బీజేపీ అధ్యక్ష పదవికి సోము వీర్రాజు రాజీనామా?

– వరస పరాజయాలు, విమర్శలతో మనస్తాపం
– నైతిక కారణాలతో రాజీనామా నిర్ణయం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి, ఇప్పటి మున్సిపల్ , నగర పంచాయితీ ఎన్నికల వరకూ.. అన్ని ఎన్నికల్లోనూ వరసగా ఎదురవుతున్న పరాజయ పరాభవానికి నైతిక బాధ్యత వహించి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
తాను ఎంత కష్టపడుతున్నా.. పార్టీలోని సీనియర్లు తనకు సహకరించడం లేదన్న అసంతృప్తి, ఆయనలో చాలా కాలం నుంచి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా.. రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోథర్, ఆయనపై బలవంతంగా రుద్దుతున్న నిర్ణయాలు కూడా, వీర్రాజును పార్టీ సీనియర్లకు దూరం చేశాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఆరోగ్యం సహకరించకపోయినా,చివరకు కరోనా బారిన పడినా లెక్కచేయకుండా, పార్టీ కోసం తాను ఎంతో కష్టపడుతున్నా.. ఏ ఎన్నికల్లో కూడా, చివరకు పంచాయితీ ఎన్నికల్లోనూ దారుణ ఫలితాలు రావడం ఆయనను మనస్తాపానికి గురిచేసిందంటున్నారు.
ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో తన పాత్రను తగ్గించేందుకు, కడప జిల్లా నేతలు చేసిన ప్రయత్నాలు వీర్రాజును బాధించాయని చెబుతున్నారు. ఈ నిందలు, అవమానాలు, విఫలనేత అన్న విమర్శలు భరించే కంటే, గౌరవప్రదంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే మంచినని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
సోము వీర్రాజుపై కో ఇన్చార్జి సునీల్ దియోథర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభావం ఎక్కువగా ఉందన్న ప్రచారం.. వీరిపై చతుష్టయమన్న ముద్ర చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే సహజంగా సౌమ్యుడయిన వీర్రాజు.. సునీల్ దియోధర్, జీవీఎల్, ఒక ప్రధాన కార్యదర్శి ప్రభావానికి గురవడంతో సీనియర్లకు దూరం కావలసి వచ్చిందని చెబుతున్నారు. వీర్రాజును నిమిత్తమాత్రుడిని చేసి.. సునీల్ వెనుకనుంచి స్టీరింగ్ నడుపుతున్నారన్న విమర్శలు, ఆయన సలహా ప్రకారమే ఎంపీలను కోర్ కమిటీకి ఆహ్వానించడం లేదన్న ఆరోపణలు చాలాకాలం నుంచి పార్టీలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.
నిజానికి మొదట్లో జనసేన దళపతి పవన్ కల్యాణ్‌ను.. మోదీ వద్దకు తీసుకువెళ్లింది వీర్రాజే అయినప్పటికీ, తర్వాత పవన్ కూడా ఆయనను విశ్వసించకపోవడం వీర్రాజును మనస్తాపానికి గురిచేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నలుగురు నాయకులు వైసీపీతో సత్సంబంధాలు నెరపుతున్నారన్న అనుమానంతోపాటు,వైసీపీలో నెంబర్‌గా ఉన్న ఎంపీతో..బీజేపీ ఎంపీ సహా ముగ్గురు అంటకాగుతున్నారని, పవన్ ఢిల్లీ నాయకత్వం వద్ద ఫిర్యాదు చేశారంటున్నారు. ఆ నలుగురు అధికారంలో ఉన్న వైసీపీపై కాకుండా.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శించడం వల్ల, బీజేపీతో కలసినంతకాలం తమ పార్టీకి మనుగడ ఉండదన్న తమ పార్టీ నేతల హెచ్చరికలను, పవన్ బీజేపీ చీఫ్ నద్దాకు స్పష్టం చేశారంటున్నారు. కొందరు బీజేపీ అగ్రనేతలు వైసీపీ సర్కారు ఆశీస్సులతో, వ్యాపారాలు చేసుకుంటున్నారని కూడా పవన్ ఫిర్యాదు చేసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే ఇకపై తాను రాష్ట్ర పార్టీతో కాకుండా ఢిల్లీ నాయకత్వంతోనే మాట్లాడతానని.. రాష్ట్ర నేతలతో మాత్రం నాదెండ్ల మనోహర్ మాట్లాడతారని, పవన్ స్పష్టం చేసిన విషయాన్ని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి ఉద్యమానికి మద్దతు విషయంలో బీజేపీ నాయకత్వం.. ముఖ్యంగా సునీల్ దియోధర్, సోము వీర్రాజు, మరో ప్రధాన కార్యదర్శి చేస్తున్న ప్రకటనలు- వ్యాఖ్యల వల్ల తమకూ నష్టం జరుగుతోందని బీజేపీ ఢిల్లీ నాయకత్వానికి పవన్ స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు.
