Suryaa.co.in

Features

గానకళకే కళ ..మెహ్‌దీహసన్

మహోచ్చమైన గజల్ గాయకుడు మెహ్‌దీహసన్ వర్ధంతి ఇవాళ.

గానకళకే కళ మెహ్‌దీహసన్. అత్యంత గొప్ప గాత్రం, అత్యంత గొప్ప గాన విధానం‌ ఆయనవి.
Rounded even warm baritone with verve and clear resonance మెహ్‌దీహసన్‌ది. సాంద్రమైన గాత్రం, సాంద్రమైన గానం ఆయనవి.
గానం అన్న‌ కళను మెఱుగుపఱుచుకుంటూ వెళ్లి ఒక ఉచ్చస్థితిని చేరుకుంటే అది మెహ్‌దీహసన్‌ గానమౌతుంది.
స్వర సమం, సంతులనం,‌ విరామం, విలంబం ఇవి మెహ్‌దీహసన్‌ గానంలో ఉన్నతంగా కొలువై ఉంటాయి.
సంగీతంలో తనకు మునుపులేని వైశిష్ట్యం తనవల్ల తనరారేట్టు గానం చేశారు మెహ్‌దీహసన్‌.
విశేషమైన ఫణితి ఆయనది.
కలావంత్ ఘరానాకు చెందిన శాస్త్రీయ సంగీత కళాకారుల వంశంలో‌ 16వ తరం‌‌ మెహ్‌దీహసన్‌ది. రాజస్థాన్‌లోని లున అనే ఊళ్లో 1927లో పుట్టారు. సంస్కృతం కూడా చదువుకున్నారు మెహ్‌దీహసన్‌!
కర్ణాటక‌, హిందూస్థానీ సంగీత విద్వాంసులు‌ మెహ్‌దీహసన్‌ గాత్ర , గానాలకు జోహార్లర్పించారు‌. “మీ గొంతులో దేవుడు పలుకుతున్నాడు” అని లతామంగేశ్కర్ ఆయన్ను అన్నారు. “మనల్ని మనం గాయకులమనుకుంటున్నాం,‌ కానీ గాయకుడంటే
మెహ్‌దీహసనే” అని మన్నాడే అన్నారు.‌ వీణ మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి, వైఅలిన్ లాల్ గుడి జయరామన్ వంటి సంగీత నిష్ణాతులు మెహ్‌దీహసన్‌కు ప్రత్యేకమైన స్థానాన్ని, విలువను ఇచ్చారు.
గానాన్ని ధ్యానంగానూ, ధ్యానాన్ని గానంగానూ చేశారు మెహ్‌దీహసన్‌.
గాత్ర , గానాల్లో బిగి, పొంకం విద్వత్, మాధుర్యం వీటికి సాకారం మెహ్‌దీహసన్‌. ప్రత్యేకమైన, ప్రశస్తమైన గానసృజనాత్మకత మెహ్‌దీహసన్‌ది.
స్వరాలకు పైన సంగీతం ఆవరించి ఉంటుంది. ఈ సత్యాన్ని తన గానంతో ఆవిష్కరించారు మెహ్‌దీహసన్‌.

Elaborate aesthetic embellishment మెహ్‌దీహసన్‌ గానం. Personification of profound performance మెహ్‌దీహసన్‌
గానం. Manifestation of singing sublimity మెహ్‌దీహసన్‌ది.
మెహ్‌దీహసన్‌ ఒక ఉదాత్తమైన గాయకుడు అనీ, ఆయన గాత్రం, గానం‌ అత్యుదాత్తమైనవి అనీ అవగతమౌడమే ఒక అర్హత. మెహ్‌దీహసన్‌
గాత్రాన్ని, గానాన్ని ఆస్వాదించగలగడం ఒక ఉదాత్తమైన అభిరుచి.

గానంపరంగా…

ఠుమ్రీ ‘రంగ్’ వేఱు,
దాద్రా ‘రంగ్’ వేఱు,
గజల్ ‘రంగ్’ వేఱు,
గీత్ ‘రంగ్’ వేఱు అని తెలియచెబుతారు; ఆ
సరైన స్పృహ ఉన్న గాయకుడు మెహ్‌దీహసన్.

