Suryaa.co.in

Devotional

జయహో కృష్ణావతారా..!

యుగానికో ధర్మం..
అదేగా శ్రీకృష్ణుని మర్మం..
ఆడితప్పక రాముడు ఆదర్శప్రాయుడైతే
పూటకో నాటకమాడి
జగన్నాటక సూత్రధారి
అయినాడు నల్లనయ్య..!

ముగ్గురమ్మల ముద్దులకూనగా
రాముని బాల్యం
మధురాతి మధురం..
మధురలో పుట్టినా
కిష్టయ్య చిన్నతనం
దినదిన గండం..
కారాగారంలో జననం..
పసిగుడ్డుగా బుట్టలో
జడివానలో పయనం..
అటు రేపల్లెలో
పేరుకే వ్యాహ్యాళి
అడుగడుగునా మృత్యుకేళి..!

హరివిల్లు విరిచి సీతమ్మను మనువాడితే రామయ్య
ఎత్తుకొచ్చి రుక్మిణమ్మని
కన్నెల దొంగ
కాలేదా కృష్ణయ్య
ఆలిపై నిందవేస్తే రఘుపతి
తానే నిందలు మోసె శ్రీపతి..!

సత్యసంధుడై రామయ్య
కీర్తిగాంచితే..
పొసగని సంధి..
పార్ధుని సారధి..
దార్తరాష్ట్ర విరోధి..
ఎన్ని పేరులో..
ఎన్నెన్ని తారుమారులో
ఈ లీలావినోదికిన్..
హతవిధీ..!

వంశోద్ధారకుడను కీర్తితో
తానుగా అవతారపరిసమాప్తి గావించినాడు రామయ్య..
వంశక్షయంబునకు కారకుడై
ఖేదమున ఒంటరై..
శరాఘాతమ్ముతో
మహాభినిష్క్రమణం
చేసినాడు మాధవుడు..!

మాయలే చేసినా..
మంత్రాలే పన్నినా..
అంతటి రణానికి
తానే కారణమైనా..
సత్యధర్మాలే బంధుగణం..
దీనజనోద్ధరణే గుణం..
అవతార ధర్మం
లోకకళ్యాణం..!
కృష్ణయ్యా..నీ సాటి ఎవరయ్యా..!!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE