-
ప్రత్యర్ధులకు సోము ఝలక్
-
సీనియారిటీకి పట్టం కట్టిన కమలం
-
పురందేశ్వరికి తెలియకుండానే సోము ఎంపిక
-
పురందేశ్వరి వైఫల్యమే సోము విజయానికి కారణమంటున్న సీనియర్లు
-
కోర్ కమిటీతో మాట్లాడితే కథ మరోలా ఉండేదంటున్న కమలదళాలు
-
తపనా చౌదరి కోసం ఫలించని అగ్రనేతల ప్రయత్నాలు
-
మాధవ్, రాపా సత్యనారాయణ, విష్ణువర్దన్‌రెడ్డికి నిరాశ
-
అసలు మొన్నటి వరకూ కోటా ఊసులేని బీజేపీ
-
ఆదివారం హస్తినలో మారిన సీన్
-
చక్రం తిప్పిన రవీంద్రరాజు, కేంద్రమంత్రి వర్మ
-
సంతోష్‌జీపై ఫలించిన ఆ ఇద్దరి ఒత్తిడి
-
టీడీపీ, సొంత పార్టీ సీనియర్ల షాక్
-
సోముకు సీటుపై టీడీపీ విస్మయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి పార్టీలో పలుకుబడి పలచనయిందా? ఆమె సిఫార్సులను కేంద్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? అసలు ఎమ్మెల్సీ సీటు ఆమెకు తెలియకుండానే కేంద్ర నాయకత్వం తీసుకుందా? రాష్ట్ర పార్టీకి తెలియకుండానే సోము వీర్రాజుకు బీజేపీ సీటొచ్చిందా? అసలు వీర్రాజు కోసమే బీజేపీ ఎమ్మెల్సీ సీటు అడిగిందా? సీనియర్ అయిన సోముకు సీటివ్వడం ద్వారా.. సంఘ్ అటు టీడీపీ, ఇటు బీజేపీలోని సీనియర్లకు ఏకకాలంలో ఝలక్ ఇచ్చిందా? పూర్వ సంఘటనామంత్రి రవీందర్‌రాజు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ జమిలిగా చక్రం తిప్పి తమ వర్గీయుడైన సోముకు సీటు ఇప్పించారా? అసలు తమకు బద్ధ వ్యతిరేకి, వైసీపీకి రహస్యమిత్రుడిగా భావించే సోముకు సీటు ఇస్తే టీడీపీ ఎందుకు వ్యతిరేకించలేదు? లేక అది ఆ పార్టీ కోటా కాబట్టి మనకెందుకులే అని మౌనంగా ఉందా? ఈ లెక్కన వీర్రాజుకే మళ్లీ పార్టీ రాష్ట్ర పార్టీ పగ్గాలిస్తారా?.. ఇదీ ఇప్పుడు కూటమిలో హాట్ టాపిక్.
బీజేపీ నాయకత్వం సీనియారిటీకే పట్టం కట్టింది. పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. వీర్రాజుకు సీటు ఇవ్వడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాపు కోటాలో బీజేపీ నాయకత్వం సోముకు సీటిచ్చిన నేపథ్యంలో, ఆ వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన సోము సమర్ధవంతంగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం సూచనల మేరకు వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారన్న విమర్శలున్నప్పటికీ.. మొత్తంగా ఇప్పటి నాయకత్వం కంటే బాగా పనిచేశారన్న వ్యాఖ్యలు కూడా లేకపోలేదు.
మాస్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ, పురందేశ్వరి కంటే చురుకుగా పనిచేశారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపించాయి. ఇప్పుడు ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ..సంఘ్ మళ్లీ ఆయననే మండలికి పంపించడం బట్టి, సోము సేవలను మరోసారి వినియోగించుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తాజా ఎంపిక స్పష్టం చేసిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే తాజా సోము ఎంపిక నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి కేంద్ర నాయకత్వం వద్ద పట్టు, పలుకుబడి పలచబడిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి అసలు బీజేపీకి సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన, ఆలోచన ఆదివారం వరకూ లేదని చెబుతున్నారు.
అయితే సోము వీర్రాజు సన్నిహితుడైన పూర్వ రాష్ట్ర సంఘటనా మంత్రి రవీందర్‌రాజు, సోము శిష్యుడైన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చివరి నిమిషంలో రంగంలోకి దిగడంతో, మొత్తం సీన్ మారేందుకు కారణమయిందట. వారిద్దరూ పార్టీ జాతీయ సంఘటనా మహా మంత్రి బీఎల్ సంతోష్‌జీపై ఒత్తిడి తీసుకువచ్చిన కారణంగా, తమకు ఒక సీటివ్వాలని ఆదివారం ఢిల్లీ నుంచి టీడీపీ నాయకత్వానికి సందేశం వెళ్లిందని చెబుతున్నారు.
అంతకుముందు మాధవ్, పాకా సత్యనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, తపనా చౌదరి పేర్లు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ హటాత్ పరిణామాలతో టీడీపీ నాయకత్వం, తన పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్ధులను మాత్రమే ప్రకటించాల్సి వచ్చింది. లేకపోతే మరో నాయకుడికి అవకాశం వచ్చి ఉండేది.