(2019లో ఆంధ్రజ్యోతి వెబ్ ఎడిషన్‌లో
మెహ్‌దీహసన్ గురించి రాశాను. ఆ రచన…)

| గానానికి ప్రాణం – ప్రాణం ఉన్న‌ గానం |

గానం‌ అన్నది మెఱుగుపడుతూ వెళ్లి ఒక ఉన్నత‌ స్థితిలో‌ ఉండిపోతే అది మెహ్‌దీహసన్‌
గానం‌‌ అవుతుంది. ఉర్దూ గజల్ గాయకుడుగా ప్రపంచ ప్రఖ్యాతిపొందిన మెహ్‌దీహసన్‌
గుఱించి ముచ్చటించుకుందాం…

మెహ్‌దీహసన్‌ ముఖ్యంగా‌ గజల్ గాయకుడు. రేడియో కరాచీలో నిలయ ఠుమ్రీ గాయకుడై ఆపై ఆ దేశపు చలన చిత్ర గాయకుడై ఆపై ఉర్దూ గజల్‌ గాయకుడై గజల్ గానాన్ని విశ్వవ్యాప్తం‌ చేశారు. ఒక‌ ఉదాత్తమైన గాయకుడుగా వినుతికెక్కారు. గజల్ గానాన్ని పాకిస్తాన్ నుంచి లండన్ రొయల్ అల్బట్ హాల్ (Royal Albert Hall)కు తీసుకువెళ్లారు.
మెహ్‌దీహసన్‌ జూలై 18 , 1927లో‌ రాజస్థాన్ లోని లున అనే ఊళ్లో‌ ఒక సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టారు. ఆయన కుటుంబం కలావంత్ అన్న సంగీత కళాకారులకు సంబంధించినది. తండ్రి ఆజీమ్ ఖాన్.
తండ్రి గురువు కూడా. ఆజీమ్ ఖాన్ జైపూర్ రాజు ఆస్థాన గాయకుడు.
ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ, దాద్రా‌ వంటి హిందూస్థానీ సంగీత సంప్రదాయాలను మెహ్‌దీహసన్‌ తన 8వయేట నుంచీ అభ్యసించారు. తన 20వయేట అప్పుడు‌ ఏర్పడ్డ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఒక సైకిల్ కొట్లోనూ, కార్ మెకానిక్ గానూ పొట్టకూటి కోసం పనిచేశారు. ఎవరూ చూడని సమయాల్లో ఏ చెట్టు పైనో కూర్చుని‌ పాడుకునే వారట. తరువాత రేడియో గాయకుడై ఆపై‌‌ చలనచిత్ర గాయకుడై ఆపై గజల్ గాయకుడై చరిత్ర సృష్టించారు. మెహ్‌దీహసన్‌ ఖాన్ గజల్‌ షెహన్ షాహ్ ఆయి కాలంలో నిలిచి ఉంటారు.
ప్రముఖ హిందీ చలన చిత్ర గాయకుడు మన్నాడే ఒకసారి పీ.బీ.శ్రీనివాస్‌తో … “మనం మనల్నీ, వేఱే వాళ్లనూ గాయకులనుకుంటున్నాం; కానీ గాయకుడంటే ఆ మెహ్‌దీహసన్‌ అతడి గానాన్ని వినడిండి” అని‌ అన్నారట. అదీ
మెహ్‌దీహసన్‌ గొప్పతనం.‌ మన్నాడే వంటి‌‌‌ ఉత్తమ‌ గాయకుడే “గాయకుడంటే మెహ్‌దీహసన్‌” అనడం‌ మనకు మెహ్‌దీహసన్‌ ఎంతటి, ఎలాంటి గాయకుడో తెలియజేస్తోంది. ఒక సందర్భంలో లతక మంగేష్కర్ “మీ గొంతులో దేవుడు‌ పలుకుతున్నాడు” అని‌ మెహ్‌దీహసన్‌తో అన్నారు.
ఒకసారి పీ.బీ. శ్రీనివాస్ మన వైణిక విద్వాంసులు ఈమని‌ శంకర‌శాస్త్రికి మెహ్‌దీహసన్‌ గజళ్ల రికార్డ్ వినిపించారు. శంకరశాస్త్రి ఆ‌ గజళ్లు విన్నప్పుడు ఏమీ మాట్లాడలేదట. కొన్ని రోజుల తరువాత శంకరశాస్త్రి “ఇవాళ నా మనసేం బాలేదు, ఆ రోజు నాకు వినిపించిన ఆ పాకిస్తానీ గాయకుడి పాటలు పెట్టు” అని అన్నారట. అదీ మెహ్‌దీహసన్‌ గొప్పతనం.‌ ఈమని శంకర‌శాస్త్రి అంతటి సంగీత వేత్తకు మానసిక‌ ఆనందం కోసం మెహ్‌దీహసన్‌ గానం కావాల్సి‌ వచ్చింది!
మెహ్‌దీహసన్‌ గానం ఆనందరసం! ఎందఱో అద్భుతమైన‌ గాయకులున్నారు కానీ ఆనంద‌రసం అద్భుతం కన్నా మిన్న. మెహ్‌దీహసన్‌ ఇతర గాయకుల కన్నా మిన్న.

