Suryaa.co.in

Andhra Pradesh

రైతు భరోసా కేంద్రాలు కాదు..అవి రైతు భక్షక కేంద్రాలు

– మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రైతు భరోసా కేంద్రాలతో ఏం సాధించారని అంతర్జాతీయ అవార్డులు వస్తాయంటున్నారు. ఆర్బీకేల ద్వారా కనీసం విత్తనాలు సరఫరా చేశారా..రైతులకు పురుగు మందులు అందుబాటులో ఉంచారా? వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో ఎన్ని వేల కోట్లు కేటాయించారు..ఎంత ఖర్చుపెట్టారు?

విత్తనాలు కావాలంటే రైతులు వచ్చి ఒక లారీ లోడుకు సరిపడా ముందస్తుగా డబ్బులు కడితేనే తెప్పిస్తున్న దుస్థితి. ప్రతి గింజా ధాన్యం కొంటాం, రవాణా ఖర్చులు మావే, హమాలీ ఖర్చులు మావే, గోతాలు మావే అంటూ ఆర్భాటపు ప్రచారంతో ఆర్బీకేల వద్ద పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామంటున్నారు..ఏ ఆర్బీకే ద్వారా ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెప్తారా? ఏ ఆర్బీకేలో రైతుకు నూరు శాతం మద్దతు ధర లభించిందో చెబుతారా..ఈ అంశంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు అఖిలపక్షాన్ని వేయండి.

రాష్ట్రంలో 10700 ఆర్బీకేలు ఉన్నాయని చెబుతున్నారు…వాస్తవానికి ప్రారంభించింది వెయ్యి మాత్రమే..మేం ధాన్యం మద్దతు ధర కోసం పోరాటం చేస్తే 3000కి పెంచారు.ఉదాహరణకు ఒక్క నెల్లూరు జిల్లాలో 20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే మీరు కొనుగోలు చేశామని చెబుతున్నది 2 లక్షల టన్నులు మాత్రమే. ఈ 2 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి నిజంగా ఎంత మంది రైతులకు మద్దతు ధర లభించిందో చెప్పగలరా?

కనీస మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకి రూ.1560 రైతుకు లభించాలి. కానీ రైతులు నిస్సహాయ స్థితిలో రూ.1100, రూ.1200కి బయట అమ్ముకున్నారు. ఆర్బీకేల్లో పుట్టికి 850కిలోలకు అదనంగా 200 నుంచి 250 కిలోలు తీసుకున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్వింటాలు ధాన్యాన్ని రూ.1960కి గాను రూ.1300, రూ.1400కి అమ్ముకున్నారు. గోదావరి జిల్లాల్లో రోడ్లపై పోసుకుని కొనుగోలు చేయండయ్యా అని పోరాటం చేస్తున్నారు. ఆర్బీకేలతో వైసీపీ నాయకులకు సంబంధించిన దళారులు, మిల్లర్లు బాగుపడుతున్నారు తప్ప రైతులకు ఒరిగిన ప్రయోజనం శూన్యం.

అవి రైతు భరోసా కేంద్రాలు కాదు..రైతు భక్షక కేంద్రాలు. వాటిలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాములు ఉన్నాయా? మా హయాంలో పీఏసీఎస్ లలో గోదాములతో పాటు ఎరువులు అందుబాటులో ఉండేవి…వారికి పెట్టుబడులు అందుబాటులో ఉండేవి.

ఈ రోజు ఏ ఆర్బీకేలో ఒక లోడు ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయో చెప్పగలరా? ఆర్బీకేలు అని డబ్బా కొట్టుకోవడం తప్ప రైతులకు ప్రయోజనం శూన్యం. టీడీపీ ప్రభుత్వ హయాంలో మేం విత్తనాల కోసం రూ.300 కోట్లకు పైగా ఖర్చుపెట్టాం, యాంత్రీకరణ కోసం రూ.500ఏడాదికి రూ.1200 కోట్లు మైక్రో ఇరిగేషన్ కు ఖర్చు పెట్టాం.

వైసీపీ మూడేళ్ల పాలనలో వ్యవసాయం కోసం మీరెంత ఖర్చుపెట్టారో చెప్పగలరా? కనీసం భూసార పరీక్షలు చేయకుండా రైతు భరోసా కేంద్రాలు ఏట్లో వేసుకోవడానికా?దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలను ఏపీలో లేకుండా చేసి రైతులను సర్వనాశనం చేశారు. ఈ విషయాలను నిరూపించడానికి మీరు అఖిలపక్షం వేసిన జ్యూడిషయల్ కమిటీ వేసినా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

LEAVE A RESPONSE