అమెరికా ట్రంప్ టారిఫ్ టెర్రరిజం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపబోతుంది. దీనివల్ల భారతదేశంలో పలురంగాలపై ప్రభావం పడుతుంది. పరిశ్రమలమూత, ఉద్యోగాల కోత, ఉత్పత్తి తగ్గించుకోవడం లాంటి పరిస్థితులు రాబోతున్నాయి. వ్యవసాయ రంగం మొత్తం దెబ్బతినబోతుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో రొయ్యలు, పత్తి, పాడి, పౌల్ట్రీ, చిన్న పరిశ్రమలు. జీడిపప్పు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి.
వివిధ దేశాల ఎగుమతులపై అమెరికా సుంకాలు వేసింది. మన పక్కనే ఉన్న శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలపై 19,20 శాతం సుంకాలు వేసిన ట్రంప్, మనదేశ రొయ్యలు ఎగుమతిపై 60% సుంకాలు వేశారు. ఇక్కడ ఈక్విడార్ లాంటి దేశంపై కేవలం 13% సుంకాలు వేశారు. మన రొయ్యలు అమెరికాకు ఎగుమతి చేయటం కష్టంగా మారనుంది. రెండు బిలియన్ డాలర్ల రొయ్యలు ప్రస్తుతం ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా జరిగే ఎగుమతుల్లో | 26% అమెరికాకు మన రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ప్రత్యేకించి మన రాష్ట్రంలోని ఆక్వా రైతులపై ఈ సుంకాలు తీవ్ర నష్టం కలుగజేయబోతున్నాయి. ఆర్థికంగా రొయ్యలు సాగు చేసే రైతులు బాగా నష్టపోతారు.
అమెరికా దేశం పత్తిని మన దేశానికి పంపితే మనం 11% దిగుమతి సుంకం వేసేవాళ్ళం, అమెరికా ఒత్తిడికి మన ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ లొంగిపోయి ఆ సుంకాన్ని రద్దు చేశారు. దీనితో మనదేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పత్తిని కొనే నాధుడే లేకుండా పోతారు. కంపెనీలు తక్కువ ధరకు అమెరికా నుండి దిగుమతి చేసుకొని మన రైతాంగాన్ని ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని గాలికి వదిలేస్తారు.
ఇతర దేశాల నుండి మన దేశానికి పాల పదార్థాలు పంపితే జున్ను పై 30% వెన్నపై 40% పాలపొడి పై 60% దిగుమతి సుంకాలు ప్రస్తుతం వేస్తున్నాము. సుంకాల శాతం తగ్గించమని అమెరికా హుంకరిస్తుంది. అదే జరిగితే 25 బిలియన్ టన్నుల దిగుమతులు మనదేశానికి వస్తాయి. మన రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా పాడి రంగంలో ఉన్నారు. అమెరికా దెబ్బకు ఈ ఒప్పందాల వల్ల ఒక్కొక్క పాడి రైతుకు రోజుకి సుమారుగా 158/- రూపాయలు సంవత్సరానికి 57 వేల రూపాయలు నష్టపోతారు.
కోళ్లు పౌల్ట్రీ పరిశ్రమపై అమెరికా దేశంలో కోడి కాళ్ళ కన్నా బ్రెస్ట్ భాగాలు తినడానికి అక్కడి ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు. వారికి ఇష్టము లేని కాళ్లు, ఇతర ఉపయోగంలో లేని కోడి మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని అమెరికా కుట్ర. అందువలన అమెరికా ఒత్తిడికి లొంగి కోడి వ్యర్థాలు దిగుమతికి అనుమతించటం అంటే మనదేశంలోని కోళ్ల పరిశ్రమకు సమాధి కట్టడమే అవుతుంది.
కోడి, పాడి రెండు గ్రామాల్లో ఇంటి పట్టు నుండే మహిళలకు స్వయం ఉపాధి చూపే రంగాలు కోడి, పాడిపై ఆధారపడిన మహిళలపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. మహిళల ఉపాధిని ఎక్కువగా దెబ్బతీస్తుంది. జీడిపప్పు ఎగుమతుల వలన మిలియన్ల కొలది డాలర్లు మనదేశం సంపాదిస్తుంది. 25 నుండి 30% జీడిపప్పు అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా టారిఫ్ వల్ల రైతులతోపాటు రెండు లక్షల మందికి పైగా జీడి పిక్కల పరిశ్రమలలో పనిచేసే కార్మికుల ఉపాధిపై కూడా ప్రభావం చూపుతుంది.
మందులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, టీ, కాఫీ సుగంధ ద్రవ్యాలపై కూడా అమెరికా సుంకాల ప్రభావం తీవ్రంగా పడబోతుంది. వ్యవసాయ యంత్రాలు, ఆటోమొబైల్ విడి విభాగాలు, ఆర్గానిక్ రసాయనాలు 83 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాము. వ్యవసాయంలో విచ్చలవిడిగా యంత్రాల ప్రవేశం వల్ల ఇప్పటికి పని దినాలు తగ్గుతున్నాయి. రానున్న కాలంలో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అమెరికాకి వెళ్లే మన పిల్లలకు హెచ్ 1బి వీసా రుసుము లక్ష డాలర్లకు (88 లక్షల రూపాయలకు) పెంచింది. వారానికి 20 గంటలు పని చేసుకునే అవకాశం ఉండేది… ఇప్పుడు ఆ అవకాశం లేకుండా నిబంధనలు పెట్టారు. మన పిల్లల పై ఇలాంటి అనేక ఆంక్షలు అమెరికా ప్రభుత్వం పెడుతుంది. చివరికి సినిమాలపై కూడా పన్నులు వేస్తున్నారు..
అమెరికా ట్రంప్ సుంకాల దాడి వల్ల 25 నుండి 30 బిలియన్ డాలర్ల (2.0 నుండి 2.6 లక్షల కోట్ల రూపాయలు) అమ్మకాలు తగ్గిపోయాయి. మన దేశము నుండి అమెరికాకు ఎగుమతి చేసే వాణిజ్య ఎగుమతులపై ట్రంప్ విధించే 50% సుంకాల ప్రభావం పడబోతుంది. ఆర్థిక వ్యవస్థకు నష్టం తెచ్చిపెడుతుంది. జిడిపి, విదేశీ మారక ద్రవ్యం రాబడి తగ్గుతుంది. రూపాయి విలువ మరింత పడిపోతుంది.
2025 మేలో డాలర్ విలువ రూ.84.33/-లు ఉంటే 2025 అక్టోబర్లో డాలర్ విలువ 88.50 రూపాయలకు పెరిగిపోయింది. అంటే మన రూపాయి విలువ ఎంత వేగంగా పడిపోతుందో మనము తెలుసుకోవాలి. దీనివల్ల మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు ఆకాశానికంటుతాయి. రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతాయి.
“మా ఇంటికి వస్తూ ఏమి తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి పెడతావు” అన్నట్లు అమెరికా సామ్రాజ్యవాదం తన సరుకులను భారతదేశానికి ఎగుమతి చేస్తే అమెరికాపై వేసే సుంకాలు తగ్గించాలట. మనదేశం నుండి సరుకులు అమెరికాకు ఎగుమతి చేస్తే మనపై సుంకాలు పెంచుతారట. ఇది అమెరికా దౌత్యనీతి.
ట్రంప్ హుంకరింపులకు మోడీ – చంద్రబాబు మోకరిల్లి పోయారు. అందుకే పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేశారు. మనపై వేసిన సుంకాలపై అమెరికాతో మాట్లాడే ధైర్యం చేయడం లేరు. మోడీ అనేక ఉపన్యాసాలు చెబుతున్నారు. కానీ నోట్లో నుండి అమెరికా అని పేరు చెప్పటానికే వెనకడుగు వేస్తున్నారు. అందుకే ప్రజలు, కార్మికులు, రైతులు, కౌలు రైతులు, కూలీలు ఐక్యంగా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలి. మన కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా అమెరికాపై ఒత్తిడి తెచ్చి దేశానికి మేలు జరిగేటట్లు ప్రయత్నం చేయాలి.
ప్రత్యామ్నాయాలు
బ్రిక్స్ దేశాలతో సమన్వయంగా వ్యవహరిస్తూ అమెరికా సుంకాల బెదిరింపులకు చెక్ పెట్టాలి.
సుంకాల విధింపు వలన దెబ్బతిన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మికులు రైతాంగానికి ఊరట కలిగించటానికి మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.
వ్యవసాయ రంగంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు, కూలీలు, కౌలు రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించే పథకాలు ప్రవేశపెట్టాలి.
ఇతర దేశాలతో చర్చ జరిపి ఎగుమతికి ఉన్న అవకాశాలు పెంచాలి. దానితో పాటు దేశీయ వినియోగం పెంచడానికి ఉన్న మార్గాలు ప్రచారం చేయాలి.
రొయ్యలు, చేపలు, వస్త్ర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వినియోగదారులకు సబ్సిడీలు ఇవ్వాలి.
పారిశ్రామిక సంఘాలతో చర్చలు జరిపి మోడీ ప్రభుత్వం “ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం” ప్రకటించింది. ఎగుమతులకు ప్రోత్సహకాలు ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే కార్మికులు, రైతాంగం, ఇతర వృత్తుల ప్రజలతో చర్చలు జరిపి ఆయా వర్గాలకు మేలు చేసే ప్రోత్సాహక పథకాలు ప్రకటించి అమలు చేయాలి.
వీటన్నిటికీ డబ్బు అవసరం ఎక్కడ నుంచి వస్తుందని అనుమానాలు కూడా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద గతము నుండి వసూలు చేసిన జీఎస్టీ, చమురు ద్వారా ఇంకా అనేక మార్గాల ద్వారా కావాల్సిన డబ్బు వసూలు చేశారు.
రాయటర్స్ సంస్థ ప్రకారం ప్రత్యేకంగా 17 బిలియన్ డాలర్లు ఒక్క చమురు ద్వారానే రష్యా నుండి కొనుగోలు చేయటం వల్ల ఆదా చేసుకున్నారని చెప్పారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ ఉండదు. కాబట్టి అమెరికా ఆగడాలు ఎదుర్కోవాలి. దేశీయ వినిమయం పెంచి పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాలను కాపాడాలి.
దేశంలో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారు. వ్యవసాయ రంగం ఏ మాత్రం దెబ్బతిన్నా తీవ్ర సంక్షోభంలోకి పోతాము. అమెరికా, చైనా వస్తువులపై 100% ట్యాక్స్ అధనంగా పెంచినా ధైర్యంగా ఎదిరించినట్లు భారతదేశం కూడా స్వాతంత్య్ర స్పూర్తితో ధైర్యంగా స్వతంత్రంగా నిలబడాలని కోరుతున్నాము.
భారతదేశంలో అమెరికా ట్రంప్ సుంకాల యుద్ధం ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా, పత్తి, పౌల్ట్రీ, పాడి, జీడిపప్పు రంగాలపై తీవ్ర ప్రభావం సుంకాలకు వ్యతిరేకంగా జరిగే ప్రచార ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయండి.
– బుద్దరాజు రాంబాబు