కాపులకు చేరువుతున్న కమలం
సోముకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీజేపీ కాపులకు చేరువవుతున్నట్లు కనిపిస్తోంది. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు, బలమైన కారణాలు చాలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒక్క కాపు నేతకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో నలుగురు, ఒక ఎంపి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. నామినేటెడ్ చైర్మన్ పదవి తీసుకున్న లంకా దినకర్ కూడా, కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడే. అందువల్ల సామాజికవర్గ సమీకరణ కోసం, కాపు వర్గానికి చెందిన సోమును మళ్లీ ఎమ్మెల్సీ తెరపైకి తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. దీనితో కాపులకు దగ్గరవ్వాలన్న పార్టీ వ్యూహం నెరవేరినట్టయింది.
నిజానికి అంతకుముందు..మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు చర్చకు వచ్చినప్పుడు, ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలున్నందున ఆప్రాంతం నుంచి ఇవ్వకూడదన్న వాదన వినిపించింది. గతంలో సోము ఎమ్మెల్సీగా పనిచేసినందున, మళ్లీ ఆయనకు ఇవ్వకూడదని, రాయలసీమ నుంచి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్నందున.. రాజధాని గుంటూరు జిల్లాకు ప్రాతనిధ్యం ఇవ్వాలన్న వాదన వినిపించారు. అసలు ఇప్పటివరకూ అవకాశం రాని నేతకు అవకాశం ఇవ్వాలన్న చర్చ జరిగింది. గుంటూరు రాజధాని ప్రాంతమైనందున, అక్కడి నుంచి ప్రాతినిధ్యం లేకపోతే ఎలా? అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో బీజేపీ బలంగా ఉంటే, ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదన్న చర్చ చాలాకాలం నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే.
అంతా ఆమె వల్లనే…
కాగా ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎంపిక.. బీజేపీ అంతర్గత రాజకీయాలపై అవగాహన ఉన్న ఆ పార్టీ వాదులను పెద్దగా విస్మయానికి గురిచేయకపోయినప్పటికీ, వీర్రాజును వ్యతిరేకించే పార్టీలోని టీడీపీ అనుకూలవాదులను మాత్రం షాక్‌కు గురిచేసింది. అసలు చడీచప్పుడు లేకుండా రేసులోకి వచ్చి, సీటు సాధించడమే వారి విస్మయానికి అసలు కారణం. దీనికి కారణం రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి క్రియాశీలకంగా వ్యవహరించకపోవడమేనన్న వ్యాఖ్యలు ఆ పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.
నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నందున, పార్టీ కోటా నుంచి ఒక సీటు అడగాలా? వద్దా? దాని బదులు నామినేటెడ్ పదవి కోరాలా? వద్దా? అన్న అంశంపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కోర్ కమిటీని సమావేశపరిచి వారి అభిప్రాయాలు కోరిన దాఖలాలు లేవని సీనియర్లు చెబుతున్నారు. ‘‘సోము ఢిల్లీ స్థాయిలో ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తుందున, ఆయనకు రాకూడదన్న ధోరణితో మేడమ్ అసలు కోటాపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. పోనీ ఢిల్లీ నుంచి సోము తర్వాత కాపులలో ప్రత్నామ్నాయం ఎవరని సూచించిన సందర్భంలో.. పార్టీ కోసం రెండేళ్ల పదవీకాలం త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్సీ, బాపట్ల నేత సతీష్ పేరు సూచించినా ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు నాయకులతో ఆమె ఎప్పుడు మాట్లాడారని?! కోర్ కమిటీని ఉత్సవ విగ్రహంగా మార్చి ఏం సాధించారు? నాయకుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోని పార్టీ అధ్యక్షులను ఇప్పుడే చూస్తున్నాం’’ అని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. ఆరకంగా సోముకు ఎమ్మెల్సీ వచ్చేందుకు, పురందేశ్వరి వైఫల్యమే కారణమన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సంఘటనామంత్రి ఏం చేస్తున్నట్లు?
రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోర్ కమిటీ ఏర్పాటుచేసి, అభ్యర్ధి ఎంపికపై చర్చించి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేదంటున్నారు. అటు రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్‌జీ వైఫల్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని నేతలు స్పష్టం చేస్తున్నారు. కోర్ కమిటీ సమావేశం నిర్వహించి, అందులో సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుని వాటిని ఢిల్లీ పార్టీకి పంపించాల్సిన మధుకర్‌జీ , అంటీముట్టనట్లు వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ అసలు ఇన్నేళ్లు ఆయనను కొనసాగించడమే సంఘ్ చేస్తున్న తప్పు. మధుకర్‌జీ హయాంలో ఇక్కడ ఏం విజయాలు సాధించిందో ఎవరికీ అర్ధం కాదు. ఆయన వల్ల రాష్ట్రంలో పార్టీ ఏమాత్రం విస్తరించలేదు. కన్నా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోమును ఆయనే ప్రోత్సహించారన్నది బహిరంగరహస్యం. ఇప్పుడూ ఒక చేయి వేసి వేసే ఉంటారు. రాష్ట్ర అధ్యక్షులను సమర్ధవంతంగా నడిపించి, మార్గదర్శిగా ఉండాల్సిన సంఘటనామంత్రి హయాంలో, పార్టీ విఫలమవుతుంటే ఇంకా సంఘ్ ఆయనను కొనసాగించడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి సంఘ్‌కు ఇక్కడి నుంచి సరైన సమాచారం పోవడం లేదనుకోవాలి. లేదా సంఘ్‌కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదనుకోవాలని’’ అని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషించారు.
