Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

– యువతకు జాతీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్స్ కల్పించడమే లక్ష్యం
– 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పనిచేయాలి
– ఆధునిక సాంకేతికతకు తగ్గట్టు కొత్త కోర్సులు
– ‘నైపుణ్యం’ పోర్టల్‌లో సమగ్ర సమాచార అనుసంధానం
– నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ఆదేశం

అమరావతి, జూన్ 24:- యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు.

మంగళవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్‌లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే యువతను కూడా నైపుణ్యం పోర్టల్ లో నమోదు చేయించటం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలన్నారు.

యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా వారి రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్‌ను డిజైన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఐటీ కోర్సులు చేసిన విద్యార్ధుల నైపుణ్యాలను కూడా అంచనా వేయాలన్నారు.

తద్వారా ఆయా సంస్థల అవసరాలు గుర్తించి నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని తక్షణం అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. నైపుణ్యాలను గుర్తించి ముందుగానే వారిని సిద్ధం చేయటం వల్ల ఉద్యోగావకాశాలు సులభంగా లభించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

నైపుణ్యం పోర్టల్ ద్వారా సమగ్ర సమాచారం

స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. 6వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ నైపుణ్యాభివృద్ధి కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకుని యుతకు నైపుణ్యాన్ని పెంచాలని అన్నారు. విద్యా సంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి నైపుణ్య శిక్షణ, ధృవీకరణ అంశాలపై కార్యాచరణ చేపట్టాలని అన్నారు.

అయితే నేషనల్ స్కిల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణా ప్రమాణాలను నిర్ధారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధార్, అపార్‌ ఐడీలతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనుసంధానం చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్ మేళాలు నిర్వహించగా ఇప్పటివరకూ 61,991 మందికి ఉద్యోగాలు లభించినట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు.

అలాగే రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్‌మెంట్లు వచ్చాయని తెలిపారు. మరోవైపు నైపుణ్యం పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు, శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్లతో పాటు పరిశ్రమలతో అనుసంధానం, విదేశీ భాషల్లో శిక్షణ వరకూ వివరాలు పొందుపరుస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ ఏడాదిలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,500 ఉద్యోగాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.

అన్ని పరిశ్రమలూ అప్రెంటీస్ షిప్ విధానాన్ని అమలు చేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. తరగతి గదుల్లో కాకుండా క్షేత్రస్థాయిలో నైపుణ్యం ఆర్జించేలా ఈ విధానం ఉపకరిస్తుందని అన్నారు. సాంకేతిక పరమైన నైపుణ్యాలతో పాటు, సాఫ్ట్ స్కిల్స్ కూడా యువతకు అవసరమని సీఎం పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ గురించి గ్రామీణ యువతకు తెలిసేలా కోర్సుల గురించి విస్తృత ప్రచారం చేయాలని అన్నారు.

క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ

రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్టు మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఐదు క్లస్టర్లలో నైపుణ్యాలు కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. కృష్ణా- గుంటూరు క్లస్టర్‌లో వ్యవసాయం, టెక్స్ టైల్ , ఫుడ్ ప్రాసెసింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అనంతపురం- కర్నూలు, కడప క్లస్టర్ లో గ్రీన్ ఎనర్జీ, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో శిక్షణకు అవకాశాలు ఉన్నట్టు స్పష్టం చేశారు.

శ్రీకాకుళం-విశాఖ క్లస్టర్ లో మెడ్ టెక్ , ఫార్మా, ఇంజినీరింగ్ రంగాల్లోనూ, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం క్లస్టర్‌లో పోర్టులు, గ్రానైట్, ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ తదితర పరిశ్రమలు ఉన్నట్టు తెలిపారు. తూర్పు- పశ్చిమ గోదావరి క్లస్టర్‌లో ఆక్వా, పెట్రోలియం పరిశ్రమలకు సంబంధించి శిక్షణా అవకాశాలు ఉన్నట్టు వివరించారు. టోనీ బ్లెయిర్ ఫౌండేషన్ తో కూడా నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనలో ఏపీ పనిచేస్తోందని మంత్రి లోకేష్ వివరించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌లో విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం కుదిరిందన్నారు.

గ్లోబల్ ప్లేస్మెంట్స్‌పై దృష్టి సారించాలి

నైపుణ్యాభివృద్ధి కల్పనను ప్రాధాన్యతగా తీసుకుని ఏపీ యువతకు గ్లోబల్ ప్లేస్ మెంట్ దక్కేలా లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జర్మనీ, యూరప్, ఇటలీ, సింగపూర్ సహా వేర్వేరు దేశాల్లో వైద్యారోగ్యం, నిర్మాణం, పర్యాటకం, ఐటీ , లాజిస్టిక్స్ , ఉత్పత్తి రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను పెంచాల్సిందిగా సీఎం సూచించారు. ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగ్వేజెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

LEAVE A RESPONSE