Balance, musical gap, relief-note, note-perfection ఈ నాలుగు ప్రత్యేకమైన, విశేషమైన అంశాలు మెహ్‌దీహసన్‌ గానంలో ఉంటాయి. మెహ్‌దీహసన్‌ నాదం స్వరంలో ఒదిగే విధానం అనితరసాధ్యం. మఱెవరికీ అంతగా అందని విద్య అది. శ్రుతికి అభివ్యక్తి మెహ్‌దీహసన్‌ నాదం. “ఆయన నాదం పెట్టుకుని తంబూరాను శ్రుతి‌ చేసుకోవచ్చు” అంటారు. మెహ్‌దీహసన్‌ది a rounded even warm bari tone with verve. A great timbre and a clear tone quality with resonance.

ఖయాల్, ఠుమ్రీ గాన విధానాలను ఉర్దూ‌ గౙల్ గానానికి ప్రాతిపదికగా చేసుకున్న తొలిదశ‌ గాయకుడు మెహ్‌దీహసన్‌. Mood and emotion‌‌ and superfine intonation and word-throw వీటితో గజల్ గానం‌ చేశారు మెహ్‌దీహసన్‌.

ప్రముఖ వైఅలిన్ (violin) విద్వాంసుడు లాల్‌గుడి జయరామన్ ఒక సారి ఇలా అన్నారు: “ఒక‌ సంగీత కళాకారుడిగా నేను నా మనసును ఎందఱికో‌ ఇచ్చాను కానీ మెహ్‌దీహసన్‌ దగ్గఱ నా మనసును పాఱేసుకున్నాను”. మన శాస్త్రీయ సంగీత‌ గాయకులు ఎందఱినో ఎఱిగిన సాంప్రదాయిక కర్ణాటక సంగీత విద్వాంసుడైన లాల్‌గుడి జయరామన్ మెహ్‌దీహసన్‌ను ఈ విధంగా ప్రశంసించడం సాధారణమైన విషయం‌‌ కాదు. ఇలా ఎందఱో సంగీత వేత్తల‌ హృదయాల్ని‌ చూరగొన్న మహా గాయకుడు మెహ్‌దీహసన్‌.

మెహ్‌దీహసన్‌ తన మీద‌ తలత్ మహ్ మూద్ ప్రభావం ఉందని బహిరంగంగానే చెప్పుకున్నారు.‌ తొలి రోజుల్లో ఒక కచేరిలో తలత్ మహ్‌మూద్ గాన ధోరణిని అనుకరించి పాడితే శ్రోతలు 14,000 రూపాయల నగదు తనపై విరిజిమ్మారని మెహ్‌దీహసన్‌ స్వయంగా చెప్పారు. సామాన్యంగా మొదలైన మెహ్‌దీహసన్‌ గానం అసమాన్యమై, అద్వితీయమై కొనసాగింది. గజల్‌ గానం‌ అన్నది ఆయన వల్ల వన్నె తెచ్చుకుంది. ఎంతో వాసికెక్కింది. ఎప్పటికీ అనన్యమై నెలకొని ఉంటుంది.

మన‌దేశంలో‌ ఎందఱికో మెహ్‌దీ‌హసన్ అభిమాన గాయకుడు.‌ దర్శకులు బాపు మెహ్‌దీహసన్‌ అభిమాని. బాపు తమ తూర్పువెళ్లే రైలు సినిమాలో “రఫ్ తా రఫ్‌ తా…” అన్న ఓ మెహ్‌దీహసన్‌ గజల్ వంటి పాట కావాలని “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా…” పాటను చేయించుకున్నారు. ముత్యాలముగ్గు‌ సినిమాలో “ఏదో‌ ఏదో‌ అన్నది‌‌ ఈ మసక‌ మసక‌ వెలుతురు” పాట కూడా మెహ్‌దీహసన్ గజల్ వంటిదే. ‌ఇళైయరాజా‌ కడవుళ్అమైత్తమేడై అన్న తమిళ సినిమాలో‌ “తెన్ఱలే నీ‌ పేసు…” అనే పాటను‌ “నగవావో నావకె …” అని మొదలయ్యే ఓ మెహ్‌దీహసన్‌ గజల్ స్ఫూర్తితో చేశారు.

