Suryaa.co.in

Telangana

మెడికల్ కోటా సీట్లపై దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి

– తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడు విద్యార్ధులకూ ఆ తీర్పుతో నష్టమే
– తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం
– రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం
– సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్
– కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచన
– పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దు పై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన

హైదరాబాద్: పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విషయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై అవసరం అయితే దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిసి రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది. మెడికల్ కాలేజీల్లో అగ్రగామి ఉన్న తెలంగాణలో, ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య విద్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. 2014 వరకు 5గా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 34కు చేర్చారు. మారు మూల జిల్లాల్లో సైతం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పీజీ సీట్లలో రెండో స్థానంకు చేరింది.

2025 నాటికి తెలంగాణలో 2924 పీజీ సీట్లు ఉండగా, 50శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం, 1462 పీజీ సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే వచ్చేవి. కానీ, తాజా సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఈ 1462 సీట్లు కూడా ఆల్ ఇండియా కోటా లోకి వెళ్లిపోతాయి. అంటే మొత్తం 100 శాతం సీట్లు నేషనల్ పూల్ కే తరలిపోనున్నాయి. తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారింది.

తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు గడిచిన 77 ఏండ్లుగా వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, మెడికల్ విద్యను ప్రోత్సహించాయి. వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి.

తెలంగాణలో ఒక పీజీ స్టుడెంట్ 12,799 మందికి వైద్య సేవలందిస్తే, కర్ణాటకలో 10,573 మందికి, ఏపీలో 15,079 మందికి, తమిళనాడులో 15,123 మందికి, కేరళలో 18,662 మందికి సేవలు అందిస్తున్నారు. ఈ విషయంలో దేశ సగటు 20,460 ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి రెండు మూడు రెట్లు ఉన్నాయి. ఈ నిర్ణయం వలన ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది.
పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది ప్రశ్నార్థకం అవుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ప్రభుత్వాల లక్ష్యాలు నీరుగారుతాయి. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జులై 19, 2019న లోక్ సభలో ఎంపీ మనోజ్ కోటక్ అడిగిన ప్రశ్నకు ‘హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టంగా చెప్పారు.

దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వంలోని మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తాయి. పీజీ విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. లోకల్ రిజర్వేషన్ లేని పక్షంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులకు, వైద్య విద్యార్థుల సేవలు ఆయా రాష్ట్రాల్లో వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుంది. వైద్య రంగంలో మానవ వనరులు కొరత ఏర్పడి, వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది.

సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఎన్నో విధాలుగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన తమిళనాడు ప్రభుత్వం, సుప్రీం కోర్టు కానిస్టిట్యుషన్ బెంచ్ కు పోవాలని నిర్ణయం తీసుకున్నది. ఇదే స్పూర్తితో తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టు కానిస్టిట్యుషనల్ బెంచ్ కు పోవాలని, ఈ తీర్పుపై స్టే తీసుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE