చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి నాగరాణి
ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లితో మర్యాద పూర్వక భేటీ, అధికారులకు దిశా నిర్ధేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు చేనేత కార్మికుల స్వావలంబనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి తెలిపారు. చేనేతల ప్రయోజనం కోసం ఇప్పటికే ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని క్షేత్ర స్ధాయికి తీసుకువెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ అమలు చేస్తామన్నారు. యువజన సర్వీసుల శాఖ సంచాలకులుగా ఉన్న నాగరాణి ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా చేనేత, జౌళి శాఖ సంచాలకులుగా నియమితులయ్యారు. శుక్రవారం విజయవాడ నగరంలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న నాగరాణి , సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన రావును మర్యాద పూర్వకంగా కలిసారు.
అనంతరం చిల్లపల్లి, చదలవాడలు సంయిక్తంగా అధికారులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తెరిగి అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎంతో ఉదారంగా చేనేతల కోసం నేతన్న నేస్తం అమలు చేస్తున్నారని దానిని సద్వినియోగ పరుచుకునేలా నేతన్నలను ప్రేరేపించాలని చిల్లపల్లి కోరారు. రానున్న రోజుల్లో చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం మరిన్ని పధకాలు తీసుకురానుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు మురళీ కృష్ణ, సంయిక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఉఫ సంచాలకులు నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు నూతన సంచాలకురాలు నాగరాణిని కలిసి అభినందనలు తెలిపారు.