పాకిస్తాన్‌లో‌ మెహ్‌దీహసన్‌ ఒక‌ ప్రముఖ సినిమా గాయకుడు కూడా.‌ “నవాజిష్ కరమ్ షుకిరియా…” అంటూ ఎ. హమీద్ సంగీతంలో‌ , బృందావన సారంగి రాగంలో మే ఓ‌ నహీఁ ‌‌అన్న పాకిస్తానీ సినిమాలో మెహ్‌దీహసన్‌ పాడిన పాట మన దేశంలోనూ చాల జనాదరణ పొందింది. నటుడు కమల్ హాసన్ ఈ పాటను పదేపదే పాడుకుంటూంటారు.‌ కవిరత్న కాళిదాస(1983) అనే కన్నడ సినిమాలో సంగీత దర్శకుడు ఎమ్. రంగారావు ఈ పాట పల్లవిని యథాథంగా తీసుకుని ఓ మంచి పాట చేశారు.

“సదా కణ్ణలి ప్రణయద కవితె హాడువే…” అంటూ రాజ్ కుమార్, వాణిజయరామ్ చక్కగా పాడారు. విచిత్రమైన‌ విషయం‌ ఏమిటంటే…పెండ్యాల సంగీతం‌ చేసిన “నీలి మేఘాలలో గాలి కెరటాలలో…” పాట ప్రభావంతో 1966లో హిందీ మేరాసాయా సినిమాలో మదన్మోహన్ ఒక పాట చేశారు. లతా మంగేష్కర్ పాడిన “నేనో మె బద్ రా…” పాట అది. అదే బాణిని 1972లో పర్‌దేశీ అన్న పాకిస్తానీ సినిమాలో “పాయల్ ఝనన్ ఝన్ కే నగ్మా బన్ కే…” అంటూ మెహ్‌దీహసన్‌ పాడారు!‌

“కైసీ చుపాఉన్ రాజె గం…” , “రంజి షి స హే…”, “దేఖ్ తో దిల్…” , “పత్తా పత్తా బూటా బూటా…”, ” ఆయే కుచ్ అబ్ర్ కుచ్ షరాబ్ ఆయే…”, “క్యా‌ బలా ముఝ్ కో…”, ‌” షో‌లాతా జల్ భుజా…”,‌ “గులో మే రంగ్ భరే…”, ” గుల్షన్ గుల్షన్ షోలా-ఎ-గుల్ కి…”, “ఓకె హర్ ఎహ్దె ముహబత్ ముకర్తా జాయే…”, ” జిందగీ మేతొ సభీ ప్యార్ కియా…”, “క్యా టూటాహే అందర్ అందద్…”, ” పరీ షా‌ హోకె మేరీ…”, “యూనమిల్ ముఝే కఫా హో జేసే…” వంటి ఎన్నో, ఎన్నో గొప్ప గొప్ప‌ గజళ్ల గానం చేశారు. ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ లు పాడారు. పంజాబీ, రాజస్థానీ‌ జానపద సంగీతం పాడారు. పంజాబీ సూఫీ హీర్‌లను పాడారు. ఆయన ఉర్దూ ఉచ్చారణ చాల బావుంటుంది. ఉర్దూ‌కే అందం ఆ ఉచ్చారణ.

పాశ్చాత్య సంగీతంలో “eloborate aesthetic embellishment” అని ‌సంగీతంలోని‌‌ ఉచ్చస్థితిని అంటారు. అది‌ ప్రాచ్య‌ సంగీతంలో‌ మెహ్‌దీహసన్‌ దగ్గఱ నిండుగానూ, మెండుగానూ ఉంటుంది.

13-6-2012 లో‌ తన శారీరాన్ని‌ లోకానికి ఇచ్చేసి శరీరంగా వెళ్లిపోయారు‌ మెహ్‌దీహసన్‌.
హసన్‌ గానానికి ప్రాణం. ప్రాణం ఉన్న గానం.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE