Suryaa.co.in

Editorial

పవన్ సత్తాకు ‘పొల్యూషన్’ పరీక్ష

– పీసీబీపై దృష్టి సారించని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
– అధికారులపైనే ఆధారపడుతున్నారా?
– ఐదు గ్రామాలను క్యాన్సర్‌తో చంపేస్తున్న ఒంగోలు భగీరధ కెమికల్స్
– నీళ్లు, గాలి కాలుష్యంతో రోగాలబారిన జనం
– భారీ పేలుడుతో ప్రాణాలు పోయినా పట్టించుకోని పీసీబీ
– పైగా అంతా బాగానే ఉందంటూ సర్టిఫికెట్
– ఒంగోలు కార్పొరేషన్ తరలించాలని తీర్మానించినా కదలని ‘భగీరధ’
– పీసీబీ, సీఎంఓ పెద్ద తలల దన్నంటూ ప్రచారం
– పవన్ ఆ గ్రామాల ప్రాణాలు కాపాడతారా?
– కంపెనీకి బీజేపీ, టీడీపీ అగ్రనేతల దన్ను?
– పెద్దతలలను ఎదిరించే సత్తా ఉందా?
– అందరిచూపూ పవన్ వైపే

( మార్తి సుబ్రహ్మణ్యం)

పవన్ కల్యాణ్. ఇప్పుడు క్యాబినెట్‌లో పవర్‌ఫుల్ డిప్యూటీ ముఖ్యమంత్రి. బియ్యం అక్రమ రవాణా సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అన్న దమ్మున్న నాయకుడు. నేను హోంమంత్రిగా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యానించిన నేత. ఇప్పుడు అలాంటి పవన్ పవర్‌కు కాలుష్యం పంచుతున్న ఓ బడా కెమికల్ కంపెనీ తరలింపు వ్యవహారం ఓ సవాల్‌గా మారింది. ఎందుకంటే అది అల్లాటప్పా కంపెనీ కాదు. బీజేపీ-టీడీపీ అగ్రనేతల ఆశీస్సులు దండిగా ఉన్న కంపెనీట. స్వయంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ దానిని తరలించాలని తీర్మానం చేసినా అంగుళం కూడా కదలలేదంటే.. మరి పవన్ పవర్ కూడా పనిచేస్తుందా? లేదా అన్న సందేహం రావడం సహజం. అందుకే ఇప్పుడు అందరి చూపూ పవన్ వైపే!

రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు. కానీ ఆ మొండివాడికంటే బలవంతుడు ఆ కంపెనీ యజమానులు. ఐదారు గ్రామాలను కాలుష్య కాసారం చేస్తున్న సదరు కంపెనీపై.. ఇప్పటిదాకా ఏ ఒక్కరూ ు కన్నేయడం లేదంటే ఎవరు బలవంతుడు? కొన్నేళ్ల క్రితం అదే ఫ్యాక్టరీ కార్మికులను మింగేసినా దానిపై చర్యల కొరడా ఝళిపించే దమ్మెవరికీ లేదంటే ఎవరు బలవంతుడు? రాజా? మొండివాడా? ఆ కంపెనీ యజమానా?

స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినా, తర్వాత అది కూడా తూచ్ అయిపోయింది. అటు కార్మికలోకం రోడ్డెక్కినా వారిది ‘భగీరధ’ ప్రయత్నమే అవుతోంది తప్ప, ఫలితం శూన్యం. బీజేపీలోని ఓ పెద్దతలతోపాటు, సీఎంఓ, పీసీబీలోని మరికొన్ని పెద్దతలల ఆశీస్సులుండటమే ఈ బేఖాతరిజానికి అసలు కారణమన్నది వినిపిస్తున్న ఆరోపణ.

