– కేసు కొట్టివేసిన అలహాబాద్ కోర్టు
– పరువునష్టం కేసులో స్మృతి ఇరానీకి ఊరట
లఖ్‌నవూ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్2022, అక్టోబర్ 21న వేసిన పరువు నష్టం దావా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ వర్తికాసింగ్ అలహాబాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాగా తాజాగా అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది.
వర్తిక పిటిషన్ ను అలహాబాదు హైకోర్టు తిరస్కరించింది. స్మృతి ఇరానీ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్న క్రమంలో పిటిషనర్‌కు కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం ఆమె పరువుకు నష్టం కలిగించినట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది. తనను రాష్ట్ర మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా చేయాలంటే రూ.25లక్షలు ఇవ్వాలని స్మృతి ఇరానీ వ్యక్తిగత కార్యదర్శి డిమాండ్ చేశారని, వర్తిక పోలీసులకు ఆరోపించిన విషయంపై మీడియా కేంద్రమంత్రిని ప్రశ్నించగా, ఆమె నన్ను కాంగ్రెస్ చేతిలో పావుగా అభివర్ణించారని, తనకు గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఈమేరకు వర్తిక ఇరానీపై పరువు నష్టం దావా వేశారు.
జర్నలిస్టులతో కేంద్రమంత్రి సంభాషణను ఉటంకిస్తూ, ఆమె ఇతర విషయాల గురించి కూడా మాట్లాడారని, అందులో ఆమె పిటిషనర్ పేరును కూడా ఉపయోగించలేదని కోర్టు పేర్కొంది. పిటిషనర్‌పై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా గుర్తించామని కేంద్రమంత్రి తరపు న్యాయవాది బెంచ్‌కు తెలిపారు. స్మృతి ఇరానీ మాట్లాడిన విషయాలను పరిశీలిస్తే ఆమె రాజకీయ పార్టీని విమర్శిస్తున్నట్టుగా ఉన్నాయని, పిటిషనర్ పరువుకు భంగం కలిగించే ఉద్దేశం కనిపించట్లేదని న్యాయస్థానం పేర్కొంది.