ఆలీ లేదు…. చూలు లేదు…. కొడుకు పేరు సోమలింగం అన్న నానుడి చందం గా… ఏపీ రాజకీయాల పై (యాంటీ )సోషల్ మీడియా చానెళ్ళు చెల రేగి పోతున్నాయి.
పోలింగ్ తేదీ (లు ) రాలేదు. పార్టీల మధ్య పొత్తులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అభ్యర్థులు ఖరారు కాలేదు. కానీ, ఆ పార్టీకి అన్ని…..; ఈ పార్టీకి ఇన్ని అంటూ యూ ట్యూబ్ చానెళ్ళు చెలరేగి పోతున్నాయి.
ఒకరు జిల్లాల వారీ గా “లెక్కలు” వినిపిస్తూ ఉంటే, మరొక ఛానల్ వారు ఏకంగా నియోజకవర్గాల వారీగా సర్వే కథలు వినిపిస్తున్నారు. ఒకరు మొన్నే ఈ సర్వే చేశాం అంటే…. ఈ రోజే చేశాం అంటూ మరొకరు ఓ సర్వే కథ ను వండి వార్చుతున్నారు. ఎన్నికల పుణ్యమా అని మొత్తం మీద అందరికీ బాగా కాలక్షేపం అవుతున్నట్టు ఉన్నది.
అభ్యర్థులు కూడా తెరమీదకు రాకుండానే, ఏ పార్టీ ఎలా గెలిచి పోయిందో…., ఏ పార్టీ ఎలా ఓడిపోయిందో, ఏ స్థానం లో హోరా హోరీ పోటీ ఉన్నదో ఎలా చెప్పగలగడం సాధ్యమో తెలియదు.
మళ్ళీ… అందరూ విశ్లేషకులే.
ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉంది. గెలుపు -ఓటముల ట్రెండ్ మూడు, నాలుగు రోజుల్లోనే మారిపోవచ్చు.
గ్యారంటీగా గెలుస్తారు అనుకున్నవారు ఓడిపోవచ్చు. డిపాజిట్ రావడం కష్టం అనుకున్నవారు గెలవ వచ్చు.
పాలకొల్లు లో పోటీ చేసిన సినీ దిగ్గజం చిరంజీవి ఓడిపోతారు…. ఓ అనామక కాంగ్రెస్ మహిళా అభ్యర్థి పై అని ఎవరైనా ముందుగా చెప్పారా? లేదూ…, పవన్ కళ్యాణ్ 2019 లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలు రెండింటిలోనూ ఓడిపోతారని ఎవరైనా ముందుగా చెప్పారా?
ఒక అభ్యర్థి ఓడిపోవడానికి గానీ, గెలవడానికి గానీ సవా లక్ష కారణాలు దోహదం చేస్తాయి.
అందుకే ఇప్పుడు యూట్యూబ్ లో వెల్లువెత్తుతున్న సర్వే కతలన్నీ కాలక్షేప బఠానీలే.
అయితే, వీటి వెనుకాల ఏ ప్రయోజనమూ లేదని కొట్టేయడానికి వీల్లేదు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు కనపడడం లేదు. వాటిల్లో వీడియో లు చూడడం ఒక వ్యసనం గా మారిపోయింది. అందువల్ల, చూసే జనాలను ప్రభావితం చేయడానికి కూడా ఈ సర్వే రాయుళ్లను కొన్ని పార్టీలు రంగం లోకి దింపుతాయి. కొందరు నేతలు కూడా ‘సర్వే’శ్వర్రావుల పై వెదజల్లుతారు. ఇంకేముంది? వీళ్ళు చెలరేగిపోతారు.
ఈ సర్వేలు చాలా మందికి ఉపాధి కల్పనా మార్గాలు. టెక్నాలజీ పురోభివృద్ధి ఫలితం ఈ కొత్త ఆట అని చెప్పవచ్చు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ, యుద్ధ రీతులు కూడా మారి పోతుంటాయి కదా! యూ ట్యూబ్ అనేది ఒక జీవనోపాధి మార్గం అయిపోయింది ఇప్పుడు. “బేవార్సుగా తిరగడం ఎలా…?” అని ఒక వీడియో చేసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే, లక్షల్లో వ్యూసు, వేలల్లో లైక్, వందల్లో కామెంట్ వస్తాయి. ఈ సర్వేలు అవే బాపతు అని గుంటూరు లో రిటైర్డ్ ఆర్ డీ ఓ గుప్త జోక్ వేశారు.
పోలింగ్ ముగిసేదాకా ఏ పార్టీ కి అవకాశం ఉన్నదో తెలిసే అవకాశం లేదని ఆయన అన్నారు.