విశాఖలో ఇలాంటిఅక్రమార్కులపై చర్యల కొరడా నిర్మొహమాటంగా-నిజాయితీగా ఝళిపిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు.. ఒంగోలులోని అదే అక్రమార్కులపై కొరడా ఝళిపించేందుకు మాత్రం నిలువెల్లా వణికిపోతున్నారు. మోహమాటంతో చర్యల కొరడాను జమ్మిచెట్టిక్కించేశారు. మరి ఇప్పుడు ఆ శాఖను చూస్తున్న పర్యావరణశాఖ, ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ ఆ భగీరధుడవుతారా?

సచివుడిగా తన సత్తా చూపించి పల్లెసీమలను కాలుష్య కాసారంగా మారుస్తున్న ఆ కంపెనీపై చర్యల కొరడా ఝళిపిస్తారా? తన శాఖలో ఏళ్ల నుంచి పాతుకుపోయి.. మళ్లీ మరో రూపంలో బోర్డులో తిష్టవేసేందుకు ప్రయత్నిస్తున్న అక్రమార్కుల కథకు పవన్ తెరదించుతారా? సదరు కంపెనీ వెనక ఉన్న ఉన్న అదృశ్య శక్తుల చేతులు విరిచి, పల్లెసీమలను కాలుష్యం కోరల నుంచి కాపాడతారా? అన్నదే ఇప్పుడు కార్మికులతోపాటు.. ఐదారు గ్రామాల ప్రజలు ఆశతో పవన్‌కల్యాణ్ వైపు ఎదురుచూస్తున్న అంశం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పవన్ సత్తా చాటతారా? లేదా?

అది భగీరధ కెమికల్స్. ఒకప్పుడు ఒంగోలుకు ఆనుకుని ఉన్న పంచాయితీ పరిథిలోని ఫర్టిలైజర్ కెమికల్ కంపెనీ. 1995లో ఏడాదికి 300 టన్నుల క్లోరిఫైరిఫాస్ ఉత్పత్తి లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. దీనికి అనుబంధ ఫార్ములేషన్స్ తయారుకోసం అనుమతి తీసుకుని, ఏడాదికి 1000 టన్నులకు పెంచారు. కంపెనీలో క్లోరిఫైరిఫాస్ తదితర రసాయనాలు 11కు పైగా తయారుచేస్తారు. ఇది 2011 ఆగస్టులో ఇదే కంపెనీలో జరిగిన భారీ ప్రమాదం నాటి ముచ్చట.

అయితే 2012 తర్వాత ఈ కంపెనీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలోకి వచ్చింది. అంటే నగరంలోకి వచ్చిందన్నమాట. అప్పటికే వెంకముక్కపాలెం, యరజర్ల, చెరువుకొమ్ముపాలెం గ్రామాలలోకి కంపెనీ వ్యర్ధాలు విడుదల చేస్తుండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, చివరికి గ్రౌండ్‌వాటర్ కూడా కాలుష్యం అయిపోయిందంటూ గ్రామస్తులు ఆందోళన చేసినా పట్టించుకున్న దిక్కులేదు. కాలుష్యంతో నిండిన జలాలతో గ్రామస్తులు ఇప్పటికి కొన్ని వందలసార్లు ధర్నాలు చేసినా పట్టించుకునే దిక్కులేదంటే, సదరు కంపెనీ వెనుక ఎన్ని శక్తులున్నాయో అర్ధమవుతుంది.

కాగా 2011 ఆగస్టులో జరిగిన భారీ పేలుడులో కార్మికుల చనిపోయిన నేపథ్యంలో.. ఆ కంపెనీని సీజ్ చేస్తున్నట్లు నాటి కలెక్టర్ కాంతలాల్ దండే ఆదేశించారు.దానిపై త్రిసభ్య కమిటీ వేశారు. ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులను కమిటీ పిలిపించింది.

