నెల్లూరు జిల్లా ఉదయగిరి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులకు రక్షణ కరువైంది.. అందుకు నిదర్శనం ప్రత్యక్ష సాక్షిగా వేటాడి వధ చేయబడిన ఈ చుక్కల దుప్పి.
అటవీ అధికారులు తమ సొంత ప్రయోజనాల కోసం ఆట విడుపుగా విధులు నిర్వహించడంతో అటు అటవీ సంపద, ఇటు వన్యప్రాణులు బలవుతున్నాయి. ఇందుకు అటవీ అధికారులే కారణం అంటున్నారు స్థానిక ప్రజలు. వివరాల్లోకి వెళితే తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి రేంజ్ పరిధిలోని సీతారాంపురం మండలం సిద్దేశ్వరం అడవుల్లో ఒక చుక్కల దుప్పిని చంపి వధ చేస్తుండగా, సంబంధిత అటవీ శాఖ అధికారులు కొంతమందిని పట్టుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా రెండు రోజులు గోప్యంగా ఉంచి రాజకీయ నాయకులతో బేరసారాలతో మంతనాలు నడిపినట్లు , పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ తతంగం బెడిసికొట్టి అవి కుదరకపోవడంతో సోమవారం అసలు విషయం వెలుగు చూసింది.
అటవీ అధికారుల తీరు చూస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. వీళ్ళేనా అటవీ సంపదను, వన్య ప్రాణులను కాపాడేదంటూ ప్రజలు గళం విప్పుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అటవీ సంరక్షణ, వన్యప్రాణులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.