ఏఎంఆర్‌పై కూటమి, వైసీపీ మాట్లాడవేం?

- ఏఎంఆర్‌పై చర్యలేవీ?
- రాష్ట్రంలో ఇదో రౌడీరాజ్యంలా మారింది
- బాధితులకు బాసటగా ర్యాలీలో పాల్గొన్న మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు
అనకాపల్లి: ఎలాంటి అనుమతులు లేకుండా కొండలు పిండిచేసి, కోట్లాదిరూపాయలు అర్జిస్తున్న ఏఎంఆర్‌పై చర్యలేవని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నిలదీశారు. ఏఎంఆర్ అవినీతిని ప్రశ్నించకుండా కూటమి, వైసీపీ పార్టీలు మౌనంగా ఉండటం దారుణమని, వారి మౌనం ఏఎంఆర్ అవినీతిని ప్రోత్సహించడమేనని ఏబీ స్పష్టం చేశారు.
‘పౌర సమాజం, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఏఎంఆర్ అక్రమాలపై రోజూ గొంతు చించుకుని మాట్లాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటే, ఆ సంస్థకు పాలకుల నుంచి ఎంత బలమైన మద్దతు ఉందో అర్ధమవుతుంది. ప్రజల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
మార్టూరు మండలంలో లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ఏఎంఆర్ దోపిడీకి నిరసనగా.. ప్రజాసంఘాలు నిర్వహించిన ర్యాలీలో ఏబీ పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం చట్టవ్యతిరేక చెక్‌పోస్టులు నిర్వహిస్తున్న ఏఎంఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏఎంఆర్ అనుమతి లేకుండా చట్టవ్యతిరేకంగా చెక్‌పోస్టులు నిర్వహించి, స్టాంప్ ప్యాడ్ ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ‘రాష్ట్రంలో ఇదో రౌడీరాజ్యంలా మారింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం. రాష్ట్రాన్ని బీహార్‌గా మార్చదలచుకున్నారా? ఏఎంఆర్‌పై న్యాయపోరాటం కొనసాగుతుందని ఏబీ వారికి హామీ ఇచ్చారు. ఏఎంఆర్‌కు డబ్బులు చెల్లించవద్దని లారీ డ్రైవర్లకు సూచించారు.