అయితే.. తర్వాత కలెక్టర్‌గా వచ్చిన దినేష్‌కుమార్.. కంపెనీ నుంచి వాటర్ పొల్యూషన్ లేదంటూ చెప్పడంతో, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల ప్రజలతో కలసి కార్మిక సంఘాలు.. కాలుష్యమయిన నీటిని సీసాలో చూపుతూ ధర్నాలు చేశాయి. ఒకవైపు ఒక సామాజిక కార్యకర్త పెట్టిన ఆర్టీఐకు.. కంపెనీ నిబంధనలు పాటించడం లేదని జవాబు ఇస్తే, మరోవైపు కలెక్టర్ దినేష్ కంపెనీకి ఎలా క్లీన్‌చిట్ ఇస్తారని గ్రామ ప్రజలు విరుచుకుపడటం గమనార్హం.

అయితే పరిశ్రమలో నిరంతరం తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసి, నివేదికలు సమర్పించాల్సిన జిల్లా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, కార్మిక శాఖ అధికారులతోపాటు.. విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్‌బోర్డులోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్, ఎస్‌ఇ.ఇ. టాస్క్‌ఫోర్స్, నెల్లూరులోని పీసీబీ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.గంగాధర్, ఒంగోలు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకూ ఫలితం శూన్యం.

పీసీబీతో కంపెనీ కుమ్మక్కు: చిరంజీవి

కాగా పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన రసాయనాలు వాడుతున్నప్పుడు.. యంత్రాల పనితన సామర్థ్యం పట్టించుకోకుండా కార్మికుల ప్రాణాలు తీస్తున్న యాజమాన్యంపై పీసీబీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదంటే, బోర్డులోని ఉన్నతాధికారులతో యాజమాన్యం కుమ్మక్కయినట్లు స్పష్టమవుతోందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంకా చిరంజీవి ఆరోపించారు. ప్రధానంగా భగీరధ కెమికల్ పరిశ్రమతో నాలుగైదు గ్రామాల ప్రజలకు క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని తాను సీఎం, మానవహక్కుల కమిషన్, పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యానికి అధికారపార్టీతో సత్సంబంధాలున్నాయంటున్నారు. మాకు సీఎంఓ, పీసీబీ విజయవాడ ఆఫీసులో మేలు చేసే అధికారులున్నారని చెబుతున్నారు. అందుకే మీడియాలో వచ్చే వార్తలు వాళ్లు పట్టించుకోరని లెక్కలేనితనంగా చెబుతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణం కఠినచర్యలు తీసుకుని, నిబంథనలు పాటించని ఇలాంటి కంపెనీలకు ఒక హెచ్చరిక సందేశం పంపించాలి. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఇలాంటి కంపెనీలకు మద్దతునిస్తున్న అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి’ అని చిరంజీవి డిమాండ్ చేశారు.

కంపెనీకి పీసీబీ క్లీన్‌చిట్

కాగా కంపెనీలో పేలుడు జరిగి కార్మికుల మృతి చెందిన సందర్భంలో, నాటి జేసీ లక్ష్మీనృసింహం సంఘటనా స్థలానికి వచ్చారు. అయితే ఆయనతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అధికారులు ముడుపులు మింగి, యాజమాన్యాన్ని రక్షిస్తున్నారని విరుచుకుపడ్డారు. అందుకు లక్ష్మీనరసింహం వారికి చెప్పిన సమాధానం గ్రామస్థులను దిగ్భ్రమ పరిచింది.‘‘మీతోపాటు మరికొన్ని సంస్థలు ఇచ్చిన ఫిర్యాదులపై పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులతో మూడుసార్లు తనిఖీ చేయించాం. అందులో ఎలాంటి ఇబ్బందులు లేవని నివేదిక ఇచ్చారు’’అని వివరించారు. దానితో విరుచుకుపడ్డ గ్రామస్ధులు అంతా బాగుందనుకుంటే ఈరోజు ఈ పేలుడు జరిగి కార్మికులు ఎందుకు చనిపోతారని ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే విచిత్రంగా అదే భగీరధ కంపెనీపై.. గంగాధరం అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తుకు పీసీబీ నెల్లూరు అధికారులు చిత్రమైన, భిన్నమైన సమాధానం ఇచ్చారు.

