•ప్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు వసుధా మిశ్రా కమిటీ ఏర్పాటు
•10-15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక.. తక్షణమే తగిన చర్యలు
•పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం
•చట్ట ప్రకారం కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం
•ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ
రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్
అమరావతి, డిశంబరు 10: రాష్ట్రంలోని కార్మికుల భద్రతకు, సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్మాగారాల్లో ప్రమాదాల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వసుధా మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను పరిశీలించి, ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేసే అవకాశముందని, అది అందిన వెంటనే తగు చర్యలు చేపడతామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో కార్మికశాఖపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మందుకువెళ్లడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 96 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యలమంచిలి, గుణదలలో ఈఎస్ఐ ఆస్పత్రులను ప్రారంభించామన్నారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో 150 మరియు 500 పడకల ఆస్పత్రికి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే ఇవి అన్నీ కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతామన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ ఆసుపత్రుల నిర్వహణకు కేంద్రం నుండి ఏడాదికి దాదాపు రూ.400 కోట్లు వరకూ నిధులు వస్తాయని, అయితే వాటిలో రూ.1.60 కోట్లను మాత్రమే వినియోగించుకుని, మిగిలిన సొమ్మును గతంలో వెనక్కు పంపివేయడం జరిగిందన్నారు. ఈ విధంగా గత ఐదేళ్లలో దాదాపు రూ.610 కోట్లు వెనక్కు వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈఎస్ఐ ఆస్పత్రులను అన్నింటినీ గాడినపెట్టే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలు కలెక్షన్ ఏజెన్సీలుగా మారిపోయాయన్నారు. ప్యాక్టరీలపై తప్పుడు కేసులు పెట్టి వారి నుండి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేశారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఎసెన్షియా ప్రమాదంలో 15 మంది చనిపోయారన్నారు. అటు వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకై ప్యాక్టరీల్లో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా కర్మాగార, భవన నిర్మాణ కార్మికులకు అన్నివిధాలుగా సహకారం అందేలా చూస్తామని, వారికి చట్టప్రకారం అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు.