Home » సింధూ నది పుష్కరము

సింధూ నది పుష్కరము

శ్రీప్లవ నామ సంవత్సర దక్షిణాయన శరదృతువు కార్తిక మాస బహుళ పక్ష విదియ శనివారం అనగా 20.11.2021న రోహిణి నక్షత్ర 3వ పాదం వృషభ రాశి శివయోగం తైతుల కరణం సింహలగ్న సమయంలో దైవ గురువు బృహస్పతి అంటే గురుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర 3వ పాదములో 50% బలంతో సమ స్థితిలో బాల్య అవస్థలో అడుగుపెట్టనున్నారు. ఆ క్రమంలో ఆరోజు రాత్రి అయినది కనుక రెండవ రోజు అయిన నవంబర్21,2021 ఆదివారం సూర్యోదయం నుంచి డిసెంబర్ 2 వరకు.. అంటే 12 రోజులపాటు సింధూ నదికి పుష్కరాలు జరగనున్నవి.
ఋగ్వేదం అనేక నదులను వివరిస్తుంది. వాటిలో “సింధు” అనే పేరు ఉంది. ఋగ్వేదములో “సింధు”ను ప్రస్తుత సింధునది అని భావిస్తారు. ఇది దాని వచనంలో 176 సార్లు, శ్లోకాలలో 94 సార్లు ధృవీకరించబడింది. చాలా తరచుగా “నది” సాధారణ అర్థంలో ఉపయోగించబడుతుంది. ఋగ్వేదంలో, ముఖ్యంగా తరువాతి శ్లోకాలలో, సింధు నదిని సూచించడానికి ఈ పదానికి అర్ధం ఇరుకైనది, ఉదా. నాడిస్తుతి సూక్తా శ్లోకంలో పేర్కొన్న నదులలో సింధునది ప్రస్తావన ఉంది. ఋగ్వేద శ్లోకాలు బ్రహ్మాపుత్ర మినహా అందులో పేర్కొన్న అన్ని నదులకు స్త్రీ లింగాన్ని వర్తిస్తాయి.కానీ సింధూ నది మాత్రం పుంలింగాన్ని సూచిస్తుంది. అదే ఆశ్చర్యం ఏ నదికి లేని ప్రత్యేకత. అది ఒక్క సింధూ నదికి మాత్రమే ఉంది.
సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లద్దాక్ మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారత్ లోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి.
3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది.భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.
సింధూ నది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! పాకిస్తాన్లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు.
సింధూ నది కశ్మీర్ లోయలో ప్రవేశించదు.కానీ సింధునది ఉప నదులు కశ్మీర్ లోయలో ప్రవహిస్తాయి. అయితే కొన్ని టూరిస్టు ఏజెన్సీలు సింధూ పుష్కరాల సమయంలో ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోనే మార్గ్ లో ఉద్భవించిన ఒక వాగును కశ్మీరీలు సింధ్ గా వ్యవహరిస్తారు. ఈ వాగు షాధిపూరా అనే గ్రామం సమీపంలోని నారాయణ్ భాగ్ వద్ద జీలం నదిలో కలుస్తుంది. రెండు నదులు కలిసే సంగమం కావడంతో, యాత్రీకులు ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నిజానికి సింధు నది లద్దాక్ మీదుగా పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రవేశిస్తుందనే విషయం మనం మర్చిపోరాదు.

Leave a Reply