‘‘ఎఫ్యుయెంట్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ పనిచేయడం లేదు. అది అసలు వినియోగం లోనే లేదు. ఫోర్లు కడిగే సమయంలో వచ్చే ఘన పదార్ధాలు, యంత్రాలను కడిగే సమయంలో వెలువడే వ్యర్ధాలు తక్కువ స్థాయిలో, ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్ధాలు అధికంగా ఉన్నాయి. ఫ్యాక్టరీ ప్రాంగణంలో సుమారు 1250 టన్నుల హానికర ఘన వ్యర్ధాలను నిల్వ చేశారు. వ్యర్ధాల విడుదలను పరిశీలించిన తర్వాత వివరణ కోరుతూ కంపెనీకి 31ఏ-08-2009న నోటీసులు జారీ చేశాం. నోటీసుల తర్వాత యాజమాన్యం వాటిని సవరించింది. 387.51 టన్నుల ఘన హానికర ఘన వ్యర్ధాలు ఫ్యాక్టరీ ఆవరణలో రక్షణ లేకుండా ఉన్నాయి. ఆ వ్యర్థాలను చాలాకాలంగా బయటకు పంపించడం లేదు. వాటిని డ్రమ్ముల్లో నిల్వచేసి ఎలాంటి రక్షణ లేకుండా ఉంచారు’’ అని నివేదికలో పేర్కొన్నారు. దీనిపై 11.01.2010న వెంటనే వ్యర్ధాలు తొలగించి నివేదిక ఇవ్వాలని, వాటిని తొలగించనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కమిషనర్‌కు భగీరధ ఉత్తుత్తి సమాధానం

చెరువుకొమ్ముపాలెం, వెంగముక్కలపాలెం, యరజర్ల, పేళ్లూరు గ్రామస్థులు నాటి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా మున్సిపల్ కమిషనర్‌కు భగీరధపై ఫిర్యాదు చేశారు. కంపెనీని తక్షణం మరోచోటికి త రలించాలని కోరారు. దానిపై నోటీసులు జారీ చేసిన ఒంగోలు మున్సిపల్ కమిషనర్‌కు,
భగీరథ యాజమాన్యం తిరుగు సమాధానం ఇచ్చింది. 1996లో ప్రారంభించిన తమ కంపెనీకి పీసీబీ, వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అనుమతులు, రెన్యువల్స్ ఉన్నాయని సమాధానం ఇచ్చారు. అయితే వాటి కి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కమిషనర్‌కు అందివ్వకపోవడమే విచిత్రం. ‘‘మా ఫ్యాక్టరీ ఆవరణలో విక్రయ కేంద్రాలు లేవు. మా కంపెనీ అపాయకరమైన వ్యాపారవృత్తుల పరిథిలోకి రాదు. మా కంపెనీ నుంచి గాలి, నీటి కాలుష్యానికి గురికాలేదు’’ అని తమ వివరణలో భగీరథ యాజమాన్యం పేర్కొంది. అయితే వాటిని ధృవీకరించే సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వకపోవడమే ఆశ్చర్యం.
భగీరథ కెమికల్స్ తనను తాను సమర్ధించుకుంటూ ఎన్ని వివరణలిచ్చినా, కార్పొరేషన్ కమిషనర్ పట్టించుకోలేదు. దానితో 03-10-2023న మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్.. ఏకంగా భగీరథ కెమికల్స్ కంపెనీని తరలించాలంటూ ఒక తీర్మానం ఆమోదించి, ప్రభుత్వానికి పంపించింది. అయితే తర్వాత ఎన్నికలు రావడంతో కార్పొరేషన్ ప్రతిపాదన కొండెక్కింది. ఇప్పటివరకూ దానిపై ప్రభుత్వం చర్య తీసుకుని, భగీరధను తరలించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భగీరధ ఉల్లం‘ఘనురాలే’.. తరలించండి!

