మూడు రాజధానులపై ఇంత మూర్కత్వమా?

– న్యాయ వ్యవస్థను లెక్క చేయని జగన్ రెడ్డి
-శాసన సభలో అహంకారంతో మాట్లాడడం తగదు
– అమిత్‌షా, జగన్‌ లు ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే ఉన్నారు
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

అమరావతి : శాసనసభ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల పై మూర్కంగా మాట్లాడడం తగదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. న్యాయ వ్యవస్థ కు కూడా గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రిని చూస్తున్నామని ఆరోపించారు. రాజధాని పై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడటం సీఎం జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

చట్టంలో రాజధాని ఒకటే ఉందని హైకోర్టు చెప్పాక మళ్లీ పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులపై మాట్లాడటం ఏంటి? గతంలో ఏం లాభం వచ్చిందని అమరావతిని రాజధానిగా అంగీకరించారో, ఇప్పుడు ఎందుకు వ్యతిరేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అమలు చేయలేని తీర్పులను హైకోర్టు చెబితే అప్పుడు సాధ్యం కాదని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి లేకపోయినా జగన్ అన్యాయంగా మాట్లాడారని, న్యాయవ్యవస్థను తప్పు పడుతూ మాట్లాడటం దేశానికి మంచిది కాదని హితవు పలికారు. మూడు రాజధానులు అనేది అశాస్త్రీయమన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్ గుర్తెరిగితే మంచిదని శైలజనాథ్ పేర్కొన్నారు.
కేంద్రంలో అమిత్‌షా, రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే పాలకులయ్యారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్‌ విమర్శించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తేనే ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే కాపాడగలుగుతుందని శైలజనాథ్‌ పేర్కొన్నారు.

బీజేపీ, ఎంఐఎంలవి మత రాజకీయాలని, దేశంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత రాజకీయాలు చేస్తున్నాయని శైలజనాథ్ అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ రూపంలో విధ్వంసాలు చేస్తుందన్నారు. దేశంలో బీజేపీ ఎలాంటి దారుణాలు చేస్తుందో అందరూ చూస్తున్నారన్నారు. యూపీలో బీజేపీ, ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మత రాజకీయాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీలో ఎప్పుడూ చూడని పన్నులను సీఎం జగన్ రెడ్డి విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. పక్కరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గిస్తే ఇక్కడ సీఎం ఆ ఊసే ఎత్తరని ఆయన విమర్శించారు.

Leave a Reply