కూటమిలో కులం లెక్కలు కుదరలేదా?
తాజా ఎమ్మెల్సీల ఎంపికలో టీడీపీ నాయకత్వం కాపులకు సీటివ్వలేదు. ఇద్దరు బీసీ, ఒక దళితవర్గానికే చోటిచ్చింది. ఎలాగూ కాపు వర్గానికి చెందిన నాగబాబుకు.. జనసేన కోటాలో సీటు ఇచ్చినందున, మళ్లీ ఇక కాపులకు ఇవ్వడం ఎందుకున్న రాజకీయ కోణమే దానికి కారణమంటున్నారు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం కాపు వర్గానికి చెందిన సోముకు సీటివ్వడంతో.. ఈ సామాజికవర్గ సమతుల్యం దెబ్బతిన్నట్లయిందని, దీనితో కాపుల్లో టీడీపీ అప్రతిష్ఠపాలు కావలసిన పరిస్థితి ఏర్పడిందన్న వ్యాఖ్యలు, అటు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ జత కూడిన తర్వాత, తమ పార్టీ నాయకత్వం కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి టీడీపీ కాపులలో స్పష్టంగా కనిపిస్తోంది.
టీడీపీ బీసీ,ఎస్సీలు, జనసేన కాపు వర్గానికి సీట్లు ఇచ్చినందున, బీజేపీ మరో వర్గానికి సీటిస్తే సామాజిక సమీకరణ సరిపోయేదన్న విశ్లేషణ కూటమి నుంచి వినిపించింది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ కూడా కాపులకే సీటివ్వడం ద్వారా.. జనసేన-బీజేపీలు మాత్రమే కాపులకు న్యాయం చేసి, టీడీపీ ఒక్కటే అన్యాయం చేసిందన్న అసంతృప్తి ఏర్పడేందుకు కారణమయిందని.. అటు టీడీపీ కాపు నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తమకు కాపు వర్గాల్లో తమకు ప్రతికూల అంశమేనని అంగీకరిస్తున్నారు.
రాజుకు పెట్టిన షరతులు సోముకు ఎందుకు పెట్టలేదు?
తాజా పరిణామాలు టీడీపీ శ్రేణులను విస్మయపరిచాయి. సోము వీర్రాజుపై వైసీపీ అనుకూల ముద్ర బాహాటంగా ఉన్నప్పటికీ, ఆయనను ఎలా ఎంపిక చేశారు? ఆయన పేరును ఎంపిక చేసిన తర్వాత.. ఆ విషయాన్ని నాయకత్వానికి సమాచారం ఇచ్చిన సమయంలో, సోము పేరు ప్రతిపాదనను పార్టీ నాయకత్వం ఎందుకు వ్యతిరేకించలేదు? ఈ విషయంలో పార్టీ నాయకత్వం మౌనంగా బీజేపీ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించింది? గతంలో ఆయన టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలు బీజేపీ నాయకత్వానికి ఎందుకు గుర్తు చేయలేదు?
పార్టీ కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేమని ఎందుకు స్పష్టం చేయలేకపోయిందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు జగన్ హయాంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు చంద్రబాబుపై చేసిన విమర్శల వీడియోలు మళ్లీ సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. మరి ఇప్పుడు సీటు ఇచ్చినందున, గతంలో సోము చేసిన విమర్శలకు క్షమాపణ కోరతారా? అని ప్రశ్నిస్తున్నారు.
కాగా దీనిపై టీడీపీ-బీజేపీ సోషల్‌మీడియా గ్రూపులలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల ముందు నర్సాపురం సీటు రఘురామకృష్ణంరాజుకు తప్ప ఎవరికయినా అడగండి అన్న బీజేపీ తరహాలోనే.. సోము వీర్రాజుకు మినహా ఎవరికయినా సీటు ఇవ్వండి అన్న షరతు టీడీపీ నాయకత్వం విధిస్తే, ఆయనకు సీటు వచ్చేది కాదని టీడీపీ కార్యకర్తలు పోస్టింగులు పెడుతున్నారు.
అయితే.. పొత్తులో బీజేపీకి ఒక సీటు కేటాయించిన తర్వాత, ఎవరికి సీటు ఇవ్వాలన్నది మా పార్టీ ఇష్టం తప్ప, అందులో టీడీపీ ప్రమేయం ఏమిటని అటు బీజేపీ కార్యకర్తలు ఘాటుగా బదులిస్తున్న విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.