– విజయవంతంగా మెగా జాబ్ మేళా కార్యక్రమాలు
– ప్రభుత్వ చొరవకు యువత హర్షంప్రభుత్వ సంకల్పం – సింగరేణి సౌజన్యంతో ఘనంగా ఏర్పాట్లు
– ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 7 పట్టణాల్లో భారీ జాబ్ మేళా కార్యక్రమాలు
పాల్గొన్న 66,965 మంది నిరుద్యోగ యువత
– ఒక ఉత్సవంగా, ఉత్సాహంగా కొనసాగుతున్న జాబ్ మేళాలు
సింగరేణి భవన్: ఉద్యోగం — ప్రతీ నిరుద్యోగి స్వప్నం! తగిన విద్యార్హతలు ఉన్నా, హైదరాబాద్ నగరంలో కంపెనీల చుట్టూ తిరిగినా ఉద్యోగం లభిస్తుందన్న హామీ ఉండదు.
అలాంటి పరిస్థితుల్లో, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల యువత ముంగిటకే హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి, వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కల్పిస్తోంది.
నిరుద్యోగుల ముఖాలపై వెలుగులు నింపుతూ, సింగరేణి గత ఆరు నెలలుగా మెగా ఉద్యోగ మేళాల రూపంలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. దాదాపు24 వేల మంది యువతకు కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది.
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి చిరు తోడ్పాటు
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం… మెగా జాబ్ మేళా కార్యక్రమాల నిర్వహణ ద్వారా కార్యరూపం దాల్చి విజయవంతంగా నడుస్తోంది. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆలోచనలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో గత ఆరు నెలల కాలంలో 7 పట్టణాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాలలో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వీరిలో 23,650 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం.
ఇంత భారీ ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం బహుశా ఇదే ప్రథమం. ఏడవ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు గల వారితో పాటు, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం దక్కింది. హైదరాబాద్ ప్రాంతం నుండి ఒక్కొక్క జాబ్ మేళా కార్యక్రమంలో 100 నుండి 250 వరకు పలు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.
మైకుల ద్వారా, పోస్టర్ల ద్వారా, కరపత్రాల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో ఈ జాబ్ మేళా కార్యక్రమాలు మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న యువతను విశేషంగా ఆకర్షించాయి. యువతీ యువకులు వేలాదిగా తరలి రావడంతో పట్టణ ప్రాంతాలు ఒక ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారని జాబ్ మేళాలో పాల్గొన్న నిరుద్యోగ యువత, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాలను సంబంధిత ఏరియాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీంతో ఈ కార్యక్రమాల నిర్వహణ గురించి ప్రతీ గ్రామంలో విస్తృత ప్రచారం జరిగింది. వారు విస్తృతంగా నిర్వహించిన ప్రచారం వల్ల పెద్ద సంఖ్యలో యువత ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఈ జాబ్ మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21వ తేదీన మధిర నుంచి ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సారథ్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 5,000 మంది పాల్గొనగా 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి. అదే నెల 27వ తేదీన భూపాలపల్లిలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,500 మంది పాల్గొనగా 2,000 మందికి ఉద్యోగాలు లభించాయి.
మే 18వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించిన జాబ్ మేళాలో 5,100 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 3,029 మందికి ఉద్యోగాలు లభించాయి. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మే 24వ తేదీన వైరా పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో భారీగా నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 12,000 మందికి పైగా పాల్గొనగా 4,041 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, తదితరులు పాల్గొన్నారు. కాగా అక్టోబర్ 25వ తేదీన రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మాత్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హుజూర్ నగర్ లో నిర్వహించిన అతి పెద్ద జాబ్ మేళా కార్యక్రమంలో 20,500 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 4,574 మందికి ఉద్యోగాలు లభించాయి.
అలాగే 26 వ తేదీ ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మొత్తం 14,318 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా వీరిలో 4,611 మందికి ఉద్యోగాలు లభించాయి. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదే రోజు బెల్లంపల్లిలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 6,547 మందికి పైగా నిరుద్యోగ యువత ఈ కార్యక్రమానికి తరలివచ్చారు కాగా 3,095 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించాయి.
సింగరేణి ఏర్పాట్లపై సర్వత్రా హర్షం
సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ఈ భారీ మెగా జాబ్ మేళా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించింది. స్టాల్స్ ఏర్పాటు, ప్రచారం, భోజనం, హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రైవేటు కంపెనీల ప్రతినిధులకు సౌకర్యాలు, మంచినీటి వసతి, సింగరేణి అధికారులు ,ఉద్యోగులు, సింగరేణి సెక్యూరిటీ మరియు రెస్క్యూ విభాగం వారి సేవలను ప్రజా ప్రతినిధులు, హాజరైన నిరుద్యోగ యువత ప్రత్యేకించి కొనియాడారు.
సింగరేణి సంస్థ భవిష్యత్తులో కూడా సింగరేణి ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే సామాజిక బాధ్యత కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని సంస్థ చైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ప్రత్యేకంగా ఉద్యోగ మేళాలకు సంస్థ సంపూర్ణ సహకారం అందించనుందని, ఈ ద్వారా స్థానిక యువతకు, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సింగరేణి తన వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.