భగీరధ కెమికల్స్ సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందున దానిని ఒంగోలు పట్టణం నుంచి తరలించాలని.. ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపించింది.

ఆ తీర్మానంలో ఏముందంటే.. ‘‘మీ పరిశ్రమ ఒంగోలు నగరపాలక సంస్థ పరిథిలో వస్తుంది. మీ ఫ్యాక్టరీలో తయారుచేసే రసాయన ఎరువుల ఉత్పత్తి, అమ్మకమునకు సంబంధించిన లైసెన్స్- సెక్షన్ 516, 622 కింద మీరు ప్రతి ఏడాది రసాయన ఎరువుల ఉత్పత్తికి డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పొందలేదు. సదరు అర్జీదారులు సంబంధిత బాధిత గ్రామాల్లో క్యాన్సర్ కేసులు, మూత్రపిండాల వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. అయినా కూడా సదరు కంపెనీ వారు చేయు కాలుష్యం చుట్టుపక్కల గ్రామాలలో నివాసయోగ్యం లేనంత ఇబ్బందికరంగా మారింది. రాత్రి,పగలు తేడా లేకుండా దుర్వాసన వ్యాపించి చుట్టుపక్కల గ్రామాలు, ఒంగోలు పట్టణ శివార్లలో కూడా వ్యాపిస్తోంది. పర్యావరణ చట్టం ప్రకారం కార్పొరేషన్ పరిథి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన కంపెనీ, కేవలం 2 కిలోమీటర్ల లోపు ఉండటం చట్ట ఉల్లంఘన అవుతుందని తెలియచేశారు.

కావున ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో గల భగీరధ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను, చెరువుకొమ్ముపాలెం నుంచి అన్ని నిబంధనలకు లోబడి తరలించాల్సిందిగా అర్జీని సమర్పించారు. కావున సదరు కంపెనీని ప్రజారోగ్యం దృష్ట్యా తరలించేందుకు చర్యలు చేపట్టేలా సిఫార్సు చేయుటకు గాను వ్రాసిన కౌన్సిల్ చర్చనీయాంశమును, కమిషనర్ వారి అనుమతితో ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ వారి ఆమోదమునకై ఉంచడమైనది.
తీర్మానం: భగీరధ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ప్రజారోగ్యం దృష్ట్యా తరలించడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయుటకు తీర్మానించటమైనది- గంగాడ సుజతా. మేయర్, ఒంగోలు’’

కంపెనీకి టీడీపీ-బీజేపీ అగ్రనేతల అభయం?

కాగా నాలుగైదు గ్రామాలను కబళిస్తున్న భగీరధ కెమికల్స్‌పై చర్యలు తీసుకుని, దానిని ఒంగోలుకు దూరంగా తరలించాలన్న నివేదిక బుట్టదాఖలు కావడానికి.. రాజకీయ ఒత్తిళ్లే కారణమని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రస్థాయిలోని ఒక బీజేపీ కీలకనేత, కార్మికశాఖలోని కీలక వ్యక్తి, టీడీపీ అగ్రనేతల అభయం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా వీరికి పీసీబీలో ఒక కీలక ఇంజనీర్, మరికొందరు దన్నుగా ఉన్నందుకే భగీరథ ఎవరినీ లెక్కచేసే పరిస్థితి లేదంటున్నారు. ‘‘తమకు సీఎంఓ, పీసీబీ పెద్దల సహకారం ఉంది కాబట్టి మీడియాలో ఏం వచ్చినా భయపడాల్సిన పనిలేదని కంపెనీ ప్రతినిధులు ధీమాతో చెబుతున్నార’’ని కార్మిక సంఘ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

భగీరథ

 

LEAVE A RESPONSE