అహంకారాన్ని సత్యాగ్రహం ఓడించింది.. రైతు గెలిచాడు

– ‘కొత్త సాగు చట్టాల రద్దు’పై రాహుల్‌, ప్రతిపక్ష నేతల స్పందన
న్యూ ఢిల్లీ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తోన్న ఆందోళనకు కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సంచలన ప్రకటన చేశారు. దీంతో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ‘ఇది అన్నదాతల విజయం’ అంటూ రైతులకు శుభాకాంక్షలు తెలిపాయి.
ప్రధాని మోదీ ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘దేశ అన్నదాతలు తమ సత్యాగ్రహంతో అహంకారాన్ని తలదించేలా చేశారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరిలో తాను పోస్ట్‌ చేసిన ఓ పాత వీడియోను కూడా పంచుకున్నారు. అందులో ‘‘నా మాటలు గుర్తుపెట్టుకోండి.. ప్రభుత్వం బలవంతంగానైనా ఈ చట్టాలను రద్దు చేస్తుంది’’ అని రాహుల్‌ చెప్పినట్లుగా ఉండటం గమనార్హం.

తాను ఆనాడు చెప్పిందే నేడు నిజమైందని ఆయన చెప్పకనే చెప్పారు. రాహుల్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు.
‘‘ఈ ప్రకాశ్‌ దివస్‌ నాడు మంచి వార్త విన్నాం. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు ఫలితం దక్కింది. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. దేశ రైతులకు సెల్యూట్‌’’ – దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌
‘‘అహంకారం వీగింది.. దేశ రైతు గెలిచాడు’’-కాంగ్రెస్‌ ‘‘క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతులకు హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ – పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ


Leave a Reply