బీజేపీ చేసే కార్యక్రమాల్లో జనసేనకు భాగస్వామ్యం లేనందువల్లే, తాము కూడా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సివస్తోందని, పవన్ వివరణ ఇచ్చారని అటు జనసేన నేతలు సైతం చెబుతున్నారు. అయితే సోము వీర్రాజుపై పవన్‌కు వ్యక్తిగత కోపం లేకపోయినప్పటికీ.. ఆయనను సునీల్‌తోపాటు, ఒక ఎంపీ తప్పుదోవపట్టిస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నట్లు జనసేన నేతల విశ్లేషణ. వీరంతా వైసీపీ ఎంపీ ఒకరితో టచ్‌లో ఉన్నారని పవన్ బలంగా అనుమానిస్తున్నందుకే వారికి ఆయనను పట్టించుకోవడం లేదని జనసేన వర్గాలు సైతం చెబుతున్నాయి.
మిత్రపక్షమైన జనసేన సహాయ నిరాకరణతోపాటు, స్థానిక సంస్థలు-తిరుపతి లోక్‌సభ-బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసేన ఏమాత్రం కలసిరాకపోగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలసి పనిచేయడం కూడా, వీర్రాజును మనస్తాపానికి గురిచేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘సునీల్ వైఖరి వల్ల సోము సీనియర్లకు దూరం కావలసి వచ్చింది. ఆయన వైఖరితో వీర్రాజు చాలా ఇబ్బందిపడుతున్నారు. కానీ సునీల్‌ను ప్రశ్నించలేని పరిస్థితి ఆయనది’ అని తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంపై ఆయన కంటే, ఇతరుల పెత్తనమే ఎక్కువని చెబుతున్నారు.
ప్రధానంగా తాను అధ్యక్ష పదవి స్వీకరించిన నాటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ.. పార్టీ ఘోర ఓటమి పాలవడం, సొంత జిల్లాలో నోటా కంటే తక్కువ ఓట్లు రావడం, తన అనుమతి లేకుండానే అనేక జిల్లాల్లో టీడీపీ-బీజేపీ పొత్తులు పెట్టుకోవడం, వీర్రాజును మనస్తాపానికి గురిచేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అటు సోషల్‌మీడియాలో సైతం.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలో బీజేపీ మరింత పతనమయిందన్న విమర్శలపై, ఆయన చాలాకాలం కుమిలిపోయారంటున్నారు. పైగా మీడియా సహకారం లేకపోగా, వెల్లువెత్తుతున్న విమర్శలతో ఆయన విసిగిపోయారంటున్నారు.
నిజానికి ఏపీలోని మీడియాపై నిషేధ నిర్ణయంలో సునీల్-సోము పాత్ర ఉన్నా, అందరూ తననే నిందించడంపై ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. వీటికి మించి.. తన సొంత తూర్పు గోదావరి జిల్లాలో తనకు మద్దతు లేకపోగా, తన నిర్ణయాలను వ్యతిరేకించే నేతల సంఖ్య పెరగడం ఆయనను కలచివేసిందంటున్నారు. కాకినాడ మేయర్‌పై అవిశ్వాస ఎన్నికలో, పార్టీని ధిక్కరించిన కార్పొరేటర్‌పై ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడం కూడా, వీర్రాజుపై విమర్శలకు ఒక ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న బీజేపీ నేతలకు ఫోన్లు చేసి, సంజాయిషీ అడిగిన వైనం.. అమిత్‌షా వరకూ వెళ్లడంతో, ఇక మరిన్ని అవమానాలు ఎదుర్కొనే కంటే గౌరవప్రదంగా అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని వీర్రాజు సన్నిహితులు చెబుతున్నారు.
‘నాకు మా జిల్లాలో వీర్రాజు మనిషిగా బలమైన ముద్ర ఉంది. కానీ ఆయన నాకంటే మిగిలిన వారికే ఎక్కువ చేశారు. మా జిల్లాలో ఇప్పుడు ఆయన పక్కన చేరిన నాయకులే, వీర్రాజు గారిని తప్పుదోవపట్టిస్తున్నార’ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు వ్యాఖ్యానించారు.
తాజాగా అమిత్‌షా సమక్షంలో జరిగిన భేటీలో సైతం.. తన నాయకత్వ నిర్ణయాలను ఆక్షేపించిన వైనంతో, గౌరవప్రదంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే మంచిదన్న భావనకు వచ్చారని చెబుతున్నారు. ‘ఆయన ఇప్పటి పరిస్థితిలో పనిచేయలేకపోతున్నారు. సంఘ్ కార్యకలాపాలలో తప్ప, రోజువారీ రాజకీయాల్లో అనుభవం లేకపోవడంతో, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. విఫల నేతగా మరిన్ని విమర్శలు ఎదుర్కొనే కంటే, ఎన్నికల్లో వరస ఓటమికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే మంచిదని భావిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా- టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న అనుమానపు చూపులు, ఆరోపణలు ఆయన భరించలేకపోతున్నారు. నిజానికి ఒకసారి పార్టీ అధ్యక్షుడు కావాలన్న ఆయన జీవితకాలపు కోరిక కూడా ఎలాగూ నెరవేరింది. ఎదురుచూడని ఎమ్మెల్సీ అవకాశం కూడా వచ్చింది. వీర్రాజు లాంటి సాధారణ కార్యకర్తకు అంతకుమించిన గౌరవం ఇంకేముంటుంది?
అటు ఢిల్లీ నాయకత్వం కూడా, రాష్ట్రంలో పార్టీ స్టాండ్ ఏమిటని స్పష్టం చేయకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఒకరిచేతిలో కీలుబొమ్మగా ఉన్నారన్న అపప్రధ ఎదుర్కోవడం కంటే, గౌరవప్రదంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే మంచిదని ఆయన భావిస్తున్నార’ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు.

Leave a Reply