవడం చూశాం. అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 854 అడుగులు వస్తేనే నీళ్లు తీసుకోలేకపోతున్నాం. అదే తెలంగాణ రాష్ట్రం వాళ్లు 800 అడుగుల్లోనే నీళ్లు వాడుకుంటున్నారు. దాంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు తీసుకెలేకపోతున్నాం. అందుకే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాం, అలానే అక్కడ రాయలసీమ లిఫ్ట్ ను ఏర్పాటు చేశాం. 40 రోజుల్లోపు వరద నీటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకుని, ప్రాజెక్టులు నింపుకోవాలి అనే దానిపై సమగ్రంగా విశ్లేషించి… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తున్నాం. ఉత్తరాంధ్రకు సంబంధించి సుజల స్రవంతి పథకంను కూడా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ప్రణాళికను రూపొందించడం జరిగింది.
గత ప్రభుత్వం అయిదేళ్లపాటు నిద్రపోయి… ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ప్రాజక్టులకు టెండర్లు పిలిచారు. మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం వచ్చే వరకూ నీటిని తీసుకోలేని పరిస్థితి ఉంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని మీకు తెలియదా? దానిమీద మీరు ఏరోజు అయినా ఆలోచన చేశారా? ఏరోజైనా ఈనాడు పత్రికలో రాశారా..? రాయలసీమకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తే కనీసం మద్దతు అయినా తెలిపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నాం.
సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టామని టీడీపీ వాళ్లు చెబుతున్నారు. మరి మీ అయిదేళ్లలో అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏమన్నా అంటే పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పూర్తి చేసిన కుడి కాల్వకు కేవలం లిఫ్ట్ పెట్టి పట్టిసీమను రూ.1300 కోట్లుతో పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు.
చంద్రబాబు 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి.. ‘నేను మొదలుపెట్టాను.. నేను పూర్తి చేశాను’ అని ఒక్క ప్రాజెక్ట్‌ను అయినా మీకంటూ పూర్తిగా పేటెంట్ హక్కుగా చూపించగలరా? – దాదాపు రూ.25వేల కోట్లు నీరు-చెట్టు మీద తగలేసి దోపిడీ చేశారే తప్ప ఈ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఒక్క ప్రాజెక్ట్‌ను అయినా చంద్రబాబు పూర్తి చేయగలిగారా?
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో అయిదేళ్లలో మీరు చేసినదానికన్నా.. మా ప్రభుత్వం రెండేళ్లలో చేసింది ఎక్కువ. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే మీరు సైంటిఫిక్‌గా కట్టకపోవడం వల్లే టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమై.. డయాఫ్రమ్ వాల్‌కు డిజైన్స్ కోసం అప్రూవల్ ఆలస్యం కావడం వాస్తవం కాదా? కమీషన్ల కోసం కక్కుర్తి పడి మీరు చేసిన తప్పిదం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. చింతలపూడి ప్రాజెక్ట్‌కు పర్యావరణ శాఖ అనుమతి తీసుకోలేదు. మీరు ఏది సక్రమంగా చేశారు. ఒకపక్క మీ వాళ్లతో ఎన్జీటీలో కేసులు వేయిస్తారు? మరోవైపు రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం కేసులు వేస్తుంటే.. మీరు కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలికారా అని అడుగుతున్నాం. అందులో కూడా తెలంగాణ సర్కార్‌కు టీడీపీ వాళ్లు సహకరించారే కానీ కరువు జిల్లాల అభివృద్దికి మద్దతు పలికారా?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, గండికోట, చిత్రావతి పనులు మొదలుపెట్టాం, అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ రామోజీరావుకు కనిపించడం లేదా? గత అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఈనాడు రామోజీకి ఎందుకు కనిపించవు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను నీరుగార్చిన చంద్రబాబు వైఫల్యాలు ఎందుకు కనిపించవు. టీడీపీ తన ప్యాకేజీల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టుపెట్టింది వాస్తవం కాదా? దానివల్లే ఇవాళ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు నిధుల కొరత ఏర్పడటం నిజం కాదా?
ముఖ్యమంత్రి ఒక ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెన్నా, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేస్తున్నాం. వెలిగొండలో ఒక టన్నెల్‌ను పూర్తి చేశాం. రెండో టన్నెల్ కూడా దాదాపు పూర్తి కావొస్తోంది. పోలవరం కాఫర్ డ్యామ్ కొట్టుకుపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ సమస్య తలెత్తింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి కడుతుంటే ఆపే ప్రయత్నం టీడీపీ ఎందుకు చేయలేదు? టీడీపీ హయాంలో గోదావరిపై నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్‌లు కడుతుంటే ఆపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నాం. ఇవన్నీ టీడీపీ వైఫల్యాలు కాదా? ఇవన్నీ ఈనాడు డ్రామోజీకి కనిపించవా? మీ వాడు కావడం వల్ల మీకు కనిపించడం లేదా?
చంద్రబాబు తన పార్టీ నేతలతో ప్రకాశం జిల్లాలో ఒక మాట మాట్లాడిస్తాడు. సీమలో మరోమాట మాట్లాడిస్తాడు. పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు నాయుడు తన స్టాండ్ ఇది అని స్పష్టంగా చెప్పగలడా? వ్యతిరేకిస్తున్నానో, స్వాగతిస్తున్నానో అని చెప్పగలరా? ఎప్పుడూ రెండు ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే ఆయన పని.
కోవిడ్ కారణంగా పనులు కొంత జాప్యం అయినా.. ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, పనులు వేగవేంతం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నది మీ వల్ల కాదా అని అడుగుతున్నాం. అయినప్పటికీ మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనులను ముందుకు తీసుకువెళుతున్నారు.
ప్రాంతాల మధ్య రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడటం పరిపాటిగా మారింది. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు చంద్రబాబు పూర్తి చేయకపోతే.. అవి ఈనాడుకు, టీడీపీ నేతలకు కనిపించవా?అదే 2019లో వైయస్సార్ సీపీ అధికారంలో రాగానే చేపట్టిన పనులు కోవిడ్‌తో పాటు కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయితే, దానిపై విమర్శలు చేయడమా?
రామోజీరావు సిద్ధాంతం ఏంటంటే.. రెండు రాష్ట్రాల పట్ల రెండుకళ్ల సిద్ధాంతంతో వార్తలు రాస్తారు. ఏపీలో మాత్రం “మా బాబు ఏదంటే అది, మావోడు ఏదంటే అది”. ఎవరు బాగుండకూడదని విషం చిమ్మటం. పేపర్ ఉంది కదా అని దుర్మార్గంగా నీచంగా దిగజారి వార్తలు రాస్తారా? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలకు ఏం చేయాలో తెలుసు. తన తండ్రి ఆలోచనా విధానంతో సాగునీటి ప్రాజెక్ట్‌లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారని చెబుతున్నాం.
విలేకర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
కోవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగానే ఆర్థిక సంక్షోభం నెలకొంది. అయినా ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులలో రెండు, మూడు నెలలు ఆలస్యం కావచ్చు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగారు ఆర్థిక సమస్యలను అధిగమించుతారు.
ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అమలు అవుతున్నాయా? ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో జరుగుతున్నాయా? ఏమి చూసి తెలంగాణ నుంచి మేము తెచ్చుకోవాలో మీరు